అమెరికాలో మళ్లీ కాల్పులు | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పులు

Published Sun, Dec 31 2017 3:07 AM

Authorities say 2 dead including gunman at Southern California office - Sakshi

లాంగ్‌బీచ్‌/హూస్టన్‌: అమెరికాను మళ్లీ కాల్పులు వణికించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని లాంగ్‌బీచ్‌లో జరిగిన ఘటనలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపటంతో ఓ వ్యక్తి మరణించాడు. తర్వాత ఆ దుండగుడిని పోలీసులు హతమార్చారు. హూస్టన్‌లోని ఆటోషాప్‌లో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. లాంగ్‌బీచ్‌ నగరంలోని ప్రధాన కూడలిలోని రెండంతస్తుల భవనంలో పలు ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. మధ్యాహ్నం 2.25 (స్థానిక కాలమానం ప్రకారం) గంటల ప్రాంతంలో అందరూ పనిచేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి చొరబడి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయాడు. కార్యాలయంలో ఉన్నవారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు డెస్కుల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లో స్పందించిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని కాల్చి చంపారని మేయర్‌ రాబర్ట్‌ గార్సియా వెల్లడించారు. అటు హూస్టన్‌లో జరిగిన ఘటనలో.. ఆటో షాప్‌లో గతంలో పనిచేసిన ఓ వ్యక్తి ఇటీవలే ఉద్యోగం మానేశాడు. ఏం జరిగిందో తెలియదు గానీ.. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో (స్థానిక కాలమానం) దుకాణంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఉద్యోగులతోపాటు పలువురు వినియోగదారులూ షాప్‌లో ఉన్నారు. హఠాత్తుగా కాల్పులు ప్రారంభించిన ఆ వ్యక్తి ఇద్దరు ఉద్యోగులను చంపేసి బయటకు వచ్చాడు. అనంతరం తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement