కర్తవ్యాన్ని గుర్తించండి కామ్రేడ్స్‌!

AP Vital Article On Elections In Andhra Pradesh - Sakshi

విశ్లేషణ  

నేడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం.. ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన చంద్రబాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటల్తో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం. ఈ కర్తవ్య నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి.

ఇది మన నవ్యాంధ్రప్రదేశ్‌కు, దేశ లోక్‌సభకు ఎన్నికల వాతావరణం! ఎన్నికల ప్రాధాన్యత గురించి మార్క్స్‌ మహనీయుడు ఒక సందర్భంలో ‘సంఖ్యరీత్యా అధికసంఖ్యలో ఉండే ఎన్నో పోరాటాలలో రాటుదేలి చైతన్యవంతమైన శ్రామికవర్గం ఉన్న ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో వయోజన ఓటింగ్‌ ద్వారా సమాజంలో సోషలిజం దిశగా మార్పు రావచ్చు’ అని ఆశించారు. ఆయన సహచరుడు ఎంగెల్స్‌ మాత్రం ఎన్నికలు ప్రజాచైతన్యానికి గీటురాళ్లు మాత్రమే అన్నారు. అందుకే సీపీఎం పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆదర్శ కమ్యూనిస్టు నేత కీ.శే. పుచ్చలపల్లి సుందరయ్య కొటేషన్ల (ఉటంకింపులు) దేముందయ్యా, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ రచనల నుంచి ఎన్నయినా ఇవ్వవచ్చు కానీ, కావలసింది వాటిని మన పరిస్థితికి అన్వయించుకోవడమే అనేవారు.

ఆ విధంగా ప్రస్తుత సమాజాన్ని విశ్లేషించుకుంటే ఇక్కడ నిన్నటి భూస్వాములే నేటి పెద్ద పెట్టుబడిదారులు–ఆ రెండు వ్యవస్థల దుర్లక్షణాలన్నీ నేటి మన దేశ వ్యవస్థలో ఉన్నాయి. ఒకవైపు బడా పెట్టుబడిదారులు, విదేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేసే స్థాయికి పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి చెందినా, బ్యాంకులను, ప్రజాధనాన్నీ కొల్లగొట్టిన, కొల్లగొడుతున్న మాల్యాలు, నీరవ్‌ మోదీలు, సుజనా చౌదరిలు, సీఎం రమేష్‌లతోపాటు పాత సంస్కృతి అవశేషంగా సామాజిక అణచివేతకు ఆలవాలమైన కులవ్యవస్థ కూడా బలంగా ఉంది. ఇఎంఎస్‌ అన్నట్లు మనదేశంలో బానిసవ్యవస్థ కులవ్యవస్థ రూపంలో ఘనీభవించింది. అందుకే పైపై మార్పులు ఎన్ని జరిగినా, దాని ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే దీనికి ఉదాహరణ. సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా?’ అంటూ వారి జన్మ అప్రతిష్టకరమైనదని చెప్పకనే చెప్పారు. ‘మీకు రాజకీయాలెందుకురా, అవి మాకు.. పిచ్చి ముం..ల్లారా’ అంటూ చంద్రబాబు కులానికి చెందిన మరో నేత అంటాడు. పైగా ఆయన ఒక మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చిన ఘనుడు కూడా. ఇక ప్రతిపక్షంలో ఉండి గోడదూకి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరోనేత అయితే ‘ఈ  దళితులు శుభ్రంగా ఉండరు. స్నానాలు చేయరు’ అని ఏవగించుకుంటాడు. ‘ఈ మాదిగ... లకు చదువుపై శ్రద్ధ ఉండదు. వారికి చదువు అబ్బదు’ అని పాలకపార్టీలోని దళితనేత ఒకరు ఎగతాళి చేస్తాడు. గతంలో ఎన్నడూ లేనట్లు దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారి టీలు, బాగా వెనుకబడిన కులవృత్తుల వారి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వారి అస్తిత్వమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్‌ పాలనకు సంబంధించి అన్ని రంగాల్లోనూ చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఆ పార్టీని వీడి ఇతర పార్టీలవైపు ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ వైపు వలస వస్తున్న చంద్రబాబు అనుయాయులే ఈ విషయం స్పష్టంగా ప్రజల ముందు చెప్పడమూ మనం చూస్తున్నాం. ఈ కమ్మ కులం నేతల్లో కూడా కులకంపుతో ఊపిరాడని కొందరు ప్రజాప్రతి నిధులు సైతం ఈ నిజం చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. దురదృష్టమేమిటంటే, ఈ కులవ్యవస్థ అణచివేత, భారతదేశ ప్రత్యేకతలో ఒక ప్రధాన వైరుధ్యంగా భావించి అందుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన కమ్యూనిస్టులు తెలిసో తెలియకో ఆ అంశాన్ని కొన్ని సందర్భాల్లో అసలు భౌతిక వాస్తవికతగా గుర్తించడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఈ వర్ణవ్యవస్థపై పోరాడితే మౌలికమైన వర్గ ఐక్యతే చెదిరిపోతుందని బెదిరిపోతున్నారు. ప్రతి మహాసభలోనూ శ్రామిక వర్గం నుండి వచ్చిన ప్రతినిధులు ఎంతమంది ఉన్నారనేది ఆయా కమిటీల లెక్కల ద్వారా తేల్చుకుం టారు. కానీ పార్టీ ఉన్నత కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, బీసీ, మహిళలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్నే ఉండదు. ఇది గమనించే బీటీ రణదివే విజయవాడలో అప్పట్లో జరిగిన మహాసభలో మనపార్టీ ఏమైనా ఎస్సీ, ఎస్టీయేతర పార్టీనా అని ప్రశ్నించాల్సి వచ్చింది. దీనిపై ఆమధ్య సీపీఎం ఆత్మవిమర్శా పత్రంలో ప్రస్తావించి, ఈ పరిస్థితి ఉమ్మడి ఏపీలో అధికంగా ఉందని చెప్పింది. ఇటీవలి కాలంలో పార్టీలో ఈ అంశంపై తక్కువస్థాయిలోనైనా కాస్త మార్పు వస్తోందనిపిస్తోంది.

ఈ అంశంపై సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ చేస్తున్న కృషి ఒక ఆశాజనకమైన ఉదాహరణ. ఇతర కమ్యూనిస్టు పార్టీలతో పోలిస్తే ఇది సృజనాత్మకమైన సానుకూల ప్రయోగం. వారు బహుజన వామపక్ష సంఘటనను.. సామాజిక అణచివేతకు గురవుతున్నవారు శ్రామికవర్గ దృక్పథం గలవారు, ఇతర మధ్యతరగతి మేధావులతో ఏర్పాటు చేశారు. ఆ సంఘటన ఒంటరిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ అది ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేక పోయింది. అది సాకుగా చూపి వర్గపోరాటమే ఏకైక పోరాటరూపం అన్న నినాదం మాటున తెలంగాణ సీపీఎం ఏర్పర్చిన బీఎల్‌ఎఫ్‌పై విమర్శలు, అవహేళనలు మంద్రస్థాయిలో సాగాయి. కానీ మన దేశంలో భౌతిక వాస్తవికతగా నిలిచి ఉన్న సామాజిక అణచివేతకు ఆలంబనగా ఉండిన వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడకుండా కమ్యూనిస్టులు తమ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం! విభిన్న భాషలు, నాగరికతలు, జీవన పరిస్థితులు, వివిధ జాతులు, విభిన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు గల మన దేశంలో దాదాపు దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల స్వల్పమార్పులు తప్ప సాధారణంగా ఉన్న సామాన్య అంశం ఈ వర్ణ వ్యవస్థే. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటంలో ఈ సామాజిక అణచివేత అంశం కూడా ప్రధానమైందే. అందుకే తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ దీనిపై తీసుకున్న నిర్ణయం, దాని ఆచరణ క్రమం సామాజిక పురోగమనంలో మరో ముందుడుగుగా చెప్పాలి. వారి ప్రయత్నం ఈ రోజు చిన్నదే కావచ్చు కానీ అది పెరిగిపెరిగి దేశ ప్రజానీకానికి ఆశావహంగా రూపొందుతుందని నమ్ముతున్నాను.

ఇక రెండో ప్రధాన అంశం మనదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ. పార్లమెంటరీ మార్గమే మౌలికంగా ప్రజాజీవనాన్ని మార్చేస్తుందని చెప్పలేం. కానీ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, వారు తమ అనుభవం ద్వారా తమకు ఎలాంటి పాలన కావాలో గ్రహింపు కలిగించడంలో ఎన్నికల పాత్రను కాదనలేం. అలాగని చెప్పి ఎక్కువ స్థానాలు, తద్వారా రాష్ట్ర స్థానిక స్థాయిలోనైనా అధికారం పొందడమే కమ్యూనిస్టుల లక్ష్యం కాకూడదు. దేశ ప్రజల జీవన పరిస్థితులు, రాజకీయ చైతన్యం, భౌతిక పరిస్థితులు నిశితంగా పరిశీలించుకుని అవి మరింత మెరుగుపడేందుకో, కాకుంటే మరింత అధ్వానమైనా కాకుండా ఉంచేందుకే కమ్యూనిస్టుల పార్లమెంటరీయేతర పోరాటాలు ఉండాలి కదా! ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కేంద్రంలో ఉన్న పాలన దాని మంచిచెడ్డలు వాటిని ప్రభావితం చేయగల మనశక్తి సామర్థ్యాలు, అన్నీ ఊహాలోక విహారాలు కాకుండా వాస్తవికంగా నిర్దేశించుకోగలగాలి. నేడు ఏపీలో ప్రజలకు ప్రత్యక్ష, తక్షణ ప్రమాదం ప్రజలలో విశ్వసనీయత పూర్తిగా కోల్పోయిన బాబు ప్రభుత్వం నుంచే ఉంది. అవినీతిలో, ఆశ్రిత పక్షపాతంలో, ప్రజలను మాటలతో వంచించడంలో ఆత్మస్తుతి, పరనిందలో బాబు ఆకాశమే హద్దుగా వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు ఆయనకు చరమగీతం పాడాలని ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు.

