కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహదేవపూర్ : కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు, సిబ్బంది ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ఆలయంలో అర్చన చేశారు. అనంతరం ఆయనకు అర్చకులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ రెనోవేషన్ కమిటీ చైర్మన్, ఈవోలు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి వారి చిత్రపఠాన్ని అందించారు. అంతకుముందు మంత్రి కాళేశ్వరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో ఎస్టీ కాలనీ రోడ్డు, రూ.40 లక్షలతో వీఐపీ ఘాట్‌రోడ్డు, రూ.40 లక్షలతో 108 లింగాల రోడ్డు, పూస్కుపల్లిలో రూ.40 లక్షలతో గోదావరి వరకు వరకు నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శివుని విగ్రహాలను ఆవిష్కరించారు. ఆయన వెంట పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, మహదేవపూర్ జెడ్పీటీసీ, ఎంపీపీలు హసీనాభాను, వసంత, కాళేశ్వరం సర్పంచ్ మెంగాని మాధవి, ఆలయ చైర్మన్ మోహనశర్మ, ఈవో హరిప్రకాశ్, సభ్యులు అడుప సమ్మయ్య, శ్రీనివాస్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.