రూ.15 కోట్ల విలువైన ఏపీహెచ్‌బీ భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయింపు
తొలుత విశాఖ పరదేశిపాలెంలో విలువైన 74 సెంట్లు కేటాయింపు
నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో ఈ కేటాయింపు రద్దు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ భూమికి బదులు మరో భూమి కోరిన ఆంధ్రజ్యోతి
దీంతో ఏపీహెచ్‌బీ భూమి 50 సెంట్లు, ప్రభుత్వ భూమి 24 సెంట్లు కేటాయింపు
ఏపీహెచ్‌బీకి భూమార్పిడి కింద మరోచోట 64 సెంట్లు
సాక్షి, అమరావతి: మీడియా ముసుగులో నిరంతరం తనకు భజన చేసే తోక పత్రిక ఆంధ్రజ్యోతి (ఆమోద పబ్లికేషన్స్)కి చంద్రబాబు విశాఖలో అప్పనంగా రూ.15 కోట్ల విలువైన 74 సెంట్ల భూమిని కట్టబెట్టారు. 2012లో విశాఖపట్నం రూరల్ మండలం పరదేశిపాలెంలో ఆమోద పబ్లికేషన్స్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం 1.5 ఎకరాల భూమిని కేటాయించింది.
ఆ భూమిని వినియోగించకపోవడం, ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ అవడంతో 2020లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. దీనిపై ఆ సంస్థ కోర్టుకెళ్లగా గత ఏడాది నవంబర్ 29న ఈ భూ కేటాయింపుపై చట్టప్రకారం ముందుకెళ్లాలని తీర్పు ఇచి్చంది. దీన్ని సాకుగా చూపి చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూమికంటే ఎక్కువ విలువైన భూమిని ఇటీవల ఉచితంగా ఆంధ్రజ్యోతికి కేటాయించింది. ఇందుకోసం ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరింత విలువైన భూమిని ఆ సంస్థ నుంచి వెనక్కి తీసుకుని మరీ ఆమోద పబ్లికేషన్స్‌కి ఇస్తూ డిసెంబర్ 12న రెవెన్యూ శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 492 జారీ చేసింది.
ఆఘమేఘాల మీద నడిచిన ఫైలు..
12 రోజుల్లో క్లియర్
అత్యంత విలువైన పరదేశిపాలెంలోని భూమిపై కన్నేసిన ఆంధ్రజ్యోతి ఎండీ తమ సంస్థ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరడంతో 2012లో అప్పటి ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించింది. కానీ అందులో ఎటువంటి నిర్మాణం చేయలేదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆమోద పబ్లికేషన్స్‌కు భూమి కేటాయించినట్లు పలువురు స్థానికులు 2020లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దానిపై విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరగడంతోపాటు కేటాయించిన 8 ఏళ్ల తర్వాత కూడా దాన్ని వినియోగించలేదని తేల్చి ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై ఆమోద పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది.
గత ఏడాది నవంబర్ 29వ తేదీన హైకోర్టు దీనిపై తీర్పు ఇచ్చి చట్టానికి అనుగుణంగా మళ్లీ కేటాయింపును పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇంతలో ఆంధ్రజ్యోతి మరింత విలువైన భూమిని కోరింది. పరదేశిపాలెం వద్ద ఇచి్చన భూమిలో 74 సెంట్లు జాతీయ రహదారుల శాఖ బఫర్ జోన్‌లో ఉంది కాబట్టి వినియోగించుకోలేకపోయామని, ప్రత్యామ్నాయంగా పరిదేశిపాలెం సర్వే నంబర్ 168/3లోని ప్రభుత్వ భూమి 24 సెంట్లు, సర్వే నంబర్ 203/2లో ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 50 సెంట్లు కావాలని కోరింది.
దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు మేలు చేయడానికి ఫైలును బుల్లెట్ రైలులా నడిపించింది. గతంలో రద్దు చేసిన భూమి కాకుండా మరింత విలువైన హౌసింగ్ బోర్డు భూమి ఇచ్చేందుకు అంగీకరించింది. వెంటనే సర్కారు పెద్దలు హౌసింగ్ బోర్డును ఒప్పించారు. అందుకు ప్రతిగా హౌసింగ్ బోర్డుకు సర్వే నంబర్ 168/1లో 64 సెంట్ల ప్రభుత్వ భూమిని మార్పిడి (ఎక్సే్ఛంజ్) కింద ఇచ్చేందుకు ఒప్పించారు. కోర్టు తీర్పు రావడానికి ముందే అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఏపీఎల్‌ఎంఏ (ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సమావేశంలో ఈ భూ మార్పిడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కోర్టు తీర్పు రాకుండానే ఈ కేటాయింపుపై నిర్ణయం జరిగిపోయిందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు కోర్టు తీర్పును సాకుగా చూపి భూమి ఇచ్చేశారు.
ఒకపక్క భూములకు సంబంధించి లక్షలాది సమస్యలు రెవెన్యూ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్నా పట్టించుకోని చంద్రబాబు.. తన అస్మదీయ ఎల్లో మీడియా అధినేతల్లో ఒకరైన రాధాకృష్ణకు మాత్రం కోట్ల రూపాయల విలువైన భూమిని రోజుల వ్యవధిలో కేటాయించేశారు. నవంబర్ 29న కోర్టు తీర్పురాగా, 12 రోజుల్లోనే దానిపై ఆయన కోరిన విధంగా వేరే చోట, వేరే సంస్థ భూమిని తీసుకుని మరీ ఇచ్చేశారు. భూములకు సంబంధించి ఇలాంటి తీర్పులు వేలల్లో ఉన్నా, వాటివైపు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు... ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫైలును నిబంధనలు పక్కనపెట్టి మరీ ఆఘమేఘాల మీద ఆమోదించేలా చేశారు.