పైగా చంద్రబాబు స్పీకర్‌ పదవిని కూడా భ్రష్టుపట్టించి కోడెల శివప్రసాద్‌ ద్వారా శాసనసభ సత్సంప్రదాయాలను ఉల్లంఘించి, అసెంబ్లీనే ‘కురుసభ’గా మార్చిన వ్యవహారం కూడా ప్రజలు గమనించిందే. ఇక ఎన్నికల ప్రక్రియనే తల్లకిందులు చేసే రీతిలో ప్రతిపక్షాల ఓట్లను, ఓటర్లను తొలగించి తన అనుకూలుర దొంగ ఓట్లను చేర్పించడం వంటి అక్రమ చర్యలకు సిద్ధపడ్డారు. నిన్నటిదాకా తన ‘షేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ మిషన్‌’ని సాధ్యమైనంతగా పూర్తి చేసుకుని, అందుకు మోదీ సహాయాన్ని స్వీకరించి తీరా ఏపీ ప్రజలు తననూ, మోదీని కూడా రాజకీయ సమాధి చేయడానికి సిద్ధమైనారని గ్రహించి ఏదో విధంగా తన మిషన్‌ సాగించేందుకు బాబు పెనుగెంతువేసి రాహుల్‌గాంధీ సరసన చేరారు. 

ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు, ముందస్తు గృహనిర్బంధాలు, చీటికీమాటికీ పోలీసు దాడులు వంటివి మున్నెన్నడూ ఎరుగని స్థాయిలో బాబు జరిపిస్తుండటం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక యంత్రాంగం ఏదీలేని నేపథ్యంలో అశోక్‌బాబు వంటి చెంచాగిరి చేసే అధికార బృందం, కోరి తెచ్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు వీరి సాయంతో నిస్సిగ్గుగా, ప్రజాస్వామ్య విలువలను పాతరేసే ప్రయత్నాలు జరగవచ్చు కనుక ఈ నామమాత్రపు ప్రజాస్వామ్యం కూడా కృష్ణార్పణం కాకుండా అందరికంటే కమ్యూనిస్టులు తమ అనుభవంతో ఎదుర్కోవడంలో ముందుండాలని వాంఛించడం సహజం. ఇటు రాష్ట్రంలో బాబు టీడీపీ అధికారంలోకి రాకుండా చేయడం అందుకు ప్రజాసమీకరణ, ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కమ్యూనిస్టు పార్టీల పోరాట పటిమ, ప్రజానుకూల ధోరణిని ప్రజానీకం గుర్తించగలుగుతారు కూడా. 

అలాగే ప్రత్యేక హోదాకు మంగళం పాడిన ఎన్డీయే పాలనను ఓడిం చడం కూడా కమ్యూనిస్టుల లక్ష్యం కావాలి. వీటికి దూరంగా ప్రస్తుత పరిస్థితిలో ఆచరణీయ కర్తవ్యం కాని కూటములతో మరోసారి కమ్యూనిస్టులు అప్రతిష్ట కొనితెచ్చుకోరాదు. పై రెండు ప్రధాన కర్తవ్యాల నిర్వహణ పక్కదారి పట్టకుండా పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండాలి. ఈ ప్రధాన పాత్ర నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ అగ్రగామిగా ఉంది. ఆ పార్టీతో కమ్యూనిస్టులకు ఎన్ని వైరుధ్యాలైనా సరే రాజకీయ రంగంలో ఉండవచ్చు, ఉంటాయి కూడా. కానీ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామిక పాలనను ఖూనీ చేసిన చంద్రబాబు పాలనను, కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఓడించటమే ప్రస్తుతం వామపక్షాలు పరిష్కరించాల్సిన కీలక వైరుధ్యం.


డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top