
మూడేళ్ల బుడ్డోడు భూమిని కబ్జా చేశాడు!
బుడిబుడి అడుగులతో తప్పటడుగులు వేసే మూడేళ్ల బాలుడు ఓ ప్లాజాకు చెందిన భూమిని కబ్జా చేశాడు!
ఇస్లామాబాద్: బుడిబుడి అడుగులతో తప్పటడుగులు వేసే మూడేళ్ల బాలుడు ఓ ప్లాజాకు చెందిన భూమిని కబ్జా చేశాడు! ఆస్తిని కూడా దొంగలించాడు! నిజమా? అని విస్తుపోకండి. పాకిస్థాన్ పోలీసులు పెట్టిన వికృత కేసు ఇది. మూడేళ్ల బాలుడుపై వారు భూకబ్జా, ఆస్తి దోపిడీ కేసు పెట్టారు. ఇస్లామాబాద్‌లోని సెక్టర్ 10కు సంబంధించిన ప్లాజా భూమిని కబ్జాచేసి, ఆస్తిని దొంగలించినట్టు అతనిపై షాలిమార్ పోలీసు స్టేషన్ పోలీసులు అభియోగాలు మోపారు.
పోలీసుల చర్యతో బిత్తరపోయిన ఆ చిన్నారి కుటుంబసభ్యులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. తమ చిన్నారి అరెస్టు కాకుండా చూడాలని అభ్యర్థించారు. కోర్టు కూడా పోలీసులు చేసిన బండతప్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అసలు మూడేళ్ల బాలుడికి ముందస్తు బెయిల్ తీసుకోవాల్సిన అవసరముందా? అని ఆ చిన్నారి తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో చిన్నారి పేరును కూడా చేర్చడంతో బెయిల్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని లాయర్ వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఒక వ్యవస్థ తప్పు చేస్తే, కోర్టు కూడా కళ్లు మూసుకొని ఉండాలా? అని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో స్టెషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారి తమ ముందు హాజరై వాదన వినిపించాలని ఆదేశించారు. పాకిస్థాన్‌లో చిన్నారులపై కేసులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది లాహోర్‌లో తొమ్మిది నెలల బాలుడిపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఇప్పటికీ బ్రిటిష్ కాలపు చట్టాలు, నిబంధనలు అనుసరిస్తున్న పాకిస్థాన్ పోలీసులు తీవ్ర అవినీతిలో కూరుకుపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి.