వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
నేటి నుంచి 19 వరకు వివిధ శాఖలతో భేటీ
ముఖ్య కార్యదర్శుల స్థాయిలో ప్రాథమిక సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. సోమవారం నుంచి 19వ తేదీ వరకు వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కావాల్సిన సమావేశాలను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ఈలోగా అధికారుల స్థాయిలోనే సమీక్షలు జరపాలని కోరారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్ వరుసగా అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. 14వ తేదీన విద్య, వైద్యం, ఆరోగ్యం, సాధారణ పరిపాలన, 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక పట్టణాభివృద్ధి, 16న ఎస్సీల అభివృద్ధి, బీసీలు, ఎస్టీలు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మైనారిటీ సంక్షేమం, 17న వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, రోడ్లు భవనాలు, రెవెన్యూ, హోం, 18న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, కార్మిక ఉపాధి కల్పన, యువజన సర్వీసులు, పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రణాళికలు, 19న గృహ నిర్మాణం, పర్యావరణం, అటవీ, విద్యుత్, సమాచారం, సాంకేతిక, న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖలతో సమావేశమవుతారు.
ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు వివరిస్తారు. శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, నిధుల అవసరం తదితర అంశాలను ప్రధానంగా ఈ సమీక్షల్లో చర్చిస్తారు. ఈ ప్రతి పాదనల ఆధారంగానే ఏయే పథకానికి ఎంత నిధులు కేటాయించే అవకాశముందో ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు వచ్చే అవకాశముంది. ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగే ఈ సమీక్ష సమావేశాల అనంతరం మంత్రి ఈటల స్వయంగా రంగంలోకి దిగుతారు. వారం పాటు ఆయన మంత్రులతో భేటీ అవుతారు. అధికారుల స్థాయిలో వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతారు. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే బడ్జెట్ ముసాయిదాను తయారు చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.