
హద్దులు దాటడానికి రెడీ!
రెజీనా అంటే గ్లామర్. రెజీనా అంటే ఎగ్జయిట్‌మెంట్. రెజీనా అంటే ఎనర్జీ. రెజీనా అంటే బోల్డ్‌నెస్.
ఇంటర్వ్యూ
రెజీనా అంటే గ్లామర్. రెజీనా అంటే ఎగ్జయిట్‌మెంట్. రెజీనా అంటే ఎనర్జీ. రెజీనా అంటే బోల్డ్‌నెస్.
‘నాలో భిన్న కోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను’ అంటోన్న ఈ అమ్మడు చెబుతోన్న మరిన్ని కబుర్లు చదివి ఎంజాయ్ చేయండి!
* మీ బ్యాగ్రౌండ్..?
నాది తమిళనాడు, నా మాతృభాష తమిళం. నిజానికి నన్ను ఎవరైనా ఏ ప్రాంతం వారు అని అడిగితే చెప్పడానికి కన్‌ఫ్యూజ్ అవుతాను. ఎందుకంటే అమ్మది కర్ణాటక, నాన్న నార్త్ ఇండియన్, నానమ్మ గోవాకి చెందిన ఆంగ్లో ఇండియన్, తాతయ్య అయ్యంగార్ ఫ్యామిలీలో పుట్టి క్రిస్టియన్‌గా కన్వర్ట్ అయ్యారు. దాంతో నాది ఏ ప్రాంతం, ఏ భాష అంటే ఠక్కున చెప్పలేక ఇబ్బంది పడుతుంటా.
* కానీ తెలుగు బాగా మాట్లాడుతున్నారే?
ఆ క్రెడిట్ మారుతి గారిదని చెప్పాలి. ‘ఎస్మెమ్మెస్’ చిత్రం చేస్తున్నప్పుడు ఆయన నాకు డైలాగ్ డెలివరీ విషయంలో చాలా సహాయం చేశారు. ఏది ఎలా పలకాలో, ఇన్‌వాల్వ్ అయ్యి ఎక్స్‌ప్రెషన్‌తో డైలాగ్ ఎలా చెప్పాలో నేర్పించారు. అప్పట్నుంచీ అదే ఫాలో అయ్యాను. అందుకే చాలా త్వరగా తెలుగు వచ్చేసింది నాకు.
* అసలు తెర మీదికి ఎలా...?
స్కూల్లో ఉన్నప్పుడే దూరదర్శన్‌లో ఒక పిల్లల ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా చేశాను. మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. చాలా షార్‌ట ఫిల్మ్స్ కూడా చేశాను. తర్వాత ‘కండ నాళ్ ముదల్’ అనే తమిళ చిత్రంలో నటించే చాన్స్ వచ్చింది. అప్పటికి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను.
* అంత చిన్న వయసులో నటన... కష్టమనిపించలేదా?
నేను చాలా యాక్టివ్. ఓపక్క చదువు, మరోపక్క భరతనాట్యం, మోడలింగ్, టీవీ షోలు, సినిమాలు... ఎప్పుడూ బిజీ బిజీ. అమ్మ అనేది... ‘నువ్వు మన ఫ్యామిలీలో మొదటి యాక్టర్‌వి. కానీ డిగ్రీ లేని మొదటి వ్యక్తివి కాకూడదు’ అని. దాంతో చదువు మీదా శ్రద్ధ చూపేదాన్ని.
* తమిళంతో మొదలెట్టారు. కన్నడ, మలయాళ, తెలుగు భాషల్లోనూ చేస్తున్నారు. మీ ప్రయారిటీ ఏది?
నా ప్రయారిటీ సినిమా, భాష కాదు. తమిళ సినిమా నన్ను నటిని చేసింది. తెలుగు సినిమా నన్ను ఇంతదాన్ని చేసింది. మిగతా భాషల చిత్రాలూ నన్ను నిలబెడుతున్నాయి. అలాంటప్పుడు ఒక్క దానికే ప్రాధా న్యత ఎలా ఇస్తాను!
* మిమ్మల్ని ఇలియానాతో పోలుస్తుంటారు. అప్పుడేమనిపిస్తుంది?
తను చాలా అందంగా ఉంటుంది. మంచి నటిగా నిరూపించు కుంది. తనతో పోల్చడం కాంప్లిమెంటేగా!
* రొమాంటిక్ సీన్లు, లిప్‌లాక్స్ ఓకేనా?
సన్నివేశం డిమాండ్ చేసిందని ‘పిల్లా నువ్వు లేని జీవితం’లో లిప్‌లాక్ చేశాను. భవిష్యత్తులో లిప్‌లాకుల పరంగా ట్రెండ్ సృష్టిస్తానేమో ఎవరికి తెలుసు! నేను ఆర్టిస్టుని. నాలో భిన్నకోణాలను ఆవిష్కరించే అవకాశం వచ్చినప్పుడు హద్దులు దాటడానికీ వెనుకాడను.
* శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నారు... మీరు మొదట్నుంచీ వెజిటేరియనా?
లేదు. చికెన్ నా ఫేవరేట్. మా అమ్మ చేసే రోస్టెడ్ బీఫ్‌ని కూడా ఇష్టంగా తినే దాన్ని. షాపుకెళ్లి మాంసం కొనుక్కొచ్చే దాన్ని కూడా. కానీ ఓ రోజు ‘పెటా’ వాళ్లు రాసిన ఓ ఆర్టికల్ చదివి ఏడుపొచ్చేసింది. వెంటనే అమ్మ దగ్గరికెళ్లి... ‘నేను వెజిటేరి యన్‌గా మారుతున్నాను’ అన్నాను. అంతే... ఆ తర్వాత నాన్‌వెజ్ ముట్టలేదు.
* మరి ఇప్పుడు మీ ఫేవరేట్ పుడ్...?
పన్నీర్ ఐటెమ్స్ ఇష్టంగా తింటాను. కాఫీ, చాకొలెట్స్ చాలా చాలా ఇష్టం.
* ఫ్రీ టైమ్‌లో ఏం చేస్తుంటారు?
సైక్లింగ్, వాటర్ ర్యాఫ్టింగ్, అవుట్‌డోర్ టూర్స్ వెళ్లడం, కొత్త స్నేహాలు చేసుకో వడం ఇష్టం. అలాగే రొమాంటిక్ నవలలంటే చాలా ఇష్టం. కొత్త రచయితలు రాసేవీ వదలను. ఇప్పటికి ఓ మూడొందలైనా చదివి ఉంటాను.
* మీరు చాలా రొమాంటిక్ అన్నమాట... మరి ఎవరినైనా?
లేదు. నా లైఫ్‌లో ఎవ్వరూ లేరు. ఉన్నారని ఎవరైనా చెప్పినా నమ్మకండి. కళ్లతో చూసినదాన్ని తప్ప, చెవులతో విన్నదాన్ని ఎప్పుడూ నమ్మకూడదు.
* కానీ ఫాలోయింగ్ ఎక్కువే ఉండి ఉంటుందిగా..!
ఉంది. కానీ ఎవరూ హద్దు దాటరు. నేను చాలా కాన్ఫిడెంట్, డేరింగ్. నా సంగతి తెలిస్తే ఎవ్వరూ నా జోలికి రారు.