48 గంటల్లో కేరళకు ‘నైరుతి’! | in 48 hours southwest monsoon reaches karala | Sakshi
Sakshi News home page

48 గంటల్లో కేరళకు ‘నైరుతి’!

Jun 7 2016 2:07 AM | Updated on Sep 4 2018 5:02 PM

48 గంటల్లో కేరళకు ‘నైరుతి’! - Sakshi

48 గంటల్లో కేరళకు ‘నైరుతి’!

వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

  •  వారం రోజుల్లో రాష్ట్రంలోకి
  •  హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా
  •  
     సాక్షి, హైదరాబాద్: వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ ప్రకారం వారంలోగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసిన ప్రకారం రుతుపవనాలు మంగళవారం (7వ తేదీ) నాటికి కేరళను తాకాల్సి ఉంది. అయితే నాలుగు రోజులు అటుఇటుగా వస్తాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈసారి రుతుపవనాలు రాక కాస్తంత ఆలస్యమైనా వర్షపాతం సాధారణం కంటే అధికంగానే నమోదవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

    లానినా కారణంగా జులై నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. నిజామాబాద్ జిల్లా గాంధారిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 7 సెంటీమీటర్లు, దేవరకొండ, గంభీరావుపేట, మార్పల్లి, తాండూరు, ఏటూరునాగారం, ధర్పల్లిల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అత్యధికంగా రామగుండంలో 40.6 డిగ్రీల నమోదు కాగా, హన్మకొండలో 39.5, హైదరాబాద్‌లో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.
     
    నగరంలో అర్ధరాత్రి వర్షం
     నగరంలో పలు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.  వర్షానికి చెట్లకొమ్మలు విరిగి విద్యుత్‌లైన్లపై పడటంతో ఫీడర్లు ట్రిప్పయ్యాయి. రాజేంద్రనగర్ సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంజాగుట్ట, అమీర్‌పేట, మైత్రీవనం, జలగం వెంగళరావు పార్కు ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  
     

Advertisement
 
Advertisement
Advertisement