ఇక్కడ బతకలేం... అమెరికా వెళ్లిపోతాం | Not live here have to go america | Sakshi
Sakshi News home page

ఇక్కడ బతకలేం... అమెరికా వెళ్లిపోతాం

Jun 9 2016 2:52 AM | Updated on Aug 24 2018 8:18 PM

ఇక్కడ బతకలేం... అమెరికా వెళ్లిపోతాం - Sakshi

ఇక్కడ బతకలేం... అమెరికా వెళ్లిపోతాం

బాధ్యత మరిచి భార్యాపిల్లలను వేధిస్తున్న ఓ కుటుంబ పెద్ద ఉదంతం ఇది. పుట్టిన గడ్డపై భర్త బాధలు భరించలేక పరాయి దేశంలో తన పిల్లలతో బతికేందుకు అవకాశం కల్పించాలని దీనంగా వేడుకొంటున్న ఓ అభాగ్యురాలి ఆవేదన ఇది.

- భర్త వేధింపులు భరించలేని భార్య వేడుకోలు
- తన పిల్లల పాస్‌పోర్టులు ఇప్పించి న్యాయం చేయాలని విన్నపం
 
 హైదరాబాద్: బాధ్యత మరిచి భార్యాపిల్లలను వేధిస్తున్న ఓ కుటుంబ పెద్ద ఉదంతం ఇది. పుట్టిన గడ్డపై భర్త బాధలు భరించలేక పరాయి దేశంలో తన పిల్లలతో బతికేందుకు అవకాశం కల్పించాలని దీనంగా వేడుకొంటున్న ఓ అభాగ్యురాలి ఆవేదన ఇది. అమెరికా పౌరసత్వం ఉన్న కుటుంబ సభ్యులను మాయ మాటలతో భారత్‌కు రప్పించి బెదిరించి భయపెడుతున్న ఓ కఠినాత్ముడి ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి భార్య లక్ష్మీప్రసన్న బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో తన గోడు వెళ్లబోసుకుంది.

 నెల్లూరు జిల్లా కావలికి చెందిన లక్ష్మీప్రసన్నకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బాబూప్రసాద్‌తో 1996లో వివాహం జరిగింది. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగినా... 2000 సంవత్సరంలో భర్త ప్రసాద్ చెప్పాపెట్టకుండా ఉద్యోగం పేరిట అమెరికా వెళ్లిపోయాడు. అదే ఏడాది అతని తండ్రి చనిపోవడంతో భారత్‌కు వచ్చిన ప్రసాద్... పెద్దలు నచ్చజెప్పడంతో భార్యను కూడా అమెరికా తీసుకువెళ్లాడు. న్యూజెర్సీలో సొంతిల్లు కూడా సమకూర్చుకున్నాడు. అక్కడే వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పాప హిమంతి నాగసాయికి ఇప్పు డు 13 ఏళ్లు. కుమారుడు సాహిత్ సాయికి 7ఏళ్లు. జన్మతా అమెరికా పౌరులు కావడంతో అక్కడే చదువు. లక్ష్మి కూడా అక్కడి ఓ పాఠశాల ఫుడ్ ప్రొడక్షన్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అయితే ప్రసాద్ తరచూ భార్యను మానసికంగా వేధిస్తుండేవాడు.

ఆమె క్రెడిట్ కార్డును సైతం దుర్వినియోగపరిచి, ఆ నేరం కింద కేసు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు నుంచి తప్పించుకొనేందుకు తన తల్లికి అనారోగ్యంగా ఉందంటూ ప్రసాద్ గత ఏడాది భార్యాపిల్లలతో భారత్‌కు వచ్చాడు. పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని భావించిన లక్ష్మి... 2015 జూన్‌లో తిరిగి అమెరికా వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులకు మాయ మాటలు చెప్పిన ప్రసాద్ మళ్లీ వారిని స్వదేశానికి రప్పించాడు. నగరంలోని యాప్రాల్‌లో వారి నివాసం. ఇక అప్పటి నుంచి వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు. వారి పాస్‌పోర్టులు లాక్కొని వేధిస్తున్నాడు. ‘ఇది అమెరికా కాదు... ఇండియా. ఇక్కడ నన్నేమీ చేయలేరు’ అంటూ వారిని బెదిరిస్తున్నాడు.

ఈ చిత్రహింసలు భరించలేని లక్ష్మి... తన పిల్లలకు ఇక్కడి చదువులేమీ అర్థం కావడం లేదని, వారి భవిష్యత్తు నాశనమవుతోందని, తమ పాస్‌పోర్టులు తమకు ఇప్పిస్తే అమెరికా వెళ్లి జీవిస్తామంటూ రోదించారు. తనకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రస్తుతం విమెన్ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓల్డేజ్ హోం వ్యవస్థాపకురాలు సావిత్రమ్మ వద్ద తలదాచుకుంటున్నట్టు తెలిపారు. గతంలో జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement