మాతృభాషలో పరీక్షలే మేలు

Appireddy Harinath Reddy Article On Central  Exams In Regional Language - Sakshi

సందర్భం

జాతీయ స్థాయిలో ఉద్యోగాలకోసం పరీక్షలు దాదాపుగా హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో ఉండటం వలన చాలామంది ప్రాంతీయ భాషలలో చదువుకున్నవారు ఉద్యోగాలలో ఎంపిక కావడం కష్టమైపోతోంది.   అఖిలభారత సర్వీసు వంటి కీలక పరీక్షలలో కూడా ప్రాంతీయ భాషలలో రాసే అవకాశం ఉంది. ఇంగ్లిష్, ప్రాంతీయ భాషల పరిజ్ఞానం అంచనావేయడానికి పదవతరగతి స్థాయిలో ప్రత్యేక పరీక్ష ఉంటుంది. అర్హత కోసమే తప్ప, ఈ మార్కులకు ఉద్యోగం ఎంపికకు ముడిపెట్టరు. ఇతర కేంద్ర ఉద్యోగాలలో చాలా చిన్న ఉద్యోగాలకు సైతం ప్రాంతీయ భాషలలో రాసే అవకాశం లేకుండా ఇన్నాళ్ళు కొనసాగుతూ వస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల నుండి ముఖ్యంగా దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల నుండి కేంద్రం నిర్వహించే పరీక్షలు ప్రాంతీయ భాషలలో కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వాల్ని చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. చాలా కేంద్ర ఉద్యోగ పరీక్షలకు దక్షిణాది వారు దరఖాస్తు కూడా చేసేవారు కాదు. ఉత్తరాది వారి ఆధిపత్యమే కేంద్ర ఉద్యోగాలలో సాగేది. ప్రజలనుండి వస్తున్న విజ్ఞప్తులపై ఇటీవల కేంద్రం స్పందించింది. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకుల పరీక్షలను ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తామని ప్రకటించారు.  

దేశవ్యాప్తంగా కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌లో బ్యాంకులకు సంబంధించిన స్కేల్‌ 1, 2, 3 అధికారులను, ఇతర కింది స్థాయి సిబ్బందిని నియామకం చేస్తారు. ఈ ప్రాంతీయ బ్యాంకుల పరీక్షలను కూడా కేవలం ఇంగ్లిష్, హిందీ భాషలలో నిర్వహించే వారు. ఇప్పటి నుండి తెలుగు, కన్నడ, తమిళం, మళయాళం, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కొంకణి, పంజాబీ, మణిపురి, ఉర్దూ తదితర పదమూడు ప్రాంతీయ భాషలలో కూడా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. వివిధ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

ప్రాథమిక, ఉన్నత స్థాయిలలో మాతృభాషలలో విద్యను అభ్యసించిన వారు తాము చదువుకొన్న భాషలో భావనలు వ్యక్తం చేయడం సౌకర్యంగా ఉంటుంది. చాలా రాష్ట్రాలలో విద్యార్థులు తమ మాతృభాషా మాధ్యమంలోనే విద్య అభ్యసిస్తారు. ఇంగ్లిష్, హిందీ భాషలను కేవలం ఒక అంశంగా మాత్రమే చదువుతారు. తాము పొందిన జ్ఞానం, భావనలు ఇతర భాషలలో అనువదించుకొని, పదజాలాన్ని అవగాహన చేసుకొని పరీక్షలలో పోటి పడి ఉద్యోగం సాధించడం సులువుకాదు. ఈ కారణంగా ఎంతో మంది మాతృభాషలలో వివిధ విషయాలపట్ల పరిజ్ఞానం, అవగాహన ఉండి కూడా అవకాశాలను అందుకోలేకపోయారు.
ఒక ఉద్యోగి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేయవలసిన సందర్భాలలో హిందీ, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం అవసరమే అవుతుంది.

అందుకు ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రాథమిక పరిజ్ఞానం పరిశీలించడానికి ప్రత్యేక  పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగాల ఎంపికలో మొత్తం జ్ఞానం అంతా పరాయి భాషలోనే సామర్థ్యం ఉండాలనుకోవడం అశాస్త్రీయం అవుతుంది.  స్వరాష్ట్రాలలో పని చేసే  కేంద్ర ఉద్యోగులకు హిందీ, ఇంగ్లిష్‌లో సాధారణ పరిజ్ఞానం ఉన్నా సరిపోతుంది. కేంద్రప్రభుత్వం వివిధ శాఖ లలో నిర్వహించే పరీక్షలను ప్రాంతీయ భాషలలో కూడా రాసే విధంగా అవకాశం కల్పించే విషయమై తక్షణం ఒక నిపుణుల కమిటీ నియమించాలి.  రైల్వే, పోస్టల్, రక్షణ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ తది తర ఉద్యోగుల ఎంపికలోను ప్రాంతీయ భాషలలో అవకాశాలు ఉండాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించే నెట్‌  జనరల్‌ స్టడీస్‌ పరీక్ష ఆయా ప్రాంతీయ భాషలలో నిర్వహించాలి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఉద్యోగాలకు పరీక్షలను ఇంగ్లిష్, తెలుగు భాషలో నిర్వహించాలి. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా తెలుగులో అనువాదం చేయ డం వలన పరీక్షలలో నష్టపోయినవారు ఉన్నారు.  

ఇప్పటికే ఉద్యోగంలో ఉంటూ శాఖాపరమైన పదోన్నతులకోసం రాసే పరీక్షలను పూర్తిగా ఇంగ్లి ష్‌లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరీక్షలను అన్ని రాష్ట్రాలలో వారి మాతృభాషలలో నిర్వహిస్తున్నారు. కానీ మనవాళ్లు మాత్రం ఆంగ్లంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పదోతరగతి అర్హతతో ఉద్యోగంలోకి ప్రవేశించిన వారు సైతం శాఖాపరమైన పదోన్నతి పరీక్షలు ఇంగ్లిష్‌లోనే రాయాలనడం అసమంజసమైన విషయం. కష్టపడి తమ మాతృభాషలో జ్ఞానం పొందిన  ఉద్యోగార్థులను, పరాయి భాషల ద్వారా పెత్తనం చేసే కృతక చర్యలతో మానసికంగా బలహీనం చేయడం అంటే వారి అవకాశాలను, హక్కులను భంగం చేయడమే అవుతుంది.

వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, అనంతపురం
మొబైల్‌ : 99639 17187
డా: అప్పిరెడ్డిహరినాథరెడ్డి

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top