కూలీలను రైతులను చేసిన మహానేత

Porters Transformed As Formers By Ysr - Sakshi

భూములు పంపిణీచేసి, ఉపాధి పథకం ద్వారా అభివృద్ధికి చేయూత

ఇందిర ప్రభ ద్వారా ఉచితంగా బోర్లువేసిన వైనం

ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల్లో వెల్లివిరిసిన సంతోషాలు

ఒక నాడు వారంతా కూలీలు. కూలి దొరికితేనే పూట గడిచేది. ఊళ్లో కూలిపనులు లేకుంటే ఇంటిల్లిపాదీ పొరుగు గ్రామాలకు వలసవెళ్లి రోజులు నెట్టుకొచ్చేవారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారు రైతులయ్యారు. సొంత ఊరిలోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు వైఎస్సార్‌ అని కొనియాడుతున్నారు.

సాక్షి, అచ్చంపేట(పెదకూరపాడు): రైతు కూలీలను రైతులుగా చూడాలన్నదే దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయం. ఆ ఆశయ సాధనలో భాగంగా అమలుచేసిన భూపంపిణీ పథకం ఎంతో మంది వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు 1,250 ఎకరాల భూమి పంపిణీ చేయడంతోపాటు, వాటిపై హక్కులూ కల్పించారు. అచ్చంపేట మండలంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను ఎస్సీ, ఎస్టీ, బీస్సీ కులాలకు చెందిన అనేక మందికి భూపంపిణీ చేశారు. అప్పటిదాకా కూలీలలుగా పనిచేసిన అనేకమంది భూ యజమానులయ్యారు. అయితే నీటి వసతి లేక ఆ భూములను సాగుచేసే పరిస్థితి లేకపోవడాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తించారు. అంతే ఆ భూములను అభివృద్ధి చేసుకుని సేద్యానికి అనుకూలంగా మార్చేందుకు నిధులు సమకూర్చారు.

వర్షాధార భూముల్లో ఏటా రెండు పంటలు పండించుకునేందుకు విలుగా ఇందిర ప్రభ పథకం కింద ఆ భూములో బోర్లు వేసి విద్యుత్‌ వసతి కల్పించారు. అప్పటి వరకూ కూలిపనులతో పొట్టపోసుకున్న కూలీలు రైతులయ్యారు. సొంత ఊరిలోనే ఏటా రెండు పంటలు సాగుచేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. తమ పిల్లలను బడులకు పంపిస్తూ వారి జీవితాలు తీర్చిదిద్దుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైస్‌ రాజశేఖరరెడ్డి 2007, 2008 సంవత్సరాల్లో భూ పంపిణీ పథకం అమలుచేశారు. అచ్చంపేట మండలంలోని మాదిపాడు, తాడువాయి, చల్లగరిగ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ బీసీ కులాలకు చెందిన 614 మందికి ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున 1,228 ఎకరాలను మూడు విడతల్లో పంపిణీ చేశారు. తాడువాయి, మాదిపాడు, చల్లగరిగ తదితర గ్రామాల రైతులకు భూములు పంపిణీచేసి రుణాలు పొందేందుకు వీలుగా హక్కులు సైతం కల్పించారు.

పంపిణీ చేసిన భూములను అభివృద్ధి చేసేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అవకాశం కల్పించారు. ఎవరి పొలాలను వారే అభివృద్ధి చేసుకునేందుకు రోజుకు రూ.100 చొప్పున కూలి కూడా వచ్చేలా చర్యలు చేపట్టారు. ఇచ్చిన భూములన్నీ వర్షాధారం కావడంతో, భారీ పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే, వర్షాలు పడకపోతే ఈ నిరుపేద రైతుల పరిస్థితి ఏమిటా అని ఆలోచించారు. ఇందిరప్రభ పథకం ద్వారా ప్రభుత్వమే ఉచింతంగా ఆ భూముల్లో విద్యుత్‌ లైన్లు వేయించి, బోర్లు కూడా మంజూరు చేశారు. భూమి పొందిన ప్రతి రైతుకు సబ్‌మెర్సిబుల్‌ వ్యవయసాయ విద్యుత్‌ మోటార్లు ఇచ్చి, ఉచిత విద్యుత్‌ సరఫరా చేయించారు. ఆ మహానేత పుణ్యమా అని కూలలీలుగా చాలీచాలని సంపాదనతో జీవనం కొనసాగంచే ఆ బడుగు జీవులు ఇప్పుడు పత్తి, మిర్చి, జనుము, కూరగాయలు సాగుచేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు.

ఆ మహానేత చలువే....
మహానేత వైఎస్సార్‌ చలువ వల్ల నాకు పొలం సమకూరింది. మా ప్రాంతంలో వర్షం పడితేనే పంటలు పండుతాయి. నీటి వసతి లేకపోవడంతో తమకు పంచిన భూములను చాలా కాలం అలానే ఉంచాం. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్‌ ఆ భూముల్లో బోర్లు వేయించారు. విద్యుత్‌ కనక్షన్లు కూడా ఇప్పించారు. ఇప్పుడు పత్తి సాగుచేసుకుని హాయిగా జీవిస్తున్నాం. 

  – చిట్యాల యేసోబు, ఎస్సీ రైతు, మాదిపాడు

జన్మజన్మలకు రుణపడి ఉంటాం
కూలీలుగా చాలీచాలని సంపాదనతో జీవితం కొనసాగించే మాకు మహానేత భూమి ఇచ్చి దారి చూపించాడు. అందుకు జన్మజన్మకు ఆ మహానేతకు రుణపడి ఉంటాం. ఇంటిల్లిపాదిమి కష్టపడి ఆ భూమిని బాగుచేసుకున్నాం. ఏటా మిర్చి పంట సాగుచేసుకుని వచ్చే ఆదాయంతో వేళకు ఇంత తింటూ హాయిగా జీవిస్తున్నాం.  


   – బంకా దాసు, రైతు, మాదిపాడు 

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top