మార్క్సిజంపై ఈ వక్రీకరణలు ఎందుకు?

Gandhi Writes On Divisions On What is Marxism - Sakshi

కారల్‌ మార్క్సు 200వ జయంతి నాడు భారత కమ్యూనిస్టు పార్టీలో అత్యున్నత స్థానాన్ని అలంకరించిన మన తెలుగు బిడ్డ సుధాకర రెడ్డి గారు ఓ వ్యాసం రాశారు. అత్యధిక సర్క్యులేషను కల మూడు తెలుగు పత్రికల్లో రెండు పత్రికలు ఆయన వ్యాసాన్ని ప్రచురించాయి. దానిని బట్టి ఆ పత్రికలు ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ వ్యాసంలో ప్రతి వాక్యమూ ఒక ఆణిముత్యమని  నేను కూడా గ్రహించాను. అయితే అన్ని ముత్యాలమీదా మాట్లాడతానంటే సంపాదకులు నాకంత చోటివ్వలేరు అనే ఇంగితం తెలిసినవాడిని కనుక కొన్ని ముత్యాలకే నేనిక్కడ పరిమితమవుతాను.

‘‘సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత’’ సామ్రాజ్యవాదులు అనేక వక్రీకరణలకు పాల్పడ్డారు అంటారు రచయిత. అంటే సుమారు రెండున్నర దశాబ్దాలుగానే వక్రీకరణలు చోటు చేసుకొన్నాయా? అంతకుముందు మార్క్సిజం వక్రీకరణలకు గురి కాలేదా? పైగా వక్రీకరించినవాళ్లు కేవలం సామ్రాజ్యవాదులేనా? సంగతేమంటే మార్క్సిజం పుట్టిన క్షణం నుంచీ వక్రీకరణలకీ గురైంది. దాడులకూ గురైంది. మరో నిజమేమిటంటే దానిని శత్రువులు ఎంతగా వక్రీరించారో అంతకుమించి కమ్యూనిస్టులం అని పేరు తగిలించుకొన్నవాళ్లు వక్రీకరించారు. కొందరు తెలిసీ మరికొందరు తెలియకా ఆ పని చేశారు.‘‘మార్క్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం వైఫల్యం చెందిందని (సోవియట్ యూనియన్ కూలిపోయాక) సామ్రాజ్యవాదులు విస్తృత ప్రచారం’’ చేశారంటారు రచయిత.

నిజమే. మార్క్సిజం ఆచరణలో రుజువయింది అని చెప్పడానికి సోవియట్ యూనియన్ బతికున్నంత కాలం దానినే కమ్యూనిస్టు నాయకులు ఉదాహరణగా చూపారు. మరి అది కూలిపోయినప్పుడు మార్క్సిజం కూడా విఫలమైందని సామాన్యులు అర్థం చేసుకోవడంలో తప్పేముంది? ఆ పరిస్థితినే శత్రువులు వాడుకొంటున్నారు. సుధాకర్‌జీ, మీకు రెండే మార్గాలు. ఒకటి, సోవియట్ యూనియన్‌లో ఉండింది మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజమే అని మీరు డబాయిస్తే, మార్క్సిజం విఫలమైందని ఒప్పుకోక తప్పదు. లేదంటే సోవియట్ ‘‘సోషలిజం’’ మార్క్స్ ఊహించిన సోషలిజం కాదని గ్రహించాలి. సోవియట్ సోషలిజమూ శభాష్, మార్క్సూ శభాష్ అంటే కుదరదు. ఇదే చైనాకూ వర్తిస్తుంది. మిగతా ‘‘సోషలిస్టు’’ దేశాలకూ ఇదే వర్తిస్తుంది.

‘‘సామ్రాజ్యవాదులకు ... విమర్శించే హక్కు లేదు’’ అని ఆయన ఫర్మానా జారీ చేశారు. అది సరే. కాని విమర్శించేవాళ్లందరూ సామ్రాజ్యవాదులేనా అన్నది ప్రశ్న. ఒకరడిగినా అడగకపోయినా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కమ్యూనిస్టు అగ్ర నాయకులకు ఉండనే ఉండదా? ఎవరికీ జవాబు చెప్పకపోయినా మీ సొంత స్పష్టత కోసమైనా పొరపాటు ఎక్కడ జరిగిందో శోధించాల్సిన పనిలేదా? ఆ పని చెయ్యాలంటే మార్క్సునీ ఆశ్రయించాలి. చరిత్రనీ ఆశ్రయించాలి. ఆ దిశగా మీరు రెండడుగులయినా వేశారా, చెప్పండి.

‘‘1978 తదనంతరం మావో వారసుడు డెంగజియావో పింగ్ నాయకత్వంలో అనేక సంస్కరణలను తీసుకురావడం జరిగింది. తత్ఫలితంగా 80 కోట్ల ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారు.’’ అంటారు సుధాకర్‌జీ. అంటే ఆ 80 కోట్ల మంది మావో నాయకత్వంలో మూడు దశాబ్దాలపాటు దరిద్రంలో మగ్గారనేనా? సుధాకర్‌జీ అంతమాట అనలేరు. ఈ వ్యాసంలోనే మావో లాంగ్ మార్చ్‌కూ మార్క్సే ప్రేరణ అన్నారు రచయిత. ఇక్కడేమో డెంగ్‌కీ మార్క్సిజమే ప్రేరణ అంటున్నారు.

ప్రపంచంలో నయా ఉదారవాదాన్ని అధికారికంగా ప్రారంభించిన ముగ్గురు మొనగాళ్లలో డెంగ్ జియావో పింగ్ ఒకడు. సంస్కరణ అనే ముద్దు పేరుతోనే వారు దాన్ని ప్రవేశపెట్టారు. మిగతా ఇద్దరిలో ఒకరు మార్గరెట్ థాచర్. రెండోవాడు రొనాల్డ్ రీగన్. దానినే అదే ముద్దు పేరుతో ఇక్కడ ఇండియాలో పివి నరశింహారావు, మన్మోహన్ సింగ్ జంట సుమారు పుష్కరకాలం తర్వాత  ప్రవేశపెట్టింది. సుధాకర రెడ్డిగారి పార్టీ ఇక్కడ ఆ సదరు జంటనూ వ్యతిరేకించింది. అంతర్జాతీయంగా థాచర్‌నీ రీగన్‌నీ సంస్కరణల పేరెత్తినవారందరినీ వ్యతిరేకించింది.

చైనాలో ఆ ‘సంస్కరణ’లను తెచ్చిపెట్టిన డెంగ్ జియావో పింగ్‌ని మాత్రం సుధాకర్‌జీ పొగుడుతున్నారు. బహుశా ‘కమ్యూనిస్టు’ అనే పేరుతో ఏ పని చేసినా సమర్ధించాలన్న ‘‘జ్ఞానమే’’ అందులో ఉన్న తర్కం కావచ్చు. ఇక్కడ ఒక్కమాట. ఈ సంస్కరణల వల్ల చైనాలో సంపద అపారంగా పెరిగింది, నిజమే. మిలియనీర్లు, బిలియనీర్లూ తామరతంపరగా పెరిగారు. అదీ నిజమే. అయితే అదే స్థాయిలో అసమానతలూ పెరిగాయి. పని గంటలు అపారంగా పెరిగాయి.  ఇంతకుముందు లేని నిరుద్యోగ సమస్య మళ్లీ వచ్చి పడింది. అడుగున పేదరికం కూడా అంతులేకుండా పెరిగింది. సామాజిక భద్రత అన్నది క్రమంగా తగ్గిపోతూ ఉంది.

‘‘సోవియట్ ప్రభుత్వం భూమిలేని పేదలకు భూములను పంచింది. బాంకులను పరిశ్రమలని జాతీయం చేసి అనేక విజయాలను సాధించింది.’’ సుధాకర్‌జీ చెప్పారు. ఇంతకీ సోవియట్ ప్రభుత్వం భూముల్ని పంచిందా, లేదా రైతులతో సమష్టి క్షేత్రాలూ ప్రభుత్వ క్షేత్రాలూ నిర్మించిందా? గుర్తు తెచ్చుకోండి. రష్యాలో చైనాలో పరిశ్రమలూ వగైరాలను జాతీయం చేయడానికీ మార్క్సే ప్రేరణ, చైనాలో డెంగ్ జియావో పింగ్ ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా మార్చడానికీ మార్క్సే ప్రేరణ అంటే ఎలా సుధాకర్‌జీ. ఇంత నిలకడ లేని మనిషా మార్క్స్? అందుకేనేమో మార్క్సిజం పిడివాదం కాదనీ అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటుందనీ మార్క్స్ చెప్పాడనీ సుధాకరరెడ్డి గారు శలవిచ్చారు. అంటే దానిలో మారని మౌలిక అంశాలంటూ ఏమీ లేవా సార్. అవేమిటో ఏమైనా గుర్తున్నాయా?

ఒక విద్య ఉంది. ఏమీ చెప్పకుండానే కొన్ని పదాలతో కొన్ని శబ్దాలతో ఘనమైనదేదో చెప్పినట్టు భ్రమ కల్పించే విద్య. అది కమ్యూనిస్టు నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. చూడండి. ‘‘తాను రాసిన కార్మికవర్గ సిద్ధాంతాలను అమలుపరచడానికి ఇంగ్గండులో పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో కార్మిక వర్గ పరిస్థితులను అధ్యయనం చేసి వారి సంఘాలు పెట్టడం ప్రారంభించాడు.... ప్రపంచ కార్మికవర్గానికి వర్గపోరాటాలను సునిశితం చేయాలని దిశా నిర్దేశం చేశాడు, దోపిడీ సిద్ధాంతాన్ని వివరించారు.’’ ఈ వాక్యంలో మార్క్స్ ఏంచేశాడో కనుక్కోండి చూద్దాం.

‘‘దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా బొలీవియా నికరాగువా మరికొన్ని దేశాలు ప్రపంచ బాంకు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ... ఒత్తిడులకు లొంగకుండా తన స్వంత బాంకును నిర్మించుకొన్నాయి’’ అన్నారు రచయిత. అయితే తర్వాత ఏం జరిగిందో రచయితకు తెలుసా? 1998 లో వెనిజులా నాయకుడు చావెజ్ మొదటిసారి బాంకు ప్రతిపాదన చేశాడు. పైన చెప్పిన రెండు సంస్థలూ రుణాలు మంజూరు చేయడానికి అనేక షరతులు పెడుతున్నాయి. రుణం తీసుకొనే దేశం ‘సంస్కరణలు’ అమలుచేయాలి. అంటే ప్రభుత్వ సంస్థలను వరసగా సొంత ఆస్తులుగా మార్చాలి. ఇది ఒక ప్రధానమైన షరతు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి దక్షిణ అమెరికా బ్యాంకు ఒకటి పెట్టాలన్నది ఆలోచన.

2009నాటికి అర్జంటీనా బ్రెజిల్ దేశాలు కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నాయి. చిన్న దేశాల్లో బొలీవియా పెరాగ్వే ఉరుగ్వే కూడా ముందుకొచ్చాయి. ఆ తర్వాత ఇంకొన్ని దేశాలు ఉత్సాహం చూపాయి. కాని విచారకరమైన విషయం ఏమంటే సమావేశాలు చాలా జరిగాయి కాని ఇంతవరకూ బాంక్‌కి డిపాజిట్లు కట్టాల్సిన దేశాలు కట్టనే లేదు. ఇంతవరకూ ఆ బాంకు చేయాల్సిన అసలు పని మొదలే కాలేదు. మూలిగే నక్క మీద తాటి పండు అన్నట్టుగా పోయిన ఏడాది వెనిజులా మీద ఉరుగ్వే అనేక ఆరోపను చేసింది. పైగా బయటికి పోతానని బెదిరించింది.   
 
ఇంకో ఆణిముత్యం చూడండి: ‘ఈ నేపధ్యంలోనే రష్యాతో సహా అనేక తూర్పు యూరపు దేశాల్లో కమ్యూనిస్టులు ముందుకు సాగుతూనే ఉన్నారు’. అక్కడ కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారా? ఈ అభినవ రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి ఎంత కాలమైంది?
ఇంకో మాట చూడండి: ‘‘అమెరికా గ్రంధాలయాల్లో మార్క్సిస్టు గ్రంధాలను ఎంతగా నిషేధించినప్పటికీ’’ ... అంటారు సుధాకర్‌జీ. అమెరికాలో కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపించే మాట నిజమే కాని పుస్తకాలు నిషేధించింది ఎక్కడ? ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన జెఫ్ బేజోస్ నడిపే ఎమెజాన్ లోనే మీరు పెట్టుబడి గ్రంథాన్ని కొనుక్కోవచ్చు. సామ్రాజ్యవాదం చేసిన చేస్తున్న నేరాలనూ ఘోరాలనూ ఎండగట్టడానికి అబద్ధాలు అవసరమా?  

‘తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరికేటటువంటి ఒక నూతన సోషలిస్టు సమాజం ఏర్పడింది’ అన్నారు రచయిత. ఆ వ్యాసంలోనే మరో చోట... ‘సమానమైన పనికి సమానమైన వేతనం కోసం పోరాటం’ గురించి రాశారాయన. సోషలిజం అంటే ఇదేనా? సుధాకర రెడ్డి గారు మార్క్సిజం ఓనమాలు మర్చిపోయినట్టున్నారు. ఇల్లలకగానే పండగ కానట్టే సొంత ఆస్తులను జాతీయం చేయడమే సోషలిజం కాదని మార్క్స్ స్పష్టం చేశాడని సుధాకర్‌జీ కి తెలుసా? కార్మికవర్గ పోరాటం అంతిమ లక్ష్యం న్యాయమైన పనికి న్యాయమైన వేతనం కాదని వారు తేల్చి చెప్పాడనీ వేతన వ్యవస్థని రద్దు చేయడమే లక్ష్యం అన్నారనీ తెలుసా? అంటే ఏమిటి? ఆ వ్యవస్థలో కూలి ఇచ్చే యజమానీ ఉండడు. దాన్ని దేబిరించాల్సిన కూలీ ఉండడు.

అక్కడ పని చేేసవాడే యజమాని. అధికారం పనిచేసేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అటువంటి వ్యవస్థ సోవియట్ యూనియన్‌లో గాని చైనాలో గాని ఇంక ఎక్కడా గాని ఏర్పడలేదు. దాదాపు అన్ని చోట్లా ప్రజల చేతుల్లోకి చేరాల్సిన అధికారాన్ని బ్యూరోక్రాట్లు తన్నుకుపోయారు. అలా ఎందుకు జరిగిందో, సోషలిజం పేరుతో అన్నేళ్లపాటు నడిచిన దేశాల్లో మార్క్సిస్టు మౌలిక సూత్రాలు ఎందుకు అమలుకాలేదో శోధించి తమని తాము సరిదిద్దుకోవాల్సిన ‘అధికార’ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకొన్నది, మార్క్స్‌నా, గానుగెద్దునా అన్నది ప్రశ్న.

ఆర్థిక సంక్షభాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెట్టుబడిదారీ బృందాల్లో దూరం చూడగలిగిన వారంతా మార్క్సుని తలుచుకొంటున్నారు. ఉలిక్కిపడుతున్నారు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడు. అధికార కమ్యూనిస్టు బృందాలు మాత్రం మార్క్స్ విగ్రహాలను పూజిస్తున్నారు. ఆ పూజకు అర్థం లేదు. ఆ విగ్రహంలో ప్రాణం లేదు. అదే విడ్డూరం. అదే విషాదం.

(మే 5న సాక్షి దినపత్రిక సంపాదకపేజీలో వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి “గమ్యం గమనం మార్క్సిజమే” వ్యాసంపై స్పందన)
ఎ. గాంధీ, సంపాదకుడు, పీకాక్ క్లాసిక్స్
మొబైల్ : 91605 20830

మార్క్సిజంపై ఏబీకే ప్రసాద్‌ గారు రాసిన వ్యాపం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి : మార్క్స్‌ ఎందుకు అజేయుడు?!

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top