వికేంద్రీకరణే ప్రగతికి చుక్కాని

Sameer Sharma Article On Decentralization - Sakshi

ఒకటి కంటే ఎక్కువ నగరాలు ఉనికిలో ఉంటున్న రాష్ట్రంలో, పలు రాజధానులు ఉండటం అనే భావన మరింత ప్రభావశీలమైన, అభివృద్ధి వ్యూహంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రంలో సరళమైన, నిర్వహణాత్మకమైన అభివృద్ధికి చోటు ఉంటుంది. ఇప్పటికే ఉన్న పలు నగరాల ప్రాదేశిక స్వరూపాన్ని సమతుల్యం చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి నిర్వహణను కొనసాగించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని విధులను రాష్ట్రంలోని పలు నగరాల మధ్య పంపిణీ చేయడం అనేది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రాదేశిక చట్రాల అభివృద్ధి చరిత్రను ప్రత్యేకంగా నిర్మించడం అనే వైఖరిలోనే సంప్రదాయేతర దృక్పధం ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న ఈ విశిష్ట ప్రయత్నం ఫలవంతమైతే, పలు ప్రధాన నగరాల అనుసంధానంతో కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ఒక దీపస్తంభంలా దారి చూపుతుంది.

సంప్రదాయకంగా చూస్తే భారతదేశంలోని రాష్ట్రాలకు చాలావరకు ఒకే నగరంలోనే రాజధాని ఉంటూవచ్చింది. ఒకే నగరంలో రాజధాని ఉండాలా లేక రాజధాని విధులను వివిధ నగరాలకు పంపిణీ చేయాలా అనేది ఒక రాష్ట్రంలో నగరాల అనుసంధానం ఏ రీతిలో అభివృద్ధి చెందింది అనే ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నగరాల ప్రత్యేక నిర్మాణచట్రం ఎలా పరిణమించిందో తెలుసుకుందాం.

17వ శతాబ్ది తొలి భాగంలో, 18వ శతాబ్ది మలిభాగంలో భారతదేశం వస్తూత్పత్తి కేంద్రాలతో విలసిల్లింది. నాణ్యత, చౌకధర, హస్తనైపుణ్యం కారణంగా నాట భారతీయ చేతి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పేరుకెక్కాయి. బ్రిటిష్‌ వారి రాకతో ఆ వైభవం మొత్తంగా మారి పోయింది. భారతదేశంలోని లోతట్టు ప్రాంతాలనుంచి ముడిసరుకులను సేకరించి ఇంగ్లండుకు పంపి వాటినుంచి తయారు చేసిన సరుకులను అక్కడినుంచి భారత్‌కు పంపడమే బ్రిటిష్‌ వలసవాదపు ప్రధాన లక్ష్యంగా ఉండేది. వలసవాదపు ఈ ఆర్థిక తర్కం ప్రభావం వల్ల భారతీయ నగరాలు, పట్టణాలు తమను తాము మార్చుకున్నాయి, పునర్నిర్మాణ బాటలో సాగాయి. బ్రిటిష్‌ పాలనా కాలంలో భారతీయ నగరాల్లో జరిగిన ఈ పునర్వ్యవస్థీకరణ.. స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి భారత్‌లో ఒక ప్రత్యేక ప్రాదేశిక చట్రాన్ని అనుసరించింది.

ఆనాడు ప్రధానమైన రేవు పట్టణాలతో కూడిన రాష్ట్రాలు (ఉదా. మద్రాసు, బొంబాయి, కలకత్తా) బ్రిటన్‌ తో బలమైన అనుసంధానాన్ని కలిగి ఉండేవి. ఢిల్లీ దీనికి మినహాయింపు. ఇది భారత రాజధానిగానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆనాడు రేవు పట్టణాలు రెండు ప్రయోజనాలను నెరవేర్చేవి. ఒకటి ఎగుమతి ప్రాంతాలుగా, ప్రధానంగా ముడిసరుకులను సేకరించి విదేశాలకు (ప్రధానంగా బ్రిటన్‌) ఎగుమతి చేయడానికి ఇవి ఉపయోగపడేవి. రెండు, ఆ ముడి సరుకులనుంచి తయారు చేసిన సరుకులను బ్రిట¯Œ నుంచి దిగుమతి చేసుకుని వాటిని దేశంలోని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయడానికి దిగుమతి కేంద్రాలుగా వ్యవహరించేవి. క్రమక్రమంగా ఈ రేవు పట్టణ జనవాసాలు మార్కెట్‌ కేంద్రాలుగా పరిణమించి తక్కువ విలువ కలి గిన సరుకులను ఉత్పత్తి చేసేవి. లండన్‌ వంటి విదేశీ మహానగరంతో నిత్యం అనుసంధానంతో ఉండటంతో రేవుపట్టణాల్లో సాగిన నిత్య ఆర్థిక కార్యాచరణ ఫలితమే ఇది.

