నకిలీ ‘సెల్‌కాన్’ ఫోన్ల గుట్టు రట్టు | hundreds of fake 'c -343' model phones seized | Sakshi
Sakshi News home page

నకిలీ ‘సెల్‌కాన్’ ఫోన్ల గుట్టు రట్టు

Jan 13 2015 11:39 PM | Updated on Sep 2 2017 7:39 PM

నకిలీ ‘సెల్‌కాన్’ ఫోన్ల గుట్టు రట్టు

నకిలీ ‘సెల్‌కాన్’ ఫోన్ల గుట్టు రట్టు

సెల్‌కాన్ సీ-343’ మాడల్ సెల్ ఫోన్‌ను కాపీ చేసి... నకిలీ ఫోన్లను మార్కెట్లోకి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు.

గుజరాత్‌గల్లీ, జగదీష్‌మార్కెట్లపై పోలీసుల దాడి
ఐదు సెలఫోన్ దుకాణాల సీజ్ - యజమానుల అరెస్టు
వందల సంఖ్యలో నకిలీ ‘ సీ-343’ మోడల్ ఫోన్ల స్వాధీనం
 

సిటీబ్యూరో: ‘సెల్‌కాన్ సీ-343’ మాడల్ సెల్ ఫోన్‌ను కాపీ చేసి... నకిలీ ఫోన్లను మార్కెట్లోకి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు.  మంగళవారం అబిడ్స్‌లోని జగదీష్‌మార్కెట్, గుజరాత్ గల్లీలోని ఐదు సెల్‌ఫోన్ దుకాణాలపై పోలీసులు మెరుపుదాడి చేశారు.  భారీగా నకిలీ సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆయా షాపులను సీజ్ చేయడంతో పాటు యజమానులనూ అరెస్టు చేశారు. వివరాలు... సెల్‌కాన్ కంపెనీ సీ-343 మాడల్ ఫోన్‌ను గతంలో విడుదల చేసింది. ఈ మాడల్ పాతబడటంతో తయారీ నిలిపివేసి మరో మాడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే కంపెనీ బంద్ చేసిన సీ-343  మాడల్‌తో రింకు రాజేష్ (30) అనే వ్యక్తి నకిలీ సెల్‌కాన్ ఫోన్లను తయారు చేయించి, వీటికి ఐఎంఈఐ నెంబర్ సైతం వేయిస్తున్నాడు. నగరంలోని వందల సెల్‌ఫోన్ దుకాణాలకు రూ.600కే సరఫరా చేశాడు. ఇది గుర్తించని చాలా మంది వినియోగదారులు ఈ మొబైల్ ఫోన్లను ఖరీదు చేసి మోసపోయారు. సర్వీసింగ్ కోసం నిజమైన సెల్‌కాన్ కంపెనీకి వినియోగదారులు బారులు తీరడంతో కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని పసిగట్టింది. ఈ మేరకు సెల్‌కాన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రేతినేని మురళి నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.

కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అబిడ్స్‌లోని జగదీష్ మార్కెట్‌లో గల అంకిత్ మొబైల్స్, మధుటైల్స్, శుక్రుమొబైల్స్, జగదాంబ మొబైల్ షాపులతో పాటు గుజరాత్ గల్లిలోని శ్రీలక్ష్మి మొబైల్స్‌పై దాడి చేశారు.  ఈ దాడుల్లో వందల సంఖ్యలో నకిలీ సెల్ కాన్ సీ-343 మాడల్ సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ నకిలీ సెల్‌ఫోన్ల తయారీకి సూత్రధారి అయిన రింకు రాజేష్ పరారీలో ఉన్నాడు. ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాగే వీరు నకిలీ సెల్‌కాన్ ఫోన్లు తయారు చేయించి విక్రయించినట్లు తెలిసింది. సెల్‌కాన్ ఫోన్లు ఖరీదు చేసే సమయంలో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలని, ఎవరైనా నకిలీ సెల్‌కాన్ ఫోన్లు విక్రయిస్తే పోలీసులుకు గానీ, తమకు గానీ సమాచారం ఇవ్వాలని సెల్‌కాన్ కంపెనీ ప్రతినిధి రేతినేని మురళి వినియోగదారులకు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement