
అల్లుడే నిందితుడు
సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇటీవల జరిగిన భాస్కర్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు.
వీడిన హత్య కేసు మిస్టరీ
కుటుంబ కలహాలే కారణం
దుండిగల్: సూరారం పరిధిలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో ఇటీవల జరిగిన భాస్కర్ హత్య కేసును దుండిగల్ పోలీసులు ఛేదించారు. నిత్యం తాగి వచ్చి గొడవపడుతుండటంతో అల్లుడే అతడిని బండరాయితో మోది చంపినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బృంగి భాస్కర్(48) 25 ఏళ్ల క్రితం సావిత్రి అలియాస్ సంధ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భర్తతో గొడవలు జరుగుతుండటంతో ఆరేళ్ల క్రితం తన కూతురు సంగీత, కుమారుడిని తీసుకొని సంధ్య సూరారం డివిజన్ సాయినగర్‌కు వచ్చి ఉంటోంది. కాగా, కుమార్తె సంగీతను బొంతపల్లిలో కూలీగా పని చేసే శ్రీకాకుళం జిల్లా సార్వకోట గ్రామానికి చెందిన సాయిబలి పోలయ్య అలియాస్ రాము(32) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరు కూడా సూరారం పరిధిలోని రాజీవ్‌గృహకల్పలో ఉంటున్నారు.
భాస్కర్ రోజూ కూతురి ఇంటికి వచ్చి తన భర్య విషయమై గొడవ చేసేవాడు. ఈనెల 28న సాయంత్రం సూరారం రోడ్డులో అల్లుడు రాముకు భాస్కర్ కనిపించాడు. ఇద్దరూ కలిసి అక్కడి కల్లు దుకాణానికి వెళ్లి పీకలదాక తాగారు. అక్కడి నుంచి ఇంటికి వస్తూ కొంత మద్యం కొనుక్కొని కట్టమైసమ్మ చెరువు సమీపంలోని గుంతలో మళ్లీ తాగారు. తాగిన మైకంలో ఉన్న ఇద్దరూ కుటుంబ విషయాలపై చర్చించుకొని గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన రాము మామ భాస్కర్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దుండిగల్ పోలీసులు ఘటనా స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించగా జాగిలం అల్లుడి ఇంటికి వెళ్లింది. దీంతో రామును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.