జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు | Mineral Foundation in the District | Sakshi
Sakshi News home page

జిల్లాల్లో మినరల్ ఫౌండేషన్లు

Jan 21 2016 3:40 AM | Updated on Sep 3 2017 3:59 PM

గనులు, ఖనిజాలు(అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(ట్రస్టు) (డీఎంఎఫ్)ల ఏర్పాటుకు ఆమోదం

ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా పాలకమండలి
కలెక్టర్ చైర్మన్‌గా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు

 
 సాక్షి, హైదరాబాద్: గనులు, ఖనిజాలు(అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం-2015 నిబంధనలకు అనుగుణంగా జిల్లాస్థాయిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్(ట్రస్టు) (డీఎంఎఫ్)ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కేంద్రం ఇటీవలే ఈ చట్టాన్ని సవరించింది. డీఎంఎఫ్‌టీల మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనూ ఏర్పాటయ్యే డీఎంఎఫ్‌కు పాలకమండలి(గవర్నింగ్ కౌన్సిల్), మేనేజింగ్ కమిటీ వేర్వేరుగా ఉంటాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం కేంద్రంగా డీఎంఎఫ్ పనిచేస్తుంది. మైనింగ్ ద్వారా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాల ప్రయోజనాలు కాపాడటం, లబ్ధి చేకూర్చడం ఈ ఫౌండేషన్ లక్ష్యం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరించే పాలకమండలిలో సంబంధిత జిల్లా మంత్రి, మైనింగ్ ప్రభావిత ప్రాంత వ్యక్తి, మైనింగ్ కంపెనీ ప్రతినిధి, సాంఘిక, స్త్రీ, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు, అటవీ, పర్యావరణ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు.

పాలకమండలి ట్రస్టు విధివిధానాలను రూపొందించడంతోపాటు, ట్రస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.  పాలక మండలితోపాటు జిల్లా కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, గ్రూప్ 1 హోదా కలిగిన జిల్లాస్థాయి అధికారి సభ్య కార్యదర్శిగా మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారు. గవర్నింగ్ కౌన్సిల్ సిఫారసు మేరకు మైనింగ్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఐదుగురు స్థానికులు, డీఆర్‌డీఏ పీడీ, గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ, లీడ్ బ్యాంక్ అధికారి మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మైనింగ్ లీజుదారుల నుంచి సకాలంలో కంట్రిబ్యూషన్ ఫండ్ వసూలు, ట్రస్టు విజన్ డాక్యుమెంటు తయారీ, వార్షిక ప్రణాళిక అమలు పర్యవేక్షణ, ట్రస్టు నిధి వివిధ ప్రాజెక్టులకు మంజూరు, నిధుల వినియోగాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement