యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు | 33 killed in arson attack at Japan anime studio | Sakshi
Sakshi News home page

యానిమేషన్‌ స్టూడియోకు నిప్పు

Jul 19 2019 4:25 AM | Updated on Jul 19 2019 4:25 AM

33 killed in arson attack at Japan anime studio - Sakshi

టోక్యో: జపాన్‌లోని ప్రముఖ యానిమేషన్‌ స్టూడియోకు ఓ వ్యక్తి నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని 33 మంది చనిపోగా దాదాపు అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. జపాన్‌ వాసులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటన క్యోటోలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ దుండగుడు స్థానిక క్యోటో యానిమేషన్‌ స్టూడియోలోకి  ప్రవేశించాడు. ‘మీరు చస్తారు’ అని అరుచుకుంటూ ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి, ఆ వెంటనే నిప్పంటించాడు.

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా ప్రాణ భయంతో పైనున్న మూడంతస్తులకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు మంటల తీవ్రత నుంచి తప్పించుకోలేకపోయారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది 33 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 20 మృతదేహాలు మూడో ఫ్లోర్‌లోనే పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 36 మంది కాలిన గాయాలపాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధితుల్లో చాలా మంది కంపెనీ ఉద్యోగులేనని తెలిపారు.

ఈ ఘటనలో గాయపడిన నిందితుడి(41)ని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడు కంపెనీ ఉద్యోగి కాదని మాత్రమే పోలీసులు వెల్లడించారు. తన వస్తువును క్యోటో యానిమేషన్‌ కంపెనీ దొంగతనం చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదానికి అతడు గ్యాసొలిన్‌ను వాడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలి నుంచి పోలీసులు కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి నిందితుడివేనా కాదా అనేది తెలియరాలేదు.

ప్రమాదం సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లకీ స్టార్, కె–ఆన్, హరుహి సుజుమియాతోపాటు పోకెమాన్, విన్నీది పూహ్‌ వంటి యానిమేషన్‌ చిత్రాలతో క్యోటో యానిమేషన్‌ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కాగా, జపాన్‌లో ఇటువంటి విద్రోహ చర్యలు జరగడం చాలా అరుదు. 2001లో టోక్యోలో అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఓ వ్యక్తి టోక్యోలోని నర్సింగ్‌ హోం వద్ద కత్తితో దాడి చేసి 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు.  
స్టూడియో వద్ద సహాయక చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement