తోక చుక్క

కొత్త కథలోళ్లు

ఆటో దిగి ఎదురుగా హాస్పిటల్‌ వైపు చూశాను. పల్లెటూర్లో ఇంత హాస్పిటల్‌ ఊహించడం కష్టమే. మూడు అంతస్తుల్లో బాగా కట్టారు. లోపల రిసిప్షన్‌. పక్కనే ఓ.పి పేషంట్స్‌ కోసం కొన్ని కుర్చీల వరుసలు. మనుషులు పెద్దగా లేరు. నిజంగా ఇది మంచి హాస్పిటలేనా? లేకుంటే డాక్టర్‌ ఇక్కడకు ఎలా రికమండ్‌ చేస్తుంది? అసలు మామగారు దీని బిల్‌ కట్టగలరా? మనసులో ఏదో దిగులు! భయం! లోపల ఏదో కుంగుబాటు. చటుక్కున కూర్చున్నాను. పెళ్లయిన పదేళ్ల తరువాత ఇంటికి వస్తున్న చిన్నారి సంతానం. ఇలా ఇంత టెన్షన్‌కు గురిచేస్తుందనుకోలేదు.పెళ్లయి ఒక్కో ఏడాది గడుస్తూ ఉండేకొద్దీ మొదలయ్యాయి ఆరాలు! సంతానం లేదనగానే బోలెడు సలహాలు, డాక్టర్‌ల చిరునామాలు. తిరుగుడే తిరుగుడు. చివరికి నాన్న కూడా ‘అసలు నువ్వు సంసారం చేస్తున్నావురా?’ అనగానే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీని పరిస్థితి. చేయని తప్పుకి సమాజంలో శిక్ష అనుభవిస్తున్న మాకు దేవుడు ఇస్తున్న వరం ఇది. ఆ చిట్టి తల్లికి ఏమైనా అయితే!! ఊహించుకోవడానికే భయమేసింది.  అవునూ.. మహితకి ఎలా ఉందో! ఎప్పుడూ పుట్టబోయే బిడ్డ గురించే ఆలోచన. ఇంత బాధ లోపల పడుతూ ఉంటుంది. తన ప్రాణం కదా నిజానికి ముఖ్యమైనది. 

ఛ! ఆ ఇన్‌స్పెక్షన్‌ లేకుంటే ఇప్పుడు భార్యను వదిలి వెళ్లి ఉండేవాడు కాదు. అయినా ఇలా వెంటనే కాంప్లికేటెడ్‌ అవుతుందని ఎవరైనా అనుకున్నారా! ఇంకా డెలివరీకి రోజులు ఉన్నాయి కదా.తల్లి, బిడ్డ ఎలా ఉంటారో! రెండు కొండలను గుండెలపై అదుముతున్నంత టెన్షన్‌! ముందు రిసెప్షన్‌లో అడిగి ఆలస్యం చేయకుండా మహిత దగ్గరకు వెళ్ళాలి. కుర్చీ నుండి లేస్తూ ఎదురుగా గోడపై ఫోటో చూశాను. ఫోటో కింద డాక్టర్‌ దివ్య అంజలి. పక్కన డిగ్రీలు. ఏదో చల్లదనం ఆ నవ్వులో. బాధ తగ్గిపోయినట్లు అనిపించింది. ఇంత పెద్ద హాస్పిటల్‌కి ఈమె ఓనర్‌. చిన్న వయసులాగే ఉంది. ఇంత హాస్పిటల్‌ అంటే చాలా ఆస్తి ఉండి ఉంటుంది. అయినా బాగా సంపాదిస్తూ ఉంటారు. లేకుంటే ఇంత హాస్పిటల్‌ ఇంత ఎక్విప్మెంట్‌తో నడపడం సాధ్యం కాదు.ఉన్నట్లుండి ఆలోచన, ఇంత ఫీజ్‌ మావయ్య మాత్రం ఎలా కడతాడు? పోనీ నా ఇల్లయినా అమ్మేస్తాను. మహిత కంటే, బేబీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. దూరంగా లోపల నుండి మావయ్య కనిపించాడు. ఒక్క పరుగున చేరాడు. మాట్లాడుతూ ఉంటే వారించాను. ‘ఇక్కడే ఉండండి.రిసిప్షన్‌లో ఒక సంతకం చేసి వస్తాను.’ అంటూ లేచి కిటికీ లోపల నుండి బయటకు చూశా. దూరంగా గ్యారేజ్‌లో రెండు చక్కటి కార్లు. కార్ల గురించి తెలీకపోయినా ఆకర్షిస్తూ ఉన్నాయి. అలాగే చూస్తూ ఉంటే, ‘మేడమ్‌కి కార్లంటే చాలా ఇష్టం. ఏ కొత్తవి వచ్చినా పాతవి మార్చేస్తారు,’ మాటలు వినబడి పక్కకు చూశా. నవ్వుతూ చెప్తోంది సిస్టర్‌.  ఇక్కడ అందరిలోనూ ఏదో ప్రత్యేకత!

‘మరి మేడమ్‌ హజ్బెండ్‌?’ ఫోటోలో చూసిన శ్రీమతి విశేషణాన్ని గుర్తుచేసుకుంటూ అడిగా. ‘లేడు,’ సమాధానం ఇందాకటంత సున్నితంగా లేదు. ‘చనిపోయారా?’‘కాదు.’ ఇక మాట్లాడటం ఇష్టం లేనట్లు వెళ్ళిపోయింది. ‘ఈవిడే వదిలేసిందిలే!’ వెనక్కి చూస్తే ఒక పెద్దావిడ. మాటలు కొనసాగించింది. ‘ఈవిడే వదిలేసింది. ఈమె స్వేచ్ఛకి అడ్డుగా ఉంటాడని. ఈవిడ ఇష్టం వచ్చినట్టు ఇష్టమయిన వారితో టూర్‌లు తిరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి గోవా, ఒక్కోసారి హృషికేష్,ఎక్కడికిబడితే అక్కడికి. ఎవరితో పోతుందో! ఎందుకు పోతుందో! అడిగేవారు ఎవరు? హాస్పిటల్‌కి కూడా ఇష్టమొచ్చినట్టు వస్తుంది. కేస్‌ కష్టం అయితేనే వస్తుంది. మొగుడి పెత్తనం లేకుంటే ఆడది ఇలాగే ఉంటుంది. ఏం చేస్తాం.. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయని డాక్టర్స్‌ ఇక్కడికి పంపుతారు కేసులు.’ నిజమే మేం కూడా అలాగే వచ్చాం. ఆవిడ చెప్పిన చెత్త విషయాలతో డాక్టర్‌ మీద గౌరవం పోయింది. ఇక్కడ బాగా చూస్తారు అన్న మాట ధైర్యం ఇచ్చింది. ఇలాంటి హాస్పిటల్‌లో మహిత, పాప ఉండకూడదు.పుట్టగానే తీసుకెళ్లిపోవాలి. ఇటుగా వస్తున్న మావయ్యకు ఎదురెళ్లా. ‘మావయ్యా! ఫీజ్‌ గురించి బాధపడకండి. నా ఇల్లు అమ్మేస్తాను.’ అన్నా. నవ్వాడు మావయ్య. ‘అవసరం లేదులేండి అల్లుడుగారు.. ఇక్కడ జీవనదానం పథకం ఉంది. దానిలో మన పేరు వ్రాసారు.’ నా మొహంలో ప్రశ్నార్థకం చూసి, ‘ఎవరైనా డబ్బు ఉన్నవారికి ఇక్కడ  పిల్లలు పుడితే వారు ఇంకో ఇద్దరు లేదా ముగ్గురు శిశువుల జననానికి డొనేషన్‌ ఇస్తారు. మన ఫీజ్‌ అందులో మినహాయించు కుంటున్నారు. సంతకం పెట్టేసాను. అమ్మాయిని ఆపరేషన్‌కి తీసుకెళ్తారు పదండి.’ అన్నాడు. పరుగులాంటి నడకతో మావయ్య వెనుకే వెళ్లాను. 

థియేటర్‌లోకి వెళుతూ మహిత నా వేపు చూసింది. తల చిన్నగా ఊపింది ‘బాగున్నాను’ అన్నట్లు. సిస్టర్‌ తెచ్చిన షీట్‌లో ఆపరేషన్‌కి అంగీకారం తెలుపుతూ సంతకం పెట్టాను. కొన్ని నిముషాలు గడిచాయో లేదో సిస్టర్స్‌ కంగారుపడుతూ బయటకు వచ్చి హెడ్‌తో ఏదో చెబుతున్నారు. ఆమె తలూపుతూ ఆలోచిస్తోంది. భయంగా ‘ఏమైంది?’ అని అడిగాను. ఏమీ చెప్పడం లేదు ఎవ్వరూ. ‘లేదు. పెద్ద డాక్టర్‌ రావాల్సి వచ్చేట్లు ఉంది. ఇది తనకు రిలాక్సింగ్‌ టైమ్‌.’ ఆలోచిస్తూ అంది. డాక్టర్స్‌కు రిలాక్స్‌ ఏమిటి? అసలు ఆమె మనిషేనా? కోపమొచ్చింది.‘బ్లడ్‌ ఎన్ని పాకెట్స్‌ ఉన్నాయి?’ అన్న మాటకు ఉలిక్కిపడి వెనక్కి చూశామంతా. వెనుక పెద్ద డాక్టర్‌! దివ్య అంజలి. ప్రసన్నంగా ఉంది. ఇంత టెన్షన్‌లో ఆమె అలా ఉండటం నాకు విసుగనిపించింది! ఎందుకు టెన్షన్‌ పడదు ఈవిడ! మనుషుల ప్రాణాలంటే చులకన కాబోలు!లోపలికి వెళుతూ.. ‘ఇంకో బ్లడ్‌ పాకెట్‌ రెడీ చేయండి,’ అనేసి వెళ్ళిపోయింది.‘దొరికిందా?’ అడిగాను లోపలికి వెళుతున్న సిస్టర్‌ని. ‘లేదు. మీ ఆవిడ గ్రూప్‌ రేర్‌. ఉన్నవి సరిపోతే ఫర్వాలేదు. లేకుంటే ఏం చేస్తారో మేడమ్‌..’ అంటూ వెళ్ళిపోయింది. 

థియేటర్‌ దగ్గర హడావుడి. లోపలికి పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు. ఒకటే హడావుడి. ఎవరికి ప్రమాదం? పెద్ద ప్రాణానికా? చిన్న ప్రాణానికా? పదేళ్ల తరువాత తన రూపంగా వస్తున్న పసిగుడ్డు. పక్కకు చూశాను. తలవేలాడేసి మావయ్య కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. పక్కన వాళ్ళ పెద్దక్క. దిగులుగా చూస్తూ పైకి చేతులు మొక్కుతూ ఉంది. ఈ వయసులో ఆయనకు మహిత దూరం అయితే! అవును అసలు మహిత లేకుండా నేనుండగలనా? ఒక్కక్షణం గుండె పట్టేసినట్లుగా ఉంది. లేదు మహితే కావాలి. అడిగితే ఇదే చెప్పాలి. లోపల నుండి ‘పాప,’ అని నవ్వుతూ చేతిలో బేబీని పెట్టింది సిస్టర్‌. కలా? నిజమా?నా చేతిలో బిడ్డ మీద దృష్టి లేదు. ‘మహితకు ఎలా ఉంది?’ అని అడిగాను. ‘తను బాగానే ఉంది. ఇంకో అరగంటలో మీరు చూడవచ్చు,’ అంది. నాకు ఇదంతా కలగా ఉంది.. మీద పడుతుందనుకున్న ఆకాశం వీపు చల్లగా నిమిరినట్లు. మెల్లిగా నా చేతుల్లోకి చూశాను. చిన్ని వేళ్ళను విప్పుతూ నన్నే కళ్ళు విప్పి చూస్తూ ఉంది. నమ్మలేకపోతున్నాను. ‘అదిగో నాన్న ముక్కే,’ పక్కనే ఉన్న పిన్నిగారి గొంతు. ‘ఏదో ఒకటి.. ఇద్దరూ బాగున్నారు చాలు!’ మావయ్య గొంతులో ఆనందం. ఏదో కలలాగే ఉంది. నిజానికి దుఃఖాన్ని ఎన్నో విధాలుగా కొలుస్తుంటాము కానీ ఆనందాన్ని కొలవలేం, ఊహించలేం. అనుభవించాల్సిందే! మెల్లిగా ఆ చిన్నారి చేయి నిమిరాను. అది నాదే. అచ్చంగా నాకోసం దేవుడు పంపిన వరం. నాదంటే నాదే. ఎలా ఉబికాయో కళ్ళ నుండి నాకే తెలీకుండా, పిల్లను తాకి హాయ్‌ చెబుతున్నాయి నా కన్నీళ్లు. 
 
