ఒక ప్రేమ ఒక పగ

ఒక ప్రేమ ఒక పగ - Sakshi


జూలై 30, 2011... ఉదయం ఆరున్నర దాటుతోంది.

సిడ్నీలోని సీబీడీ అపార్ట్‌మెంట్ ఆవరణ అంతా గందరగోళంగా ఉంది.

‘‘తప్పుకోండి... తప్పుకోండి... ఏం జరిగింది?’’... గుమిగూడిన జనాన్ని తోసుకుంటూ ముందుకు వచ్చాడో వ్యక్తి. నేలమీద ఉన్న రక్తపు మరకలు, వాటి చుట్టూ ఉన్న చాక్‌పీస్ మార్కులు, వాటిని పరిశీలిస్తున్న పోలీసుల్ని చూస్తూనే విస్తుపోయాడు. ‘‘ఏం జరిగింది?’’ అన్నాడు ఆతృతగా.

‘‘ఫ్లాట్ నంబర్ 1503లోని అమ్మాయి పై నుంచి పడిపోయింది’’

అది వింటూనే ‘లీసా’ అంటూ గావుకేక పెట్టాడా వ్యక్తి. పరిశోధనలో మునిగివున్న సార్జెంట్ కూపర్ వెంటనే ఆ అరుపు వచ్చినవైపు చూశాడు.

 ఖరీదైన జీన్స్, టీషర్‌‌ట వేసుకుని పాష్‌గా ఉన్నాడా వ్యక్తి. జరిగినదాన్ని నమ్మలేను అన్నట్టుగా అతడి కళ్లు విప్పారి ఉండిపోయాయి. పొంగుకొస్తున్న దుఃఖంతో పెదవులు అదురుతున్నాయి. క్షణంలో ముఖం కందిపోయింది. కన్నుల గుండా అశ్రుధారలు పొంగుకొస్తున్నాయి.

 

మెల్లగా ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు కూపర్. ‘‘ఆ అమ్మాయి మీకు తెలుసా?’’ అన్నాడు అతడి ముఖంలోకే చూస్తూ.

 ‘‘తెలుసు సార్. తను నాకు కాబోయే భార్య... లీసా ఆర్నమ్’’... బావురున్నాడు.

 ‘‘మీరు ఫేమస్ వ్యాపారి సైమన్ గిటానీ కదా!’’

 అవునన్నట్టు తలూపాడు. ‘‘తనెక్కడుంది సార్... ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా?’’

 అతడి ఆతృత చూసి జాలేసింది కూపర్‌కి. ‘‘సారీ మిస్టర్ గిటానీ... షి ఈజ్ నో మోర్. పదిహేనో అంతస్తు నుంచి పడటం వల్ల వెంటనే చనిపోయింది.’’

 ‘‘నో... లీసా’’... వెక్కి వెక్కి ఏడవసాగాడు. ‘‘బాధపడకండి. ధైర్యంగా ఉండండి’’ అని భుజం తట్టాడు కూపర్. అంతలో సబార్డినేట్ వచ్చి... ‘‘సర్... అపార్ట్‌మెంట్ చూడాలన్నారు కదా’’ అన్నాడు. అవునన్నట్టు తలాడించి... ‘‘మిస్టర్ గిటానీ... మీరూ రండి’’ అన్నాడు. సరేనన్నట్టు తలూపి వారి వెంట నడిచాడు సైమన్ గిటానీ.

    

వాళ్లు వెళ్లేసరికి 1503వ ఫ్లాట్‌లో ల్యాండ్ ఫోన్ రింగవుతోంది. కూపర్ ఫోన్ తీసి హలో అనేలోపే అవతలి గొంతు కంగారుగా పలికింది...

 ‘‘లీసా... ఎలా ఉన్నావమ్మా?’’

 కూపర్ ‘‘హలో’’ అన్నాడు.

 ఒక్క క్షణం అవతలి నుంచి శబ్దం రాలేదు. ఆ తర్వాత ఆమె అడిగింది.. ‘‘ఎవరు మీరు? లీసా ఎక్కడ?’’

 ‘‘మీరెవరు?’’

 ‘‘లీసా వాళ్ల మమ్మీని.’’

 ‘‘సారీ మేడమ్. మీ అమ్మాయి లీసా... ఆత్మహత్య చేసుకుంది.’’

 ‘‘వ్వా...ట్’’... అరించిందామె. ‘‘లేదు. నా బంగారుతల్లి నన్ను వదిలి వెళ్లిపోదు. మీరు అబద్ధం చెబుతున్నారు. పిలవండి... నా లీసాని పిలవండి’’... పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ ఏడుస్తోంది.

 

‘‘కంట్రోల్ యువర్‌సెల్ఫ్ మేడమ్. నేను చెప్పేది నిజమే. తెల్లవారు జామున మీ అమ్మాయి పదిహేనో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్‌ని.’’

 ‘‘లేదు. తను ఆత్మహత్య చేసుకోదు. అంత పిరికిది కాదు తను. నిన్ననే నాతో మాట్లాడింది. నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా అంది. ఇంతలోనే ఎందుకు చనిపోతుంది! వాడే... వాడే తనని చంపేసి ఉంటాడు. వాణ్ని నేను వదలను.’’

 కూపర్ భృకుటి ముడివడింది. ‘‘ఎవరి గురించి అంటున్నారు?’’

 ‘‘ఇంకెవరు? వాడే... ఆ సైమన్... నా కూతురి జీవితాన్ని నరకం చేసేశాడు. వాడ్ని వదిలించుకుని వచ్చేస్తానని నిన్ననే నాతో చెప్పింది లీసా. కానీ ఇంతలోనే...’’ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మరుక్షణంలో ఫోన్ కట్ అయ్యింది. నిట్టూర్చాడు కూపర్. రిసీవర్‌ని క్రెడిల్ చేసి వెనక్కి తిరిగాడు. ‘‘మిస్టర్ సైమన్ గిటానీ... యు ఆర్ అండర్ అరెస్ట్’’ అంటూ అతడి చేతికి బేడీలు వేశాడు.

    

‘‘మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సర్. నేనెందుకు లీసాని చంపుతాను? తను నా ప్రాణం. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాన్నాళ్లుగా కలిసేవుంటున్నాం.’’

 చురుక్కున చూశాడు కూపర్. ‘‘కలిసే ఉంటున్నారా? మరి తను చనిపోయిన రోజు నువ్వు ఫ్లాట్‌లో ఎందుకు లేవు?’’

 గతుక్కుమన్నాడు సైమన్. బిత్తర చూపులు చూశాడు. తర్వాత తేరుకుని అన్నాడు. ‘‘నేను పనుండి ఆ రాత్రి ఇంటికి రాలేదు సర్. ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది చెప్పండి!’’

 ‘‘తెలుసుకోకుండా నువ్వు ఉండలేవు కదా మిస్టర్ గిటానీ... ఆ అపార్ట్‌మెంట్‌లోకి చీమ వచ్చినా నీకు తెలిసిపోతుంది.’’

 ‘‘ఏమంటున్నారు సర్?’’

 

‘‘చాలు ఇక నటించకు’’... కూపర్ అరుపుతో ఉలిక్కిపడ్డాడు సైమన్.

 ‘‘అపార్ట్‌మెంట్స్‌లో బయటి నుంచి ఎవరు వచ్చినా తెలియడానికి సీసీ కెమెరా పెడతారు. ఒకటి రోడ్డు వైపు... ఒకటి అపార్ట్‌మెంట్ వైపు. మీ అపార్ట్‌మెంట్‌లోనూ అలానే ఉన్నాయి. అయితే అదేంటోగానీ... నీ ఫ్లాటు దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకటీ రెండూ కాదు... మూడు. మరీ విచిత్రం ఏమిటంటే... ఇక ఏ ఫ్లాటు దగ్గరా ఒక్క కెమెరా కూడా లేదు. ఎందుకంటావ్?’’

 మాట్లాడలేదు సైమన్.  లీసా అంటే తనకెంతో ఇష్టమని, ఆమెనెంతో ప్రేమించానని పోలీసులు, న్యాయస్థానం ముందు మొసలి కన్నీళ్లు కార్చాడు సైమన్ గిటానీ. అయితే అతడికి లీసా మీద ప్రేమ ఏమాత్రం ఉందో కొన్నాళ్లకే తేలిపోయింది. కేసు నడుస్తుండగానే రేచెల్ లూయిస్ అనే మరో అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఆమెతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. చివరికి కోర్టుకి కూడా ఆమెను తీసుకునే వచ్చేవాడు. తన ఐశ్వర్యం, పలుకుబడితో కేసు నుంచి బయటపడతాననుకున్న సైమన్ నమ్మకాన్ని న్యాయస్థానం పటాపంచలు చేసింది. అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. ప్రేమను పగతో కాలరాసిన అతడికి తగిన శాస్తి జరిగింది! ‘‘ఏం మాట్లాడవ్. నీ గుట్టు రట్టయ్యిందనా? ఆ మూడు కెమెరాలూ నువ్వేంటో చెప్పాయి మిస్టర్ గిటానీ. ఇక నిన్నెవరూ కాపాడలేరు’’ అంటూ వెళ్లిపోతోన్న కూపర్ వైపు అయోమయంగా చూస్తూండిపోయాడు సైమన్ గిటానీ.

 అతడు ఊహించలేదు... తాను పెట్టిన కెమెరాలే తన నిజ స్వరూపాన్ని బయటపెడతాయని. అందుకే షాక్ తిన్నాడు. తనని తాను తిట్టుకున్నాడు. కానీ నిజాన్ని మాత్రం తనంతట తాను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాడు. కేసు నడిచిన మూడేళ్లూ అలానే వాదించాడు. తాను అమాయకుడినని అన్నాడు. లీసాని ప్రాణంగా ప్రేమించానన్నాడు. ఆమె ఎందుకు చనిపోయిందో తనకు తెలియదన్నాడు. కోటీశ్వరుడైన వ్యాపారి కాబట్టి తనను తాను కాపాడుకోగలనన్న నమ్మకంతో అడ్డంగా వాదించాడు.

 

అయితే నిజం ముందు డబ్బు ఓడిపోయింది. న్యాయం ముందు అతడి పలుకుబడి తలదించుకుంది. లీసా ఎంత మంచిదో తెలిసిన కొందరు ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఆమెను సైమన్ ఎంతగా హింసించాడో కోర్టు ముందు వెల్లడించారు.

 అమాయకురాలైన లీసాకి అనుకోకుండా సైమన్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకు దారి తీసింది. అందుకు సైమన్ కూడా ఒప్పుకున్నాడు. అయితే పెళ్లికి ముందు కొన్నాళ్లు కలిసుందామన్నాడు. సీబీడీ అపార్ట్‌మెంట్‌లోని ఖరీదైన 1503 ఫ్లాట్‌ను తమ ప్రేమ మందిరంగా మార్చేశాడు. తన ప్రేమతో లీసాని ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ అతడు తన నిజమైన రూపాన్ని ఎక్కువకాలం దాచి పెట్టలేకపోయాడు. లీసాని తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని ఆరాటపడేవాడు. ఆమె ఎవరితో మాట్లాడకూడదు. ఎవరినీ కలవకూడదు. ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే తిట్టేవాడు. జిమ్‌కి వెళ్తానంటే కాళ్లు విరగ్గొడతాననేవాడు. ఆమెకంటూ ప్రత్యేక ప్రపంచమనేది లేకుండా చేశాడు. నాలుగ్గోడల మధ్య బందీని చేసేశాడు.

కుమిలిపోయింది లీసా. అతడి కంబంధ హస్తాల నుంచి తప్పించుకోవాలని ఆరాటపడింది. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక, సైమన్‌కి తెలియకుండా ఓ డాక్టర్‌ని ఇంటికి పిలిపించుకుని రహ స్యంగా చికిత్స తీసుకునేది. జిమ్ ట్రెయినర్‌ని కూడా ఇంటికే రమ్మనేది. కానీ అది సైమన్‌కి తెలిసిపోవడంతో వాళ్లకు ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చాడు. మళ్లీ వస్తే మర్యాదగా ఉండదన్నాడు. దాంతో అల్లాడిపోయింది లీసా. అతడి పైశాచిక ప్రేమను భరించడం తన వల్ల కాదనిపించింది. ఇక అతడికి దూరంగా వెళ్లిపోవాలనుకుంది. ఆమె ఆలోచనను పసిగట్టి పగబట్టాడు సైమన్. ఏం జరిగినా సరే, ఆమెను వెళ్లనివ్వకూడదనుకున్నాడు. అతడి ఆలోచనలను తెలుసుకోలేకపోయింది లీసా. తల్లికి ఫోన్ చేసి, ఎలాగైనా అతడిని వదిలించుకుని వచ్చేస్తానని చెప్పింది. ఆ రోజు రాత్రి గడవక ముందే సైమన్ చేతిలో హత్యకు గురయ్యింది.

 

పదిహేనో అంతస్తు నుంచి క్రూరంగా లీసాని తోసి చంపేశాడు సైమన్. తెల్లవారుజామున... ఆమె కంగారుగా ఫ్లాట్‌లోంచి బయటకు పరుగెత్తడం, పారిపోవాలని ప్రయత్నించడం, అతడు ఆమె నోరు మూసి బాల్కనీలోని రెయిలింగ్ దగ్గరకు లాక్కెళ్లడం ఒక కెమెరాలో రికార్డయ్యింది. ఆమెను అక్కడ్నుంచి తోసేయడం మసకమసకగా కనిపించింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తయారయ్యి, బయటకు వెళ్లిపోవడం మరో కెమెరాలో రికార్డయ్యింది. వాటిని చూసిన ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయ స్థానం సైమన్‌కి ఇరవయ్యారేళ్ల కఠిన కారా గార శిక్ష విధించింది. పద్దెనిమిదేళ్ల వరకూ ఏ కోర్టూ అతడికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది.

 

తీర్పు వెలువడగానే లీసాకి న్యాయం జరిగిందంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అది నిజమా? లీసాకి న్యాయం జరిగిందా? అతడిని ప్రాణంగా ప్రేమించింది. జీవితమంతా అతడి ప్రేమలో మునిగి తేలాలనుకుంది. అయితే అతడి ప్రేమ పాశవికమని, అతడి కౌగిలి సర్ప పరిష్వంగమని తెలిసి తప్పుకోవాలనుకుంది. అతడికి దగ్గరవడం ఆమె తప్పు కాదు. దూరమవ్వాలనుకోవడమూ తప్పు కాదు. ప్రేమను మాత్రమే ఆశించిన ఆ అమాయకురాలిని దారుణంగా పొట్టనబెట్టుకున్నాడు సైమన్. తప్పు చేసింది అతను. మరి ఆమెకెందుకు శిక్ష పడాలి? ఆమె ఎందుకు ప్రాణం పోగొట్టుకోవాలి? నూరేళ్లు బతకాల్సిన ఆమె, ముప్ఫయ్యేళ్లకే మృత్యు ఒడికి ఎందుకు చేరాలి? చెప్పండి... లీసాకి న్యాయం జరిగిందా?!!

 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top