పుస్తక నవోదయం...

Puranapanda Vyjayanthi Article On Navodaya Rammohan Rao - Sakshi

నివాళి

విజయవాడలోని ఏలూరురోడ్డులో అన్నీ పుస్తకాలయాలే, అందులో అన్నీ ఉద్ద్దండుల పుస్తకాలే. అన్ని ప్రచురణల మధ్య రెండు చేతులు జోడించి నమస్క రిస్తూ కనిపిస్తుంది నవోదయ సంస్థ. తెలుగు వారంతా తెల్లకాగితాలతో ఉన్న ఒక పుస్తకాన్ని  ప్రదర్శిస్తే దానికి కూడా నిశ్శబ్దంగా నవోదయ ముద్ర పడుతుంది. ఈ ముద్ర వెనుక కథ చాలా పెద్దదే. రామమోహనరావు చిన్నబావ కొండపల్లి రాఘవరెడ్డి గుడివాడలో ‘నవోదయ పబ్లిషర్స్‌’ స్థాపించిన ఏడాదికే ఆ కార్యాలయాన్ని విజయవా డకు మార్చడంతో నవోదయ ప్రస్థానం మొద లైంది. 60 ఏళ్ల క్రితం సువిశాల ప్రాంగణంలో ప్రారంభమై, కొత్త పోకడల పెనుతుఫాన్‌కు తల వంచి, తన పరిధిని తగ్గించుకుంది. నవోదయ సంస్థ ఆర్థికంగా చిక్కినా, లక్ష్యాన్ని విడిచి పెట్టలేదు. ప్రచురణలు ఆపారు. విక్రయాలు జరిపారు. 

1934లో కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా ఉంగుటూరు గ్రామంలో ముగ్గురు ఆడపిల్లల తరవాత జన్మించిన అట్లూరి రామమోహన్‌రావు, ఎస్సెస్సెల్సీ వరకు చదువుకున్నారు. 1955లో పర్వతనేని ఝాన్సీతో దండల వివాహం చేసు కున్నారు. పుస్తక వ్యాపారాన్ని గౌరవప్రదమైన వృత్తిగా భావించిన రామమోహనరావు, ‘చదువుకున్న వారితో పరిచ యాలు పెరిగినకొద్దీ నాకున్న సాహిత్య పరిజ్ఞానం ఎంతటిదో తెలిసింది. బాపు కార్టూన్ల సంకలనాన్ని శ్రీరమణ ముందుమాటతో మొట్టమొదటగా ప్రచు రించే అదృష్టం నాకు దక్కింది. నండూరి రామ మోహనరావుగారి ‘విశ్వ రూపం’ పుస్తకాన్ని నాటి రాష్ట్ర విద్యామంత్రి పీవీ నరసింహారావు ఆవిష్క రించడం మరపురాని ఘట్టం. ‘బాపు రమణీయం’ పుస్తకావిష్కరణ సభ నవోదయ సంస్థకి ఒక తీపి జ్ఞాపకం అనేవారు. కలకత్తాలోని పుస్తకప్రదర్శనకు వెళ్లి వచ్చాక, ‘ఇటువంటి పండుగను యేటా విజ యవాడ నగరంలో నిర్వహిస్తే బాగుంటుంది. అందరూ కలిసి వస్తే అందుకు నేను పెద్దరికం తీసుకుంటాను’ అని పలికి, పాతికేళ్లపాటు పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఒక రచయిత పదికాలాల పాటు జీవించి ఉండాలంటే వారి రచనలు పుస్తక రూపంలో ఉండాలి. లేదంటే ఆ వ్యక్తి రచయితగా మరణించినట్లే అనే భావనతో చాలామందిని సజీ వులను చేశారు రామమోహనరావు.

1961 నాటికి గొల్లపూడి మారుతీరావు రచించిన ‘చీకట్లో చీలికలు’ పుస్తకానికి బాపుతో బొమ్మలు వేయించారు. ముళ్లపూడి వెంకటరమణ ‘గిరీశం లెక్చర్లు’ పుస్తకం అందంగా ముద్రించడంతో, వారికి నవోదయ మీద నమ్మకం కుదిరింది. ‘‘బాపు ఓసారి హైదరాబాద్‌ వెళ్తూ విజయవాడలో నన్ను కలవటం నా జీవితంలో మేలి మలుపు. నాటి నుంచి వారిద్దరూ నాకు ఆత్మీ యులు. అందుకే వారితో అవసరానికి మించి అభి మానం పెంచుకున్నాను’’ అని వారిని స్మరించుకునే వారు రామమోహనరావు. శంకరమంచి సత్యం రచించిన ‘అమరావతి కథలు’ (100 కథలు) పుస్త కానికి బాపు చేత బొమ్మలు వేయించాలనుకున్న కలను నెరవేర్చుకున్నారు. ఆకాశవాణి మిత్రుల మాటలలో జరుక్‌శాస్త్రి పేరు తరచుగా తగిలేది. ‘ఎవరు ఈ జరుక్‌శాస్త్రి? చదువుదామంటే ఎక్కడా కనబడడేమండీ?’ అనుకుని, సమాచారం సేక రించి, ‘శరత్‌ పూర్ణిమ’ (కథలు), ‘తనలో తాను’ (వ్యాసాలు), ‘జరుక్‌శాస్త్రి పేరడీలు’ ప్రచురించారు. ఆరుద్ర కోరికపై, శ్రీరంగం నారాయణబాబు ‘రుధి రజ్యోతి’ ప్రాముఖ్యత తెలియకుండానే ప్రచురిం చడంవల్ల శ్రీశ్రీ, ఆరుద్రల మధ్య సంబంధాలు నిర్దేశించే స్థాయికి చేరింది ఆ ప్రచురణ. 1963లో గోపీచంద్‌ ఫొటోని క్యాలెండర్‌గా ప్రచురించారు.

నవోదయ రామమోహనరావును ఎవరైనా ‘మీరు కమ్యూనిస్టు కదా’ అంటే ‘నేను కమ్యూ నిస్టుని కాదు, హేతువాదిని. నా పిల్లలిద్దరి పెళ్లిళ్లూ రిజిస్ట్రార్‌ ఆఫీసులోనే చేయించాను. మా అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్నప్పుడు గర్విం చాను. మా నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రి యలు నిర్వహించమని ఎంతమంది ఒత్తిడి చేసినా తలొగ్గలేదు. నా తదనంతరం కూడా నా శరీరంలోని అన్నిభాగాలూ వైద్య విద్యార్థులకే ఉపయోగ పడాలన్నది నా కోరిక’ అనేవారు. ఎన్నో ఆదర్శ భావాలు కలిగి, పుస్తక ప్రపంచంలో ఒక శకాన్ని సృష్టించిన నవోదయ రామమోహనరావు, తన ప్రచురణల ద్వారా రచయితతో పాటు చిరయశస్సు సంపాదించుకున్నారు.
(బాపు జయంతిరోజునే నవోదయ రామమోహనరావు కాలం చేయడం యాదృచ్ఛికం కావొచ్చు)
 డాక్టర్‌ వైజయంతి పురాణపండ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top