ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌ | RTC income Adhurs | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌

Jul 3 2017 1:03 AM | Updated on Sep 5 2017 3:02 PM

ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌

ఆర్టీసీ ఆదాయం అదుర్స్‌

ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. పాఠశాలలు మొదలైనా, వానలు కురుస్తున్నా ఆదాయంపై ఏమాత్రం ప్రభావం పడలేదు.

- రోజుకు అదనంగా రూ. కోటి ఆదాయం
‘అరుణాచల్‌’ఉదంతంతో పెరిగిన ప్రయాణికుల తాకిడి
ప్రైవేట్‌ ‘స్టేజీ క్యారియర్ల’నూ నియంత్రిస్తే నష్టాలు మాయం
 
సాక్షి, హైదరాబాద్‌: ఉన్నట్టుండి ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. పాఠశాలలు మొదలైనా, వానలు కురుస్తున్నా ఆదాయంపై ఏమాత్రం ప్రభావం పడలేదు. ఏటా జూన్‌ చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయి ఆదాయం తగ్గుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆర్టీసీకి నిత్యం అదనంగా దాదాపు రూ.కోటి మేర ఆదాయం సమకూరుతున్నట్టు సమాచారం. ప్రైవేటు బస్సు మాఫియాపై అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఏర్పడ్డ కుదుపు ప్రభావమిది. అరుణాచల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై ఆ రాష్ట్ర రవాణా శాఖ విరుచుకుపడి రిజిస్ట్రేషన్లు రద్దు చేయటం, ఇక్కడి రవాణా శాఖ వాటిని సీజ్‌ చేస్తుండటంతో అనేక బస్సులు రోడ్డెక్కటం లేదు. దీంతో ప్రయాణికులు ఆర్టీసీవైపు మళ్లడంతో ఆదాయం పెరిగింది. 
 
ప్రత్యేక ప్రణాళిక కరువు..
బస్సులను తిప్పేందుకు ప్రైవేటు బస్సు మాఫియా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటే.. ఆర్టీసీ మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. గతంలో 70 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ తాజాగా పెరుగుతోంది. ప్రయాణికుల తాకి డికి అనుగుణంగా కొత్త బస్సులు సమకూ ర్చుకుని ‘ప్రైవేటు’కు అడ్డుకట్ట వేయాల్సి ఉండగా.. జప్తు మొదలైన తర్వాత ఒక్క బస్సు నూ ఆర్టీసీ సమకూర్చుకోలేదు. ఇక.. స్థానికంగా టూరిస్టు పర్మిట్‌ తీసుకుని స్టేజ్‌ క్యారియర్లుగా తిరుగుతున్న బస్సులపైనా రవాణా శాఖ ఇప్పటి వరకు దృష్టి సారించ లేదు. మరోవైపు వాటిని నియంత్రిస్తే ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన భారం పైన పడుతుందని ప్రభుత్వమూ ఆ దిశగా చర్యలపై రవాణా శాఖను పురమాయించటం లేదు. వెరసి ఆర్టీసీ బలోపేతమయ్యే మంచి అవకాశం చేజారిపోతోంది.
 
బస్సులు కిటకిట..
మే నెలలో వేసవి సెలవులుండటం వల్ల ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ.12 కోట్లు మించుతుంది. అలాగే శుభకార్యాలూ ఉండటంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అయితే పాఠశాలలు ప్రారంభమవడం, వానలు మొదలవడంతో జూన్‌ మూడోవారం నాటికి ఆదాయం తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు జూలై వచ్చినా ఆదాయం నిత్యం సగటున రూ.12.5 కోట్ల నుంచి రూ.13 కోట్ల మేర నమోదవుతోంది. దీంతో ఆర్టీసీ ఉత్సాహంగా బస్సులు తిప్పుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement