కాపు ఉద్యమంలో చీలికకు ప్రభుత్వం కుట్ర | Government conspiracy Split in the kapu movement | Sakshi
Sakshi News home page

కాపు ఉద్యమంలో చీలికకు ప్రభుత్వం కుట్ర

Apr 3 2016 3:22 AM | Updated on Jul 30 2018 6:29 PM

రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కాపులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కుట్రపన్ని ఉద్యమంలో చీలికకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాపు సంఘాల సమన్వయ కమిటీ ధ్వజమెత్తింది.

రాష్ట్ర కాపు సంఘాల సమన్వయ కమిటీ ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కాపులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం కుట్రపన్ని ఉద్యమంలో చీలికకు ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాపు సంఘాల సమన్వయ కమిటీ ధ్వజమెత్తింది. ఉద్యమాలను నీరుగార్చడంలో ఆరితేరిన చంద్రబాబు కుయుక్తులకు తలొగ్గితే కాపులకు భవిష్యత్ ఉండదని పేర్కొంది. ఈ మేరకు కాపు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ కఠారి అప్పారావు శనివారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడూ, రైలు దగ్ధం కేసులో అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నప్పుడూ కనిపించని కొందరు ‘కుహానా మేధావులు, స్వయం ప్రకటిత నేతలు’ ఇప్పుడు తెరపైకి వచ్చి చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ తరహా నేతల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ పెద్దలు కొందరు ఇటీవల విజయవాడలో 13 జిల్లాల కాపు నేతల సమావేశమంటూ నిర్వహించి ముఖ్యమంత్రికి శాలువాలు కప్పి సన్మానాలు చేయించారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే జుగుప్స కలుగుతోందని, నిస్సిగ్గుగా చంద్రబాబుకు భజన చేసేందుకే ఇలాంటి మీటింగులు పెడుతున్నారని విమర్శించారు.

 కాపు ఉద్యమాన్ని అమ్మేద్దామనుకుంటున్నారా?
 ‘అసలు ఈ దొంగ కాపు నాయకులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు. కాపు ఉద్యమాన్ని ప్రభుత్వానికి అమ్మేద్దామనుకుంటున్నారా? ముద్రగడ నిరాహార దీక్ష విరమించే సమయంలో ప్రభుత్వం ప్రకటించిన 500 కోట్ల మాటేమైంది? విజయవాడ సమావేశానికి వచ్చిన ఏ ఒక్క కాపు నాయకుడూ దీనిపై ఎందుకు నోరువిప్పలేదు’ అని కఠారి ప్రశ్నించారు. ప్రభుత్వ మద్దతుదారులుగా ఉన్న ఈ ముఠాకు కాపు రిజర్వేషన్లు ఇప్పటిదాకా ఎందుకు గుర్తుకురాలేదని మండిపడ్డారు. కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని మరచి ప్రభుత్వాన్నీ, చంద్రబాబును కీర్తిస్తారా? అని దుయ్యబట్టారు. కాపులందరూ ప్రభుత్వంపై సమర శంఖారావం పూరిస్తే ఈ నాయకులు బాబు చంకలో దూరి జాతికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. వీళ్లసలు కాపు పుటక పుట్టారా? వీరిలో కాపు పౌరుషం ఉందా? ఇలాంటి కాపు వ్యతిరేక కార్యక్రమాలకు ఎందుకు పాల్పడుతున్నారని కఠారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తరహా కుట్రల్ని భగ్నం చేసేందుకు కాపు సంఘాల సమన్వయ వేదిక త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement