పోలీసులకు, మావోయిస్టులకు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దళ కమాండర్ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల సంచారం ఉందనే సమాచారం మేరకు కట్టేకళ్యాణ్ పోలీస్‌స్టేషన్ నుంచి డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ బలగాలు అటవీప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లాయి.
ఈ క్రమంలో లఖాపాల్, తారెంపార గ్రామాల మధ్య తారసపడిన మావోయిస్టులకు, పోలీసులకు నడుమ కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సంఘటనాస్థలంలో కాంగేర్‌ఘాటీ ఎల్జీఎస్ కమాండర్ బాల్‌సింగ్ అలియాస్ మాసాతోపాటు మరో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి తెలిపారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతోపాటు మూడు తుపాకులు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో జీరంఘాట్‌లో కాంగ్రెస్ అగ్రనాయకులపై జరిగిన దాడి ఘటనతో మృతి చెందిన మావోయిస్టులకు సంబంధం ఉందని తెలిపారు.