కళ్లు తెరవరా నరుడా!

Sriramana on AP special status fight - Sakshi

అక్షర తూణీరం

రాజకీయ సమీకరణాలు మారుతున్న నేప«థ్యంలో బీజేపీని కాదని ఒంటరి పోరుకి దిగుదామంటే చంద్ర బాబుకు ధైర్యం బొత్తిగా చాలడం లేదు.

మొన్న మోదీ పార్లమెంట్‌ ప్రసంగం దారితప్పిన చిరుతపులి పరుగులా సాగింది. మొదటి పానిపట్టు యుద్ధం గురించి, గజనీ మహమ్మద్‌ దండయాత్రల గురించి, పాకిస్తాన్‌ విభజన గురించి, ఆత్మప్రబోధం గురించి, యుగాలుగా తెలుగుజాతికి జరిగిన అన్యాయాల గురించి అనర్గళంగా మాట్లాడారు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. పొడిగింపుగా ఇప్పుడు నేను సైతం తెలుగుజాతికి నావంతు అన్యాయం చేస్తాననే ధ్వని ఉంది ఆ ప్రసంగంలో.

కిందటి ఎన్నికల్లో చంద్రబాబు, మోదీ కలసి నడిచారు. వస్తే చూద్దాంలే అన్నట్టు మోదీ బోలెడు వాగ్దానాలు చేశారు. ఢిల్లీకి దీటుగా కాపిటల్‌ కడదా మన్నారు. ఈ మాటకి నామాలవాడు సాక్షి. అందుకే నామం పెట్టారనే మాట వాడుకలో ఉంది. చంద్రబాబు మునుపటిలాగే, అంటే వాజ్‌పేయి హయాంలో లాగే ఇటు రాష్ట్రాన్ని అటు కేంద్రాన్ని దున్ని పడెయ్యవచ్చని ఊహించారని, మోదీ దగ్గర పప్పులుడకడం లేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటాయ్‌. గడచిన మూడేళ్లలో చంద్రబాబుకి ప్రధాని బొమ్మలు చూపించారు. మొన్న ఆఖరి బడ్జెట్‌ కూడా వచ్చాక బాబుకి అర్థమైంది. ఇన్నాళ్లూ ఎండమావి వెనకాల దాహం తీర్చుకోడానికి ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నామని టీడీపీ నేతకి అర్థమైంది. ‘కళ్లు తెరవరా నరుడా’ అని వాళ్లు వీళ్లు ముందునించే హెచ్చ రిస్తుంటే, ‘‘మీకు తెలియదు. కేంద్రంలో సయోధ్యగా లేకపోతే పనులు సాగవ్‌. ప్రాజెక్టులు రావు. ఎయిమ్స్‌ నుంచి ‘జడ్‌’ డూమ్స్‌ దాకా ఏవీ రావు’’ అని సర్వజ్ఞుడిలా వాదించారు. తీరా ఇప్పుడు కథ అడ్డం తిరిగింది.

చివరి బడ్జెట్‌లో కూడా ఆంధ్రప్రదేశ్‌ని ఏ మాత్రం పట్టిం చుకోలేదు. మిత్రపక్షమన్న ఆధి క్యత అసలే లేదు. పోనీ మహా కాపిటల్‌ అంటే చంద్రబాబు సొంత సరదా అనుకుందాం. పోలవరం అందరిదీ కదా. రైల్వేజోన్‌కి ఏమొచ్చింది? చంద్రబాబు వచ్చే ఎన్నికలకి పోలవరం ట్రంప్‌కార్డ్‌గా వాడదామనుకుని కొండంత ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడది పూర్తవడానికి ఇంకా మూడేళ్లు కనీసం పడుతుంది– అదీ కేంద్ర నిధులు వడివడిగా అందితే. అందుకని చంద్రబాబు లౌక్యం వీడకుండానే నిరసనగళం విప్పారు. అయినా కదలిక లేదు. మోదీ నాడి మన నేతకి అంతు చిక్కడం లేదు. ఈ సందర్భంలో సమీకరణాలు మారుతున్నాయి. అన్యాయం, అన్యాయం అంటూ అందరూ ఉద్యమానికి నడుం బిగిస్తున్నారు. ‘‘ఇది చినికి చినికి గాలివాన అయితే, వైఎస్సార్‌సీపీ లేదా ఇతర కూటములు పోరుకి నాయకత్వం వహిస్తే...’’ ఇంకా ఇలాంటి కొన్ని పీడ కలలు బాబుని వేధిస్తున్నాయ్‌. పోనీ బీజేపీని కాదని ఒంటరి పోరుకి దిగుదామంటే ధైర్యం బొత్తిగా చాలడం లేదు. ఎందుకంటే ఎన్నడూ స్వశక్తితో గెలిచిన వైనం ఆయనకు లేదు. మోదీ బుజ్జగింపుల బేరానికి రాకపోతే, చంద్రబాబు ‘‘మోదీ వ్యతిరేక కూటమికి’’ సారథ్యం వహిస్తారని విశ్లేషకులు అంటున్నారు. పవర్‌ లేమితో నకనకలాడుతున్నవారు, మోదీ హవా లేని దక్షిణాదివారు ఏకమైతే, కుర్చీ నాలుగు కోళ్లలో మూడు సాధ్యం. ఆ ఒక్క కోడు చంద్రబాబు ఏదో రకంగా సాధిస్తాడని నమ్మకం. వ్యతిరేక పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకోవటంలో ఆయన దిట్ట!


- శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top