భువిపై మెరిసిన రత్నం భూపేన్‌

Bhupen Hazarika Participated In Eastern Programs - Sakshi

కొత్త కోణం

‘‘భూమిని చీల్చుకుంటూ నేలంతా పరుచుకొని పారుతున్న నీకు, లక్షలాది ప్రజల హాహాకారాలు వినపడలేదా?  నైతికతా, మానవతా ధ్వంసమైన చోట...  చేష్టలుడిగి చూస్తున్నావా?  నిర్లక్ష్యంగా, నిశ్శబ్దంగా, దారీతెన్నూలేకఎందుకా పరుగు నీకు గంగా’’  ‘‘వేనోళ్ళ ఘోషిస్తోన్న నీ చరితెక్కడ? సామాజిక అశాంతిపట్ల ఎందుకీ మౌనం’’

... అని బ్రహ్మపుత్రానదిని నిలదీసిన కవి, గాయకుడు, సంగీత విజ్ఞానఖనీ, సామాజిక సేనాని వేరెవ్వరో కాదు గాన గంధర్వుడు భూపేన్‌ హజారికా. మిత్రులూ, సన్నిహి తులూ, అభిమానులూ, శ్రేయోభిలాషులూ భూపేన్‌దా అని ప్రేమగా పిలుచుకునే నాటి జనగాననిధీ, నేటి భారత రత్న భూపేన్‌ హజారికా ప్రశ్నలో సామాజిక బాధ్యత ఉంది. నదీనదాలను ప్రశ్నించడమే కాదు ప్రపంచ ప్రజల మనసులను తన గానామృత జలపాతంలో ముంచెత్తిన సంగీత సామ్రాజ్య రారాజు భూపేన్‌ దా. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనతి కాలంలోనే లక్షలాది ప్రజల గుండెల్లో ఒదిగిపోయిన భూపేన్‌ హజారికా జీవితంలో ఏ కోణాన్ని తడిమి చూసినా ప్రజలఘోషే పల్లవై పలుకుతుంది. ఆయనలోని సంగీతం, సామాజిక చైతన్యం అతడిని అరుదైన సంగీతోద్యమ సేనానిగా నిలిపాయి.  

గొప్ప మానవతావాది అయిన భూపేన్‌ హజారికా అస్సాంలోని సదియా గ్రామంలో 1926, సెప్టెంబర్‌ 8వ తేదీన నీలకంఠ హజారికా, శాంతి ప్రియ హజారికాలకు జన్మించారు. హజారికా తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. అస్సాంలో షెడ్యూల్డ్‌ కులాలలో ఒకటైన కాయిబర్త కులానికి చెందినవాడు హజారికా. తండ్రి నీలకంఠ హజారికా ఆ ప్రాంతంలో సామాజిక ఉద్యమాలలో, కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడు. దానితోపాటు భూపేన్‌దా తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశం ఉన్నవారే. ఆయన మేనమామకు కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉంది. భూపేన్‌దా తండ్రి 1929లోనే గౌహతిలోని బరాల్‌ ముఖ్‌ ప్రాంతానికి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి 1935లో తేజ్‌పూర్‌కు వెళ్ళిన తర్వాత అక్కడ భూపేన్‌దా రాజకీయ ఓనమాలు దిద్దారు. ప్రముఖ నాటక రచయిత, కవి, అస్సాం ప్రప్రథమ సినీదర్శకులు జ్యోతిప్రసాద్‌ అగర్వాల్‌ పరిచయంతో పదేళ్ళ వయస్సులోనే 1936లో సెలోనా కంపెనీకి చెందిన అరోరా స్టూడియోలో భూపేన్‌దా పాడిన తొలి పాటను రికార్డు చేశారు. పన్నెండేళ్ళ వయస్సులోనే జ్యోతిప్రసాద్‌ అగర్వాల్‌ నిర్మించిన ‘ఇంద్రమాలతి’ సినిమాలో భూపేన్‌దా గొంతు నుంచి జాలు వారిన రెండు పాటలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. అది మొదలు 2011లో తుదిశ్వాస వీడేవరకూ ఆయన గాత్రమే ఊపిరిగా బతికారు. అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ లాంటి విభిన్నభాషల్లోని వేనవేల పాటల్లోకి ఆయన గొంతు తర్జుమా అయ్యింది. వైవిధ్యాన్ని ఆరాధించే ప్రతి సంగీత ప్రియుడి ఇంటా ఆయన గొంతు ప్రతిధ్వనించింది. పాటే ప్రాణంగా బతికిన అలాంటి గొప్ప సంగీత స్వాప్నికుడిని ఇంటర్వూ్య చేసే మహావకాశం ఒక జర్నలిస్టుగా నాకు దక్కింది.  

1994 నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి ఆయన జ్యూరీ మెంబర్‌గా వచ్చారు. హజారికా బాల్యం, యవ్వనం, జీవితం అంతా కవిత్వం, గాత్రంతో నిండి ఉంటాయి. తల్లిదండ్రులే తనకు తొలి స్ఫూర్తి అంటారు. ఆ తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం నుంచి చాలా నేర్చుకున్నానని స్వయంగా చెపుతారు. బడికెళ్ళి రాగానే ప్రతి రోజూ సాయంకాలం ఇంటి దగ్గర ఉండే లారీ డ్రైవర్లతో కూర్చొని వాళ్ళు పాడే పాటలు, వారి టేప్‌ రికార్డర్లలో పెట్టుకునే పాటలు వింటూ గడపడం భూపేన్‌ దా దినచర్యలో భాగమైంది. భూపేన్‌ దా జీవితంలో మరో ముఖ్యమైన మలుపు బిష్ణురఖాను కలుసుకోవడం. బిష్ణురఖా సోషలిస్టు రాజకీయాలు కలిగిన కవి, గాయకుడు. పేదలు, శ్రామికులు, పీడితుల గురించి బిష్ణురఖా పాడేపాటలు భూపేన్‌ దా సైద్ధాంతిక దృక్పథానికి బాటలు వేశాయి. అదేవిధంగా తనను గాయకుడిగా సినీరంగానికి పరిచయం చేసిన జ్యోతి ప్రసాద్‌ అగర్వాల్‌ నుంచే హజారికాకు మార్క్సిస్టు సిద్ధాంతంతో పరిచయమైంది.  

భూపేన్‌దా తల్లిదండ్రులకు తమ కొడుకు జర్నలిస్టు కావాలని ఉండేది. కానీ ఆయన ప్రపంచం సంగీతమే. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు కలకత్తాలో బీఏ డిగ్రీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాను సాధించారు. చాలా కొద్దికాలం గౌహతీలోని రేడియో కేంద్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్కాలర్‌షిప్‌ రావడంతో జర్నలిజంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి 1949 లో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. ఆయన కొలంబియాలో చదువుతున్న సమయంలో నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమం ఉధృతంగా సాగు తోంది. ఆ ఉద్యమంలో నల్లజాతి గాయకుడు పాల్‌ రాబ్సన్‌ ఒక ధిక్కార స్వరం. భూపేన్‌ హజారికాను పాల్‌ రాబ్సన్‌ సంగీతం, పాటలు అమి తంగా ఆకర్షించాయి. దీంతో నల్లజాతి ప్రజా ఉద్యమంలో హజారికా కూడా భాగమయ్యారు. పాల్‌ రాబ్సన్‌ ప్రదర్శనల మీద అమెరికా పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండేది. చాలాసార్లు పాల్‌రాబ్సన్‌తో పాటు, ప్రదర్శనలను చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా అరెస్టు చేసేవాళ్ళు. అదే సందర్భంలో భూపేన్‌ హజారికా కూడా రెండు సార్లు అరెస్టయ్యారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిట్‌ అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు.

ఆమే స్వయంగా జోక్యం చేసుకొని భూపేన్‌ హజారికాను విడుదల చేయించినట్టు, భూపేన్‌ స్వయంగా నాతో ఇంటర్వూ్యలో చెప్పారు. ఆ తరువాత కూడా ఆయన తన విప్లవ రాజకీయాల నుంచి వెనుదిరగలేదు. భారతదేశంలోనూ అదే స్ఫూర్తిని కొనసాగించారు. 1953వ సంవ త్సరంలో అమెరికా నుంచి భారత దేశానికి తిరిగిరాగానే ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న భారత ప్రజానాట్య మండలి (ఇఫ్టా)తో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నారు. 1955లో గౌహతీలో జరిగిన ఇఫ్టా అఖిల అస్సాం మూడవ మహాసభలకు ఆహ్వన సంఘం కార్యదర్శిగా పనిచేశారు. అస్సాంలో.. ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల పర్వతాలు, అడవులు, నదులు, సముద్రం ఆయన పాటల్లో ప్రతిధ్వనించేవి. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికుల దయనీయ స్థితిని ప్రతిబింబిస్తూ తాను రాసిన ‘‘ఏక్‌ కలి దో పత్తియా’’ అనే పాట ఆయన్ను శ్రామికజనపక్షపాతిగా నిలబెట్టాయి. పల్లకీలు మోసే బోయీలపై రాసిన ‘‘డోల.. హో.. డోల’’ పాట వారి చెమట చుక్కల విలువను ఇనుమడిస్తుంది. ఇలా ఆయన రాసి, పాడిన ప్రతి పాటా జనప్రియమై, ప్రజల నీరాజనాలందుకుంది.  

కవిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినిమా దర్శకుడిగా పదుల సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు. సినిమా రంగంలో అత్యున్నతమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌ బిరుదులను సొంతం చేసుకున్న భూపేన్‌దాకి మర ణానంతరం 2019లో భారత రత్న అవార్డునిచ్చారు. ప్రపంచ ప్రజల మదిలో తనదైన స్థానం సంపాదించుకున్న భూపేన్‌ దా నిగర్వి. 1994లో నేను ఇంటర్వూ్య చేసిన సందర్భంలో ఎ.ఆర్‌.రెహమాన్‌పై మీ అభిప్రాయం ఏమిటని అడిగాను. ఎ.ఆర్‌.రెహమాన్‌ కృషిని ఆయన ప్రశంసిస్తూనే, శాస్త్రీయ సంగీతంతోనే సంతృప్తి పడకుండా, ప్రజల నాలుకల మీద నాట్యమాడే సంగీత ఝరులను ఒడిసిపట్టుకోగలిగితే రెహమాన్‌ మంచి సంగీత దర్శకుడవుతాడని చెప్పారు.
 
భూపేన్‌ హజారికా జీవితంలో మరొక ముఖ్యమైన ఘట్టం ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు, రచయిత కల్పనా లజ్మితో పరిచయం. 1980 ప్రారంభంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచే వరకూ ఇద్దరూ మంచి మిత్రులుగా కొనసాగారు. వీరిద్దరూ 1986లో  ‘ఏక్‌ ఫల్‌’’ అనే చిత్రానికి సంగీత దర్శకత్వం అందించారు. ఈ ఇరువురి కాంబినేషన్‌లో చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సినీ ప్రపంచంలో తమదైన ముద్రవేసారు. కల్పనా లజ్మి, భూపేన్‌ దా కలిసే జీవించారు. కలిసే స్వప్నించారు. ఆ ఇద్దరి కలల కొనసాగింపుగా వచ్చిందే ‘రుడాలి’ సినిమా. అదే భారతదేశ చలన చిత్ర రంగంలో సంచలనం రేపింది. మాధురీ దీక్షిత్‌ నటించిన ‘దామిని’ సినిమా కూడా వేనోళ్ళ కొనియాడబడింది. వీరిద్దరి సహజీవనం మీద ఎన్నో పుకార్లు వచ్చాయి. ఎన్నెన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా కల్పనా లజ్మీ, భూపేన్‌లు ఒకరికోసం ఒకరన్నట్టుగా బతికారు. 

రాజకీయంగా భూపేన్‌ దా నిర్వహించిన పాత్ర మరువలేనిది. 1967–72 మధ్యలో అస్సాం శాసన సభలో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేశారు. అస్సాంతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అనేక ఉద్యమాలతో భూపేన్‌ దాకు సత్సంబంధాలుండేవి. ఈశాన్య రాష్ట్రాలను ఢిల్లీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయనే వాదనను భూపేన్‌ అవకాశం వచ్చినప్పుడల్లా వినిపించారు. సాయుధ తిరుగుబాట్లను ప్రత్యక్షంగా సమ ర్థించకపోయినా, అటువంటి పరిణామాలకు ప్రభుత్వాలదే బాధ్యతని తేల్చి చెప్పిన ధీశాలి. అస్సాంలో అస్సాం గణపరిషత్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తన నిరసన గళాన్ని విడువలేదు. ఆ ప్రభుత్వం కూడా అస్సాం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని బహిరంగంగా చెప్పారు. నవంబర్‌ 5, 2011న కన్నుమూసిన భూపేన్‌దాకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నివాళి అర్పించారు. గౌహతిలో నవంబర్‌ 9వ తేదీన జరిగిన అంత్యక్రియల్లో దాదాపు 5 లక్షల మంది పాల్గొనడం ‘భారతరత్న’ కంటే చాలా ముందు సంగీత సామ్రాజ్యాధిపతికి భారత ప్రజలిచ్చిన ఘనమైన నివాళి.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్‌ : 81063 22077

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top