‘చెప్పండి సిస్టర్‌.. ఇంత ఆనందాన్ని ఇచ్చిన మీకు ఏమి ఇవ్వాలి?’ అడిగాను. నవ్వింది. ఇక్కడ ప్రతి మొహంలో ఏదో ప్రత్యేకత! ‘నాకు కాదు.. పెద్ద మేడంగారికి చెప్పండి. తను ఇప్పుడే రెండు ఆపరేషన్స్‌ చేసి వెళ్లినా మీకోసం మళ్ళీ వచ్చింది. ఇంకా తన బ్లడ్‌ కూడా ఇచ్చింది.’ అంది సిస్టర్‌. నిజంగా ఆమె అంత మంచిదా? నమ్మబుద్ధి కావడంలేదు. ‘మరి భర్తను ఎందుకు వదిలేసింది?’ తెలీని కుతూహలం. మౌనంగా ఉంది. ‘మనుషుల ప్రాణాలు వ్యాపారం చేయాలి అనుకునేవాళ్లు మేడమ్‌కి నచ్చరు.’ అంది కాసేపటికి. ‘పోనీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా!’ నా అజ్ఞానికి నాకే జాలేసినా అడిగాను. ‘వ్యక్తిత్వం నిర్మించుకుంటూ ఎదిగే వాళ్లకి మగవాళ్ల తోడు అవసరం లేదు. జ్ఞానాన్ని పంచుకునే మనిషి తోడు తప్ప. మేడమ్‌కి అలాంటి ఫ్రెండ్స్‌ చాలామంది ఉన్నారు. మేడమ్‌కి జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసు. తన జీవితాన్ని పక్కవారికి ఎలా ఉపయోగించాలో తెలుసు!’ఒక్కసారి నాలోని ఆలోచనలు అన్నీ అవమానంతో తలదించుకున్నాయి. ఇప్పుడు అర్థమయింది.. అక్కడ ఉన్నవాళ్లలోని ప్రత్యేకత ఏమిటో! బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తూ సమాజానికి ఉపయోగపడే వారిలో ఉండే ఆత్మవిశ్వాసం. ‘నా మనవరాలికి దివ్య అని పేరుపెట్టుకుంటాము తల్లి. అంతే కాదు.. నేను నామకరణం చేసే ఆడపిల్లలకి దేవుని పేరు కంటే ముందు దివ్య అని పేరు పెట్టమని అడుగుతాను. ఇక ఆడపిల్ల ఎలా జీవించాలో వారికి నేర్పాల్సిన అవసరం ఉండదు.’ చేతులు జోడించి చెప్పాడు మావయ్య. నేను డాక్టర్‌ ఫొటో వైపు చూసి చేతులు జోడించాను. ఇప్పుడు అక్కడ నాకు ఒక తోకచుక్క కనిపిస్తూ ఉంది. అది మెరుస్తూ తన కక్ష్యలో తాను వెళుతూ ఉండే చుక్క. వెనుక ధూళి మీద మెరిసే వెలుతురు బట్టి మనమే తోకను ఊహించుకుంటాము. అరిష్టం అనుకుంటాము. నిజానికి దానిలోని జీవమే, భూమిమీద తొలి జీవంలో