హెల్మెట్‌పై కఠినంగా ఉండాలి: హైకోర్టు | police should Serious On Helmet compulsory Rule: High Court | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌పై కఠినంగా ఉండాలి: హైకోర్టు

Nov 2 2015 10:03 PM | Updated on Aug 31 2018 8:24 PM

హెల్మెట్‌పై కఠినంగా ఉండాలి: హైకోర్టు - Sakshi

హెల్మెట్‌పై కఠినంగా ఉండాలి: హైకోర్టు

హెల్మెట్ ధరించని వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ఎంతో కొంత పురోగతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్: హెల్మెట్ ధరించని వాహనదారుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ఎంతో కొంత పురోగతి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ వాడని వాహనదారులకు జరిమానా విధిస్తున్నట్లు తమకు ఎక్కడా కనిపించడం లేదన్న ధర్మాసనం, ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించాలని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హెల్మెట్ ధరించే విషయంలో మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129ని కఠినంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ 2009లో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉడతనేని రామారావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ప్రతీ రోజూ తమకు హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారే అత్యధికంగా కనిపిస్తున్నారని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతుండటం వల్లే ఇది సాధ్యమవుతున్నట్లుందని వ్యాఖ్యానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఏఎస్‌జీ) అందేపల్లి సంజీవ్‌కుమార్ స్పందిస్తూ, ఇప్పటి వరకు 49వేల కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని ద్విచక్ర వాహనాలున్నాయని ధర్మాసనం ప్రశ్నించగా, 40 లక్షలున్నాయని సంజీవ్ చెప్పారు. దీని ప్రకారం మీరు ఒక్క శాతం మేర కేసులను మాత్రమే నమోదు చేశారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. హెల్మెట్ ధారణ విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇవి మాత్రమే సరిపోవని, హెల్మెట్ ధరించని వారి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే ఎంతో కొంత పురోగతి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ విచారణను వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement