ఫిరాయింపులు.. దబాయింపులు!

K. Ramachandra Murthy writes on defections - Sakshi

త్రికాలమ్‌

రాజ్యాంగాన్ని సవ్యంగా అమలు చేయవలసిన వ్యక్తులూ, సంస్థలూ విఫలమైనప్పుడు రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం అనివార్యం. రాష్ట్రపతి, గవర్నర్‌ ప్రత్యక్షంగా రాజ్యాంగ పరిరక్షకులు. ప్రధానీ, ముఖ్యమంత్రులూ రాజ్యాంగం ప్రకారం ఎన్నికై రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు. వీరంతా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినప్పుడూ లేదా ఎవరైనా రాజ్యాంగాన్ని బుద్ధిపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే తమకు సంబంధం లేనట్టు మరోవైపు చూసినప్పుడూ చట్టపాలనను అభిలషించే పౌరులు ఎవరికి ఫిర్యాదు చేయాలి? రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజ్యాంగంలోని లోపాలను వినియోగించుకొని రాజకీయక్రీడ తెలివిగా, కొంటెగా కొనసాగిస్తుంటే బాధితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ ఫిరాయించినవారిపైన ఏమి చర్య తీసుకోవాలో తాను నిర్ణయించడానికి ముందే విపక్ష సభ్యులు కోర్టుకు ఎక్కారు కనుక ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అనడంలోని గడుసుతనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. వారు సకాలంలో చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఏమున్నది? ఫిరాయించినవారిపై చర్య తీసుకోవలసిందిగా సభాపతికి, న్యాయస్థానాలకు విన్నవించుకొని దాదాపు మూడున్నరేళ్లు గడుస్తున్నా ఫలితం రానప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం కర్తవ్యం ఏమిటి? శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా అధికార పక్షం అవలంబి స్తున్న అప్రజాస్వామిక వైఖరిని జాతీయ స్థాయి పెద్దల, సంస్థల దృష్టికి తీసుకురావడం ఒక్కటే మార్గం. ఈ విధంగా నిరసన ప్రకటించడం ద్వారా దబాయింపు రాజకీయాలకూ, రాజ్యాంగ విరుద్ధమైన పోకడలకూ సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న పని అదే. ఇదే పని ఇంతటి బలమైన కారణం లేకుండానే చాలా స్వల్పమైన అంశాలపైన నిరసనగా ఎన్‌టి రామారావు సభకు రాకుండా ఉన్నారు. చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో ఉండగా సభను బహిష్కరించారు. వారు చేస్తే ఒప్పు అయినది ఎవరు చేసినా తప్పు కాజాలదు.

పార్టీ ఫిరాయింపు అనేది తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాదు, దేశం మొత్తాన్ని అయిదు దశాబ్దాలుగా పీడిస్తున్న జాడ్యం. కాంగ్రెస్‌ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది 1967లో. ఆ సంవత్సరం 16 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. తక్కిన రాష్ట్రాలలో ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. అప్పుడు చట్టసభల సభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రక్రియ జోరందుకున్నది. 1967–71 మధ్య 142 మంది పార్లమెంటు సభ్యులూ, 1,900 మంది శాసనసభ్యులూ పార్టీలు ఫిరాయించారు. హరియాణా, తదితర రాష్ట్రాలలో ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోయేవి.

ఆయారాం గయారాం
హరియాణాకు చెందిన గయాలాల్‌ అనే శాసనసభ్యుడు వరుసగా మూడు విడతల పార్టీలు ఫిరాయించాడు. అప్పటి నుంచీ పార్టీలు మారడాన్ని ‘ఆయారాం గయారాం’ అని పిలవడం ఆనవాయితీ. పార్టీ ఫిరాయించినవారికి మంత్రి పదవులూ, కార్పొరేషన్‌ అధ్యక్ష పదవులూ ఇచ్చేవారు. అది ఒక లాభసాటి అవినీతి వ్యాపారంగా మారింది. ఫిరాయింపుల ఆట కట్టించడానికి తొలిప్రయత్నం 1985లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేశారు. 101, 102, 190, 191 అధికరణలలో మార్పులు చేస్తూ 52వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. ఈ సంస్కరణల అమలు కోసం పదవ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యులపైన అనర్హత వేటు వేసే అధికారం సభాపతులకు మాత్రమే ఇచ్చారు. వారి నిర్ణయాలను ప్రశ్నించే అధికారం న్యాయవ్యవస్థకు ఇవ్వలేదు. మూడింట ఒక వంతు మంది చట్టసభ సభ్యులు పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పార్టీలో విలీనం కావచ్చు. అంతకంటే తక్కువ మంది పార్టీని వీడితే అనర్హత వేటు తప్పదు. ప్రధాని పీవీ నరసింహారావు అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కడానికి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీని చీల్చారు. భూపతిరాజు ఆధ్వర్యంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సభ్యులే చీలిపోయారు.

చిన్న పార్టీలలో మూడింట ఒక వంతు మంది చేతులు కలిపి పార్టీ నుంచి నిష్క్రమించడం తేలిక. ఆ కారణంగా 52వ రాజ్యాంగ సవరణ వల్ల ఆశించిన ఫలితం దక్కలేదు. 2003లో నాటి ప్రధాని వాజపేయి నాయకత్వంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. ఈ చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల మంది సభ్యులు కలిస్తేనే పార్టీ నుంచి విడిపోయి వేరే పార్టీలో విలీనం కావచ్చు లేదా వేరే పార్టీగా మనుగడ సాగించవచ్చు. సభ్యత్వానికి ఢోకా లేదు. ఈ చట్టం వచ్చిన తర్వాత సైతం ఫిరాయింపులు ఆగలేదు. కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు ఈ క్రీడలో సమధికోత్సాహంతో పాల్గొంటున్నాయి. నీతి, నిజాయితీలకు తిలోదకాలు ఇచ్చేసి నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రభుత్వాధినేతలే ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం నల్లధనం వినియోగిస్తున్నారు. పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారు. ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఫిరాయింపు రాజకీయాలు ముమ్మరంగా సాగాయి. తమిళనాడులో పళ నిస్వామి ప్రభుత్వాన్ని కాపాడేందుకు స్పీకర్‌ పి. ధనపాల్‌ మొన్న సెప్టెంబర్‌ 18న టీటీవీ దినకరన్‌కు చెందిన 18 మంది ఏఐఏడీఎంకె శాసనసభ్యులపైన అనర్హతవేటు వేశారు. ఇతర పార్టీల కంటే భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఏ మాత్రం సంకోచం లేకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. తెలుగు రాష్ట్రాల సంగతి సరేసరి.

రాజ్యాంగంలోని లొసుగులను అధికార పార్టీలు ఎంత తెలివిగా ఉపయోగించుకుంటున్నాయో గమనిస్తే పాలకులకు రాజ్యాంగం పట్ల, న్యాయం పట్ల, ధర్మం పట్ల ఎంత పట్టింపు ఉన్నదో అర్థం అవుతుంది. కిహోటో హోలోహన్‌ వర్సెస్‌ జాచిల్హూ కేసు విచారణ సుప్రీంకోర్టులో 1992లో జరిగింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సభాపతికి పదో షెడ్యూల్‌ సంపూర్ణ అధికారం ఇచ్చినప్పటికీ వారు షెడ్యూల్‌లోని 6(1)వ పేరాలో పేర్కొన్న విధంగా వ్యవహరించాలని చెప్పింది. సభాపతి నిర్ణయాన్ని న్యాయసమీక్ష జరిపే అధికారం హైకోర్టులకూ, సుప్రీంకోర్టుకూ ఉన్నదని కూడా స్పష్టం చేసింది. సభాపతికి నిర్ణయాధికారం ఇచ్చే పదో షెడ్యూల్‌లోని ఏడవ పేరా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని, దాని విషయంలో పునఃపరిశీలన జరపడమో, రాజ్యాంగ సవరణ చేయడమో ఉత్తమమని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మరో ఆసక్తికరమైన వివాదం కూడా ఇందుకు సంబంధించి జరిగింది. మణిపూర్‌ స్పీకర్‌ బోరోబాబూసింగ్‌ 1992లో ఒక శాసనసభ్యుడిపైన అనర్హత వేటు వేశారు. సదరు శాసనసభ్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు సంపాదించారు. మణిపూర్‌ శాసనసభ కార్యదర్శి మణిలాల్‌సింగ్‌ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు తగినట్టు శాసనసభ్యుడి పునరాగమనానికి రంగం సిద్ధం చేశారు. ఇది తెలుసుకున్న బోరోబాబూసింగ్‌ మణిలాల్‌సింగ్‌ను సస్పెండు చేసి ముందస్తు పదవీ విరమణకు ఆదేశించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో న్యాయవాదులు మాట వరుసకు ప్రస్తావిస్తే సుప్రీం న్యాయమూర్తులు ఆగ్రహించి మణిలాల్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ధిక్కారనేరం కింది తమ ఎదుట హాజరు కావలసిందిగా స్పీకర్‌ని ఆదేశించారు.

తెలుగు రాష్ట్రాలలో ప్రబలిన తెగులు
రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, నీతి బాహ్యం, అప్రజాస్వామికం. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయించిన 21 మంది శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయాలని వైఎస్‌ఆర్‌సీపీ సభాపతికి మహజర్లు సమర్పించింది. ఆయన స్పందించలేదు. హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌ను ఎట్లా సమర్థిస్తారో చెప్పవలసిందిగా ఫిరాయించిన శాసనసభ్యులనూ, శాసనసభ కార్యదర్శినీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్‌ రంగనాథన్, శంకర నారాయణతో కూడిన డివిజన్‌ బెంచ్‌ 2016 నవంబర్‌ 14న అడిగింది. మళ్ళీ ఈ కేసు విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో విడిగా వైఎస్‌ఆర్‌సీపీ బాధ్యులు పిటిషన్‌ వేశారు. అమరావతిలో శాసనసభా ప్రాంగణానికి ఈ యేడాది మార్చి రెండో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ఫిబ్రవరి 27న ప్రతిపక్ష నాయకుడూ, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభాపతికి బహిరంగ లేఖ రాశారు. ఫిరాయించిన శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా అభ్యర్థించారు. సభాపతి ఉలకలేదు.

ముఖ్యమంత్రి మాత్రం వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారు. ఫిరాయింపుదారులను వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులుగా అసెంబ్లీ బులెటిన్లలో చూపించడం మరింత విడ్డూరం. వీటన్నిటినీ భరిస్తూ తాము అడిగే ప్రశ్నలకు ఫిరాయించి మంత్రి పదవులు సంపాదించినవారు సమాధానాలు చెబుతుంటే, వింటూ తలలూపుతూ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ఉండాలని తెలుగుదేశం నాయకత్వం కోరుకుంటోంది. ఆ పని చేస్తే ఫిరాయింపులనూ, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులతో సత్కరించడాన్నీ వైఎస్‌ఆర్‌సీపీ ఆమోదించినట్టు అవుతుంది. రాజ్యాంగ వ్యతిరేక చర్యలనూ, నీతి బాహ్యమైన వైఖరినీ ఆమోదించడం ఇష్టం లేని కారణంగానే సభను బహిష్కరించామంటూ ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫిరాయింపుదారులపైన చర్యలు తీసుకున్న మరుక్షణం నుంచి హాజరు అవుతామని చెబుతున్నారు.

తెలంగాణలో ప్రగతి
తెలంగాణలో ఫిరాయింపుదారులపైన వ్యాజ్యం ఇంకాస్త ముందుకు జరిగింది. కాంగ్రెస్‌ శాసనసభ్యుడు ఎస్‌ఎ సంపత్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్‌కె అగర్వాల్, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌తో కూడిన బెంచ్‌ పరిశీ లించి ఇది చాలా సున్నితమైన విషయం కనుక అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని నిర్ణయించింది. 2016 నవంబర్‌ 9న ధర్మాసనానికి నివేదించింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయవలసిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషనర్‌ ప్రార్థించారు. ఎన్నికలలో 67 స్థానాలు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కి ఫిరాయింపుల ధర్మమా అని 89 స్థానాలు ఉన్నాయంటూ ధర్మాసనానికి నివేదించారు. ఇదే రకమైన ప్రార్థన హై దరాబాద్‌ ఉమ్మడి హైకోర్టులో వేయగా 90 రోజులలోగా ఫిరాయింపుదార్లపైన చర్య తీసుకోవలసిందిగా స్పీకర్‌ మధుసూదనాచారిని కోరింది. ఆయన నిమ్మకునీరెత్తినట్టు మిన్నకున్నారు.

పదో షెడ్యూల్‌లో సభాపతులకు విశేషాధికారాలు ఇచ్చినప్పుడు వారు పార్టీలకి అతీతంగా వ్యవహరిస్తారనీ, ప్రధానమంత్రుల, ముఖ్యమంత్రుల బంట్లుగా కాకుండా వారి హోదాకు తగినట్టు, రాజ్యాంగం నిర్దేశించినట్టు స్వతంత్రంగా వ్యవహరిస్తారనీ భావించారు. ఈ భావనే ఘోర తప్పిదమని మూడు దశాబ్దాలలో సభాపతులే నిరూపించారు. కిహోటో హోలోహన్‌ కేసులో తీర్పు చెబుతూ సుప్రీంకోర్టు ఉన్నత పదవిలో ఉన్న సభాపతిని శంకించడం ధర్మం కాదని వ్యాఖ్యానిస్తూ, ‘సభాపతి దుస్తులు ధరించిన తర్వాత ‘లోపలి మనిషి’ ఉన్నతంగా పరిణామం చెందుతారు’ అనే ఆశాభావం వెలిబుచ్చింది. రెండున్నర దశాబ్దాల అనంతరం మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానం అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభాపతి కేసులో తీర్పు ఇస్తూ ‘సభాపతి దుస్తుల లోపలి మనిషి’ పట్ల అవిశ్వాసం ధ్వనిస్తూ సభాపతిపైన పరిమితులు విధించాలని సూచించింది.

సభాపతులు ప్రధానమంత్రులకూ, ముఖ్యమంత్రులకూ విధేయులుగానే ఉంటారని స్పష్టమైపోయింది. అందువల్ల వారికి పదో షెడ్యూల్‌లో దఖలు పరచిన విశేషాధికారాన్ని రద్దు చేసి ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే నిర్ణయం రాష్ట్రపతి కానీ గవర్నర్‌ కానీ తీసుకోవాలనీ, వారు సైతం ఎన్నికల కమిషన్‌ సలహాను విధిగా పాటించాలనీ జస్టిస్‌ ఎంఎన్‌ వెంకటాచలయ్య నేతృత్వంలోని రాజ్యాంగ సమీక్ష కమిషన్, అంతకు పూర్వం దినేష్‌ గోస్వామి కమిటీ సిఫార్సు చేశాయి. దీని అమలుకు రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు ప్రధాని మోదీ సహకారం తప్పనిసరి. అవినీతిపైనా, నల్లధనంపైనా యుద్ధం చేస్తున్న ప్రధానికి నల్లధనం, అవినీతితో కూడిన ఫిరాయింపులనే వికృత క్రీడ సమ్మతం కాజాలదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కుహనా ప్రజాస్వామికశక్తుల ఆటకట్టించే శక్తి ప్రస్తుతం మోదీకి మాత్రమే ఉంది. భారత ప్రజాస్వామ్యానికి పట్టిన చీడను వదిలించేందుకు నడుం బిగిస్తే మోదీ చరితార్థులు అవుతారు.


    - కె. రామచంద్రమూర్తి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top