కుల నిర్మూలనపై మాట్లాడరేం?

Guest Column By Kancha ilaiah On Caste  - Sakshi

అరబ్‌ వసంతం పేరిట చెలరేగిన ప్రజా తిరుగుబాట్లు దశాబ్దం క్రితం ఇస్లామిక్‌ ప్రపంచాన్ని కదిలించివేశాయి. జార్జి ఫ్లాయిడ్‌ దారుణ హత్య నేపథ్యంలో ప్రస్తుతం చెలరేగుతున్న జాతి వివక్షా వ్యతిరేక ఉద్యమాలు పాశ్చాత్య ప్రపంచ మూలాలను కదిలిస్తున్నాయి. మరి మానవుల మధ్య సానుకూల సంబంధాలను, మెరుగైన ఉత్పత్తి సంబంధాలను విధ్వంసం చేస్తున్న భారతీయ కులవ్యవస్థ, వివక్షపై మన మేధావులు గళం విప్పాల్సిన అవసరం లేదా? భారత గడ్డ మీది నుంచి కులాన్ని, అస్పృశ్యతను కలిసికట్టుగా పెకిలించివేయాల్సిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో.. ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది.
ముస్లిం ప్రపంచాన్ని 2010–11 మధ్యకాలంలో అరబ్‌ వసంతం పేరిట ప్రజా తిరుగుబాట్లు చుట్టుముట్టిన చందాన 2020లో పాశ్చాత్య ప్రపంచాన్ని జాతివివక్షా వ్యతిరేక ఉద్యమాలు చుట్టుముడుతున్నాయి.

భారతదేశంలోనూ, అమెరికా–యూరప్‌ ఖండాల్లోనూ నివసిస్తున్న భారత సంతతి పాశ్చాత్య విద్యావంత మేధావులు, పండితులు, క్రియాశీల కార్యకర్తలు, కళాకారులు తాము కూడా నల్లజాతి ప్రజల్లాగే క్రియాశీలకంగా మారారు. వీరిలో చాలామంది బ్రాహ్మణ, బనియా, క్షత్రియులతోపాటు కాయస్థ, ఖాత్రి అనే ఉత్తర భారత కులాలకు చెందిన కుల నేపథ్యం ఉన్నవాళ్లే. అతికొద్దిమంది మాత్రం శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీ నేపథ్యంనుంచి వచ్చినవారు. వీరు పాలకవర్గాలను ప్రభావితం చేయగలిగిన కలం బలం ఉన్నవారు. జాత్యహం కారం, వివక్ష, అసమానత్వంపై నైతిక చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ మేధావులు తమ కులపరమైన మూలాలను కూడా కులంలాగే, జాతిలాగే తిరస్కరిస్తారని ఎవరూ భావించలేరు. 

కుల సమస్యలను వ్యతిరేకిస్తున్న సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు కొందరిని డర్బన్‌లో 2001లో జాతి, జాతి వివక్షత, జాతి దమనకాండపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ సదస్సులో దీపాంకర్‌ గుప్తా, రామచంద్ర గుహ వంటివారు నల్లజాతి ప్రజలు సాగిస్తున్న జాతి వివక్షా వ్యతిరేక విప్లవాన్ని సమర్థిస్తూ మాట్లాడారు. అమెరికాలో నివసిస్తున్న గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వంటి ప్రముఖులు, న్యూయార్క్‌ టైమ్స్, వాషింగ్టన్‌ పోస్ట్, గార్డియన్‌ వంటి ప్రముఖ పత్రికల్లో రాసే భారతీయ కాలమిస్టులు అనేకమంది కూడా తాజాగా జాతివివక్ష సమాజంలోంచి తొలగిపోవాలని చెప్పారు. తాము కూడా నల్లవారిమే అనే విధంగా వీరు ‘నల్లజాతి ప్రాణాలు విలువైనవే’ (బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌) అనే బ్యానర్లను సైతం సాహసోపేతంగా పట్టుకుని ముందుపీటిన నడిచారు. 

అలాంటప్పుడు భారత గడ్డ మీదినుంచి కులం, అస్పృశ్యత కలిసికట్టుగా అంతరించిపోవలసిందేనంటూ, ఓబీసీల నుంచి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి చెప్పాల్సిన నైతిక బాధ్యత మన మేధావులకు లేదా? అమెరికా, బ్రిటన్‌లలో జాతివ్యతిరేక పౌర హక్కుల చట్టాలు అనేకం ఉనికిలో ఉంటున్నాయి కానీ జాతిపరమైన అత్యాచారాలు అక్కడ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమాలకు అర్థం మరిన్ని చట్టాలు రావాలని, పౌర సమాజ మనస్తత్వాన్ని మార్చాలనే తప్ప మరేమీ కాదు. నల్లజాతికి చెందిన జార్జి ఫ్లాయిడ్‌ని తెల్లజాతి పోలీసు అధికారి క్రూరంగా హత్య చేసిన సందర్భంలో తెల్లజాతి పోలీసుల ప్రవర్తనను మార్చడానికి సాగుతున్న ఉద్యమాలు కావివి. కాకపోగా పాశ్చాత్య ప్రపంచంలో ప్రాథమిక మానవ సంబంధాలనే మార్చడానికి సాగుతున్న ఉద్యమాలవి.

మరి మనదేశంలో మనం కులపరంగా బ్రాహ్మణ, బనియా లేక శూద్ర–దళిత నేపథ్యం దేనికైనా చెంది ఉండవచ్చు కానీ.. ఒక సమగ్రమైన కులనిర్మూలన చట్టాన్ని ఆమోదించాలని మనందరం ఎందుకు ప్రశ్నించకూడదు? అమెరికాలో జాతి సమస్యకు పరిష్కారం లిండన్‌ బి.జాన్సనే అంటూ దీపాంకర్‌ గుప్తా తన రచనల్లో ఒకదానిలో సూచించారు. అంటే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ బి జాన్సన్‌ శ్వేత జాతి శాసన కర్తలనుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ 1964 పౌరహక్కుల చట్టాన్ని ఆమోదించుకునే విషయంలో చివరివరకూ పట్టుబట్టి సాధించుకున్నారు. మరి మనదేశంలో కులసమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ప్రధాని మోదీ జనాదరణ కల నేత. పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్దతు పొందారు. పైగా తన సొంత పార్టీ సభ్యులే చెబుతున్నట్లుగా ఓబీసీ నేపథ్యంలో భారతదేశం ఇదివరకెన్నడూ సృష్టించలేకపోయిన సాహసనేత కదా ఆయన. మరి మోదీ ప్రభుత్వాన్ని కుల నిర్మూలనా చట్టం రూపొందించాల్సిందిగా మన భారత మేధావులు ఎందుకు డిమాండ్‌ చేయరు? అంటరానితనానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనలు కానీ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు వంటివి కానీ, ఆర్థికపరమైన మెరుగుదలకు సంబంధించినవే కానీ అవి వ్యవస్థాగతమైన మార్పులను తీసుకురాలేవు.

పాశ్చాత్య ప్రపంచంలో ప్రస్తుతం నడుస్తున్న బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌  ఉద్యమం నల్లజాతి ప్రజలకు కొన్ని ఆర్థికపరమైన, విద్యాపరమైన అవకాశాలను కల్పించే లక్ష్యంతో మాత్రమే సాగడం లేదు. వివిధ వర్ణాల మధ్య, జాతుల మధ్య ప్రాథమిక సంబంధాలనే మార్చే లక్ష్యంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. మనం కూడా దక్షిణాసియాలో ప్రాథమికమైన కుల సంబంధాలనే మార్చిపడేసే విస్తృతి కలిగిన చట్టం రూపకల్పన కోసం పాలకులను అడగాల్సి ఉంది. ఈ సందర్భంలో భారతదేశం చేపట్టే చర్యలు నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే ఈ దేశాల్లో కూడా కుల వ్యవస్థ ఒకటి లేదా పలురూపాల్లో అమలవుతూ వస్తోంది. 
మన దేశంలో కులవ్యవస్థ.. అసమానతలకు సంబంధించిన దొంతర్లను, వివక్షకు చెందిన కార్యాచరణలను సృష్టించిపెట్టిందని ప్రతి మేధావికీ తెలుసు. భారతజాతి అభివృద్ధిని సాగిస్తూ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న దశలో పలురకాల కులాచారాలు, అలవాట్లు ఉనికిలోకి వస్తున్నాయి. ఈ కుల వ్యవస్థ కారణంగానే మన వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అనేకమంది ప్రతిభాపాటవాలు ప్రతి రోజూ తొక్కివేయబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

శూద్రులను, దళితులను, ఆదివాసీలను హిందువులుగా నిర్వచిస్తూనే మన ఆలయాల్లో ఆగమశాస్త్రం ప్రాతిపదికన వారిపట్ల వివక్ష ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు వంశపారంపర్య రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుంటున్న  బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశంలోని అన్ని వ్యవస్థల్లోనూ వంశపారంపర్యం ప్రాతిపదికన సాగుతున్న ప్రమోషన్లను కూడా తప్పకుండా వ్యతిరేంచాల్సి ఉంది. జీవితంలోని అన్ని రంగాల్లోనూ సమానత్వంకోసం పాటుపడతానని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ సమగ్రమైన కుల నిర్మూలనా చట్టం తీసుకురావడంపై ఎన్నడూ మాట్లాడిన పాపాన పోలేదు. కాంగ్రెస్‌ పార్టీ మేధావులు అనేక విషయాలపై రచనలు చేశారు కానీ కుల నిర్మూలనా చట్టం గురించి నోరెత్తలేదు.

భారతీయ వైవాహిక వ్యవస్థలో కులం ఒక పాశవికమైన ఉనికిని ప్రదర్శిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలోని పరస్పర ఎంపిక ద్వారా వివాహ సంబంధాలు ఏర్పర్చుకోవడం, అలాంటి తరహాలోని వివాహాలతో ప్రభావితమవుతున్న మన దేశ యువతీయువకులను కులం ప్రాతిపదికన సాగుతున్న పరువు ప్రతిష్టల భావజాలంతో చంపిపడేస్తున్నారు. కులాంతర వివాహాలు చేసుకుంటున్న దంపతులను వివక్షకు, సామాజిక బహిష్కరణకు గురిచేస్తూ వేధిస్తున్నారు. వీరి పిల్లలు అటు పాఠశాలల్లో, ఇటు పౌర సమాజంలోనూ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కులాంతర వివాహం చేసుకున్న కుటుంబాలకు చెందిన కుమార్తెలు, కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదు. తమ తప్పేమీ లేకపోయినా ఇలాంటివారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తెలంగాణలో అమృత–ప్రణయ్, తమిళనాడులో కౌశల్య–శంకర్‌లకు చెందిన ప్రముఖ ఉదంతాలు.. మన దేశంలో అంటరానితనం మాత్రమే కాదు, కుల వ్యవస్థ సైతం యువతీయువకుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని చాటిచెబుతున్నాయి. చివరకు ఒక దృఢమైన కులనిర్మూలనా చట్టం ఉనికిలో లేని నేపథ్యంలో ఘనీభవించిపోయిన కుల వ్యవస్థపై భారతీయ న్యాయ వ్యవస్థ సైతం దృఢవైఖరిని చేపట్టలేకపోతోంది. శాసన సంపుటిలో బలమైన కులనిర్మూలనా చట్టం భాగమైనప్పుడు మాత్రమే కులాచారాలను, కులపరమైన నిందాత్మక భాషను తీవ్రనేరంగా ప్రకటించే పరిస్థితి ఏర్పడుతుంది.
కులం అనేది మానవులను నిర్మూలించే వ్యవస్థ. చారిత్రకంగా చూస్తే కూడా కులం మానవుల్లో సానుకూలమైన, ఉత్పత్తి సంబంధాలను తోసిపుచ్చింది. సకల ఉత్పత్తి రంగాల్లో కులం అనేది అంతరించిపోయినప్పుడు మాత్రమే భారతదేశం ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతుంది. కులవివక్షత తరుణ వయస్కులలో ప్రతిభను, నైతిక విశ్వాసాన్ని చంపేస్తుంది.

కుల నిర్మూలనా చట్టం రూపకల్పన గురించి చర్చ దేశంలోని దళిత, ఓబీసీ మేధావులు, హక్కుల కార్యకర్తలు మాత్రమే మాట్లాడితే సరిపోదు. కులం, జాతి ప్రపంచంలో మానవ సంబంధాలను, విలువలను విధ్వంసం చేస్తున్నాయని తలుస్తున్న వారందరూ దీనిపై తమ అభిప్రాయాలను చెప్పి తీరాలి. అందుకు ఇదే తగిన సమయం.
వ్యాసకర్త: ప్రొఫేసర్‌ కంచ ఐలయ్యషెపర్డ్‌ 
డైరెక్టర్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ ఎక్స్‌క్లూజన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ పాలసీ  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top