అవి అసలు పాఠశాలలేనా..? | High Court on fires on state government | Sakshi
Sakshi News home page

అవి అసలు పాఠశాలలేనా..?

Jan 5 2016 12:55 AM | Updated on Aug 31 2018 8:24 PM

అవి అసలు పాఠశాలలేనా..? - Sakshi

అవి అసలు పాఠశాలలేనా..?

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందరూ సిగ్గుపడేలా ఉందని, అసలు కొన్నింటిని పాఠశాలలని కూడా ఎలా

♦ ప్రభుత్వ స్కూళ్ల దుస్థితి సిగ్గుపడేలా ఉంది
♦ రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
♦ అసలు గ్రామాలకు వెళ్లి పాఠశాలలను తనిఖీ చేస్తున్నారా?
♦ ఉన్నతాధికారుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చాలి
♦ ఏదో ఓ రోజు ఆ దిశగా కూడా ఆదేశాలిస్తామని స్పష్టీకరణ
♦ గడువు కోరిన సర్కారు.. విచారణ వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందరూ సిగ్గుపడేలా ఉందని, అసలు కొన్నింటిని పాఠశాలలని కూడా ఎలా పిలవాలో అర్థం కాకుండా ఉందని హైకోర్టు  వ్యాఖ్యానించింది. అధికారులకు టీచర్ల బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై ఉండడం లేదని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మారాలంటే అధికారుల పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని... అప్పుడే వారికి సమస్య అర్థమవుతుందని పేర్కొంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే ఏదో ఒక రోజు అలాంటి ఉత్తర్వులు  జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఈ అంశంపై విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేస్తూ.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 కోర్టు ముందుకు నివేదిక..
 తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, తాము సరైన విద్యను పొందలేకపోతున్నామని పేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు, ఐజా మండలాల్లోని బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరగిడ్డ గ్రామాల విద్యార్థులు, తల్లిదండ్రులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఇలా వచ్చిన దాదాపు 1,700కు పైగా లేఖలను ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా మలిచి హైకోర్టు విచారణ చేపట్టింది.

తాజాగా సోమవారం దీనిని తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆయా పాఠశాలల్లో పరిస్థితులను తెలుసుకునేందుకు తమ ప్రతినిధిగా హైకోర్టు నియమించిన న్యాయవాది ఎం.విజయకుమార్‌గౌడ్ తన నివేదికను ఈ సందర్భంగా ధర్మాసనానికి అందజేశారు. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం... ఈ కేసులో ప్రభుత్వ కౌంటర్‌కూ, విజయకుమార్ నివేదికకు చాలా తేడా ఉండడాన్ని గుర్తించింది. దీనిపై ప్రభుత్వం తరపున హాజరైన రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావును ప్రశ్నించింది. ‘‘తమ పాఠశాలల్లో ఫర్నిచర్, తాగునీరు, మరుగుదొడ్లు లేవని విద్యార్థులు స్పష్టంగా చెప్పినట్లు విజయకుమార్ నివేదికలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్ టీచర్లు కూడా లేరని విద్యార్థులు చెప్పారు. స్కూల్ యూనిఫారాలు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలిపారు.

వీటన్నింటిపై మీరేమంటారు..?’’ అని నిలదీసింది. ఉపాధ్యాయులను నియమించలేని చోట్ల విద్యా వలంటీర్లను నియమించామని రామచంద్రరావు వివరిం చారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు టీచర్లు ఇష్టపడడం లేదని.. దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వారిని పంపుతున్నామన్నారు. దీనిపై ధర్మాసనం స్పం దిస్తూ... ‘‘ఎంత మంది విద్యాశాఖ ఇన్‌స్పెక్టర్లు గ్రామాలకు వెళ్లి పాఠశాలలను తనిఖీ చేస్తున్నారు? మీ అధికారులకు టీచర్ల బదిలీలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల ప్రయోజనాలపై ఉండదు. ఎందుకంటే బదిలీల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి కదా! ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు మెరుగుపడాలంటే ఉన్నతాధికారులంతా తమ పిల్లలను వాటిల్లోనే చేర్చాలి.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఓ రోజు ఆ ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. పాఠశాలల దుస్థితిని చూసి మనం సిగ్గుపడాలి.  మీరేమో అన్నీ సమకూర్చామని చెబుతారు. విద్యార్థులు మాత్రం ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పాఠశాలల్లో పరిస్థితులపై మేం ఎంత మాత్రం సంతృప్తికరంగా లేం..’’ అని స్పష్టం చేసింది. అయితే మరింత గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని రామచంద్రరావు కోరగా... ధర్మాసనం అంగీకరించింది. విచారణను సంక్రాంతి సెలవుల తరువాతకు వాయిదా వేసింది. ఈ కేసులో పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించిన విజయకుమార్‌గౌడ్‌ను అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement