నేరెళ్ల బాధితులతో కాంగ్రెస్‌ రాజకీయం | Lakshma Reddy commented over Congress | Sakshi
Sakshi News home page

నేరెళ్ల బాధితులతో కాంగ్రెస్‌ రాజకీయం

Sep 10 2017 2:37 AM | Updated on Mar 18 2019 9:02 PM

నేరెళ్ల బాధితులతో కాంగ్రెస్‌ రాజకీయం - Sakshi

నేరెళ్ల బాధితులతో కాంగ్రెస్‌ రాజకీయం

నేరెళ్ల బాధితులను ముందు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు.

మంత్రి లక్ష్మారెడ్డి  
సాక్షి, హైదరాబాద్‌:
నేరెళ్ల బాధితులను ముందు పెట్టి కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి విమర్శించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న నిమ్స్‌ ఆస్పత్రిపైనా రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆరుగురు నేరెళ్ల బాధితులకు నిమ్స్‌లో చికిత్స అందించలేదనే ఆరోపణలు అబద్ధమన్నారు. ప్రభుత్వంపై మాట్లాడేందుకు ఏమీ లేక కాంగ్రెస్‌ నాయకులు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారన్నారు. నేరెళ్ల బాధితులకు నిమ్స్‌లో అన్ని పరీక్షలూ చేశారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.

వారు ఇన్‌పేషెంట్స్‌గా ఉండాల్సిన అవసరం లేదని వైద్యులు ధ్రువీకరించారన్నారు. ఒకవేళ నిమ్స్‌ పరీక్షలు తప్పయితే, వారు చికిత్స చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రి కూడా ఇన్‌పేషెంట్లుగా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంత ఖర్చయినా వారికి వైద్యం చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ధర్నా చేసినందు వల్లే పోలీసులు నిమ్స్‌కు వచ్చారన్నారు. చికిత్స ప్రక్రియలో పోలీసులది గానీ, మరొకరి జోక్యంగానీ లేదని చెప్పారు. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి.. పక్క రాష్ట్రానికి తీసుకెళ్లి వారికి చికిత్స ఇప్పిస్తామని మాట్లాడుతున్నారని, ఆ అవసరం లేదని మంత్రి చెప్పారు. నిమ్స్‌లో అన్ని వైద్య సదుపాయాలూ ఉన్నాయని తెలిపారు. వారికి అన్ని రకాల చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement