రైతు సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

Guest Column By TRS MLA Gongidi Sunitha - Sakshi

సందర్భం

పంటకు గిట్టుబాటు ధరలేక, అప్పు కట్టలేక, విల విలలాడిన రైతు కళ్లలో ఇప్పుడు మార్పును చూస్తున్నాం.  ఒకవైపు సాగునీళ్ళు, మరొక వైపు కరెంట్‌పై ఆశలు వదులుకున్న రైతు, నేడు గుండెనిండా ధైర్యంతో వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రైతు కావడంతో వారి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త తరహా రైతు పథకాలు ప్రవేశ పెట్టి రైతుల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ గుణాత్మక మార్పులతో రైతులకు భరోసా ఇస్తున్న తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలను దేశవ్యాప్తంగా ఆర్థికరంగ నిపుణులు, మేధా వులు, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొనియాడుతున్నాయి. ఇటీవల ఓ రైతును కలిశాను. వ్యవసాయం దండుగ అని హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటున్న ఆ రైతు తన జీవితంలో వచ్చిన మార్పు గురించి చెబుతుంటే నా కళ్లు చెమర్చాయి.  

ఆ సంభాషణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజాపేట దగ్గర ఓ ఊరికి వెళ్తూ బొందుగుల వద్ద ఓ వ్యక్తిని చూసి ‘నేను ఎవరో తెలుసా’అని అడిగా.  ఆయన తెలుసు ‘‘మీరు గొంగిడి సునీతమ్మవు’’ కదా అన్నాడు. అతడితో పది నిమిషాలు మాట్లాడా. తన పేరు యాదగిరి అనీ, వ్యవసాయం చేస్తుంటాననీ చెప్పాడు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పెట్టుబడి సాయం ఎలా ఇస్తే బాగుంటుందని అడిగా.  తహసీల్దార్‌ ద్వారానా, వ్యవసాయాధికారి ద్వారానా, లేక నగదు రూపంలో ఇస్తే బాగుంటుందా’ అని అడిగా. ‘ఎలా ఇచ్చినా సాయం చేస్తున్నాడు సంతోషం’ అన్నాడు. అయితే, వ్యవసాయం మానేసి ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌ పోయి ఉప్పల్‌లో కూలీ పని చేసుకునేవాడిననీ, భార్య ఇళ్లలో పనిచేసేదని చెప్పాడు.

‘ముఖ్య మంత్రిగా కేసీఆర్‌ వచ్చినంక కరెంట్‌ మంచి గిస్తుండు. పోయినేడు, అంతకు ముందేడు, మొన్నేడు బొందుగుల చెరువుల నీళ్లు నింపిండ్రని తెలిసింది. కేసీఆర్సారు పెట్టుబడి సాయం కూడా ఇస్తుండని తెలిసింది. అప్పుడే బాకి ఎట్లన్న గడతనని ధైర్యం చేసి ఊర్లకొచ్చిన. వచ్చి పదిహేను రోజులైంది,ఇల్లు బాగుచేసుకున్న. ఎనిమిదేండ్ల కింద ఇడిచి పెట్టిన యవసాయం మళ్లీ మొదలు పెడుతున్న. బోర్ల బాయిల నీళ్ళు ఉన్నయి, పొద్దున్నే ట్రాక్టర్‌ మాట్లాడిన, రేపు వస్తనన్నాడు. ఇయాల మోటరు తెచ్చుకునేందుకు భువనగిరికిపోతున్న..’అని ఆనందంగా చెప్పాడు.  

‘మోటరుకు పైసలు కావాలే కదా’ అని అడిగా. తనకు తెలిసిన అతడు ఉన్నాడనీ, ఇప్పటికైతే తీసుకొస్తననీ చెబుతూ ‘పైసలు తొందరగా ఇప్పియాలమ్మా, నీకు దండం పెడుతా’ అనుకుంటూ అటుగా వస్తున్న ఆటోను ఆపి వెళ్లిపోయిండు. అతని మాటల్లో ఒక ధైర్యం, గర్వం కనిపించాయి. రైతురుణమాఫీని విడిగా చూడకుండా, సమగ్ర వ్యవసాయ వ్యూహంలో భాగంగా చూసినవారికి దాని ప్రాధాన్యం అర్థమవుతుంది. ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిధిలోనే ఆలోచిస్తారు. కానీ పాలకులు మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు అన్వేషిస్తారు. ముఖ్యమంత్రి వ్యవసాయరంగ వ్యూహం ఈ విధంగా రూపొందినదే.

రైతులకు అవసరమైన నీటి వసతి, విద్యుత్, పెట్టుబడి, యంత్రాలు, గిడ్డంగులు, మార్కెట్‌ సౌకర్యం, పంటకు మద్దతు ధర మొదలైనవి అందించడంతోపాటు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా పంటవేయడం మొదలుకొని మార్కెటింగ్‌ కొరకు పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం సాగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రైతులకు 17 వేల కోట్లతో రుణ మాఫీ చేశారు. 2009 నుంచి 2014 సమయంలో సంభవించిన అనేక నష్టాలకు సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి అనునిత్యం రైతు లకు దగ్గరగా ఉంటూ, వారికి కావాల్సిన అవసరాలను తీర్చుతూ సలహాలు, సూచనలు అందించే విధంగా రైతులతోనే గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేశారు.

వ్యవసాయక్షేత్రంలో మంచిచెడులను చర్చించుకుని, అధికారుల సలహాలతో ముందుకు కదిలేందుకు రైతువేదికలను ఏర్పాటు చేసి ప్రతి  ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. మట్టి నమూనాలను పరీక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ధరను నిర్ణయించే హక్కును రైతులకు ఇవ్వాలన్నదే కేసీఆర్‌ సంకల్పం. అవసరమైన చోట శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యవసాయ పనిముట్లు కూడా అందించి పంట కాలనీలను ఏర్పాటుచేయడం, రైతన్న ఏ పంట వేసుకున్నా ఆ పంటకు డిమాండ్‌ తగ్గకుండా చేయాలని కేసీఆర్‌ సంకల్పించారు. రైతు సంపన్నుడై అంతిమంగా అప్పులు లేని దశకు చేరుకోవాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. 

వ్యాసకర్త ఆలేరు ఎమ్మెల్యే
గొంగిడి సునీత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top