వ్యూహాత్మక నగరాల స్థాపన–రేవు పట్టణాలను లోతట్టులోని స్థానిక ప్రాంతాలతో అనుసంధించటం– అనేది దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందింది. భారీ స్థాయి ఎగుమతుల కోసం, ప్రాథమిక ఉత్పత్తుల కొనుగోలును సంఘటితం చేయడం, చిన్న చిన్న మార్కెట్లలో పంపిణీ కోసం టోకున వినియోగ సరుకులను కొనుగోలు చేయడం ద్వారా రేవు పట్టణాలను వ్యూహాత్మక పట్టణాలకు అనుసంధానిస్తూ సుదీర్ఘమైన రవాణా లింకులను నిర్మించారు.

దీని ఫలితంగా దేశంలోని ఆన్ని రాష్ట్రాలూ.. వేరుపడిన అనేక స్థానిక మార్కెట్ల అభివృద్ధికి సాక్షీభూతమై నిలిచాయి. ఈ స్థానిక మార్కెట్లు రవాణా, ప్రాసెసింగ్, నిల్వ, భారీమొత్తంలోని సరుకులను వేరుపర్చడం, రుణ సౌకర్యం వంటివాటికోసం వ్యూహాత్మక పట్టణాలపై ఆధారపడేవి. ఈ స్థానిక మార్కెట్లలో చేతివృత్తుల ఉత్పత్తులు, వ్యవసాయ సరుకులు స్థానికంగానే పంపిణీ అయ్యేవి. ఎగుమతి అయ్యేవి కాదు. ఇక్కడ కూడా బ్రిటిష్‌ పాలకులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం రవాణా, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు, పాలనా కేంద్రాలు (ఉదా, జిల్లా కేంద్రాలు, తాలుకాలు) నెలకొల్పడం, క్రమబద్ధీకరణ మార్కెట్లను సృష్టించడం వంటి అనుబంధ కార్యకలాపాలను చేపట్టేవారు. ఈ ప్రాదేశిక చట్రం అనేది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా విస్తృతంగా కొనసాగింది. 1990లలో మాత్రమే సేవల ఔట్‌ సోర్సింగ్‌ వల్ల దేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాలు– ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై–తోపాటు మొదటిసారిగా హైదరాబాద్, బెంగళూరు కూడా ప్రధాన నగరాల స్థాయికి ఎదిగాయి.

అందుచేత, భారతదేశంలోని రాష్ట్రాలు రెండు రకాల ప్రాదేశిక సంబంధమైన అభివృద్ధి చట్రాలను కలిగి ఉంటున్నాయి. మొదటి రకంలో కొన్ని ప్రధాన నగరాలు తమ చుట్టూ ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు సరుకులను, సేవలను అందిస్తూ ఉంటాయి. మొదటి విభాగంలోని కొన్ని రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్‌ (కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, లక్నో. వీటి ఇంగ్లిష్‌ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి వీటిని కావల్‌ పట్టణాలు KAVAL అని పిలుస్తున్నారు); రాజస్తాన్‌ (జైపూర్, ఉదయ్‌పూర్‌); పంజాబ్‌ (లూథియానా, అమృత్‌సర్‌); హరియాణా; మధ్యప్రదేశ్‌ (భోపాల్, ఇండోర్‌), కేరళ. ఈ ప్రధాన పట్టణాలు వాటి సమీప ప్రాంతాలపై బలమైన ఆర్థిక ప్రభావం కలిగి ఉంటాయి.

 
ఇక రెండో రకం ప్రాదేశిక చట్రం పూర్తిగా విభిన్నంగా ఉంటోంది. ఈ నిర్మాణంలో అత్యంత ప్రధానమైన నగరం ఉంటుంది దీన్నే ప్రధాన నగర చట్రం అని పిలిచారు. ఈ ప్రధాన నగరం మొత్తం రాష్ట్రంపైన అత్యధిక స్థాయిలో ఆర్థిక ప్రభావం వేస్తూ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విభాగంలోకి తమిళనాడు (చెన్నై), మహారాష్ట్ర (ముంబై), పశ్చిమబెంగాల్‌ (కోల్‌కతా), ఢిల్లీ జాతీయ రాజధాని వస్తాయి. మునుపటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రత్యేకమైనది, అద్వితీయమైనది. రెండు వేర్వేరు ప్రాంతాలు కలిపి ఇది రూపొందింది. నిజాం ప్రాబల్యంలోని కొన్ని భాగాలు, మద్రాస్‌ ప్రెసిడెన్సీలోని కొన్ని ప్రాంతాలు కలిపి రూపొందిన రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌. ప్రాదేశికంగా చూస్తే ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా విభిన్నమైనవి. నిజాం పరిధిలోని ప్రాంతంలో ఒకే ప్రధాన నగరం (హైదరాబాద్‌) ఉంటూండగా, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో అనేక ప్రధాన నగరాల (విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు) నెట్‌వర్క్‌తో ఉంటూ వచ్చింది. 2014లో మునుపటి ఆంధ్రప్రదేశ్‌ను పునర్‌ వ్యవస్థీకరించిన తర్వాత తెలుగు వారికి మళ్లీ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌ ప్రధాన నగరంగా ఉంటున్న తెలంగాణ, రెండు మూడు ప్రధాన నగరాల అనుసంధానంతో కూడిన ఆంధ్రప్రదేశ్‌. ఒకటి కంటే ఎక్కువ నగరాలతో కూడిన రాష్ట్రంలో పలు రాజధానులు ఉండటం అనే భావన మరింత ప్రభావశీలమైన అభివృద్ధి వ్యూహంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రంలో నిర్వహణాత్మకమైన అభివృద్ధి వ్యూహా నికి చోటు ఉంటుంది.

అభివృద్ధి నిర్వహణకు సంబంధించిన సాంప్రదాయక సాధనాలు ఏవంటే భూమి (ఉపయోగం/భవననిర్మాణ) క్రమబద్ధీకరణలు, అభివృద్ధికి సంబంధించిన సరిహద్దులను నెలకొల్పడం, అద్భుతమైన పన్నుల ప్రభావం వంటివే. రాష్ట్రంలోని పలు నగరాలకు రాజధాని నగరం విధులను పంపిణీ చేయడం అనేది అభివృద్ధి నిర్వహణకు సంబంధించిన నూతన సాధనంగా ఉంటుంది. ఉనికిలో ఉన్న నగరాల ప్రాదేశిక చట్రాన్ని సమతుల్యం చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి నిర్వహణను కొనసాగించడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు అంశాలు అంటే ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం అనే వాటి మధ్య సమతూకాన్ని సాధించగలగడానికి అభివృద్ధి నిర్వహణ వ్యూహం తోడ్పడుతుంది.

ప్రత్యేకించి, ఈ సాహసోపేతమైన, నూతన అభివృద్ధి నిర్వహణ వ్యూహం అనేది.. అభివృద్ధి పరిమాణానికి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో రవాణా, ఇంధనం, నీరు, వ్యర్థాల తొలగింపు, ప్రజాభద్రత, విద్య, ప్రజారోగ్యం తదితర ప్రధాన సేవలను అందించడానికి మధ్యన నిజమైన సమతూకాన్ని సాధించగలుగుతుంది. అంతకుమించి, ఆహార ఉత్పత్తి, నీటి పరిమాణం, నీటి నాణ్యత, గాలి నాణ్యత, మొక్కలు, జంతువుల ఆవాసం వంటి సహజ వ్యవస్థలు సమర్థంగా మనగలగడానికి ఈ నూతన అభివృద్ధి వ్యూహం ఇతోధికంగా తోడ్పడుతుంది. పైగా ఇప్పుడు పర్యావరణం తనకు తానుగా అభివృద్ధి కారకంగా ఉంటోందని మనం గుర్తించి తీరాలి.

రాజధాని నగరంలోని విధులను రాష్ట్రంలోని పలు నగరాల మధ్య పంపిణీ చేయడం అనేది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రాదేశిక చట్రాల అభివృద్ధి చరిత్రను ప్రత్యేకంగా నిర్మించడం అనే వైఖరిలోనే సంప్రదాయేతర దృక్పథం ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న ఈ విశిష్ట ప్రయత్నం విజయవంతమైతే, పలు ప్రధాన నగరాల అనుసంధానంతో కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో ఏపీ ఒక దీపస్తంభంలా దారి చూపుతుంది. 
(ది వైర్‌ సౌజన్యంతో)

సమీర్‌ శర్మ
పీహెచ్‌డీ స్కాలర్, అమెరికా:
డీలిట్, కంచి విశ్వవిద్యాలయం 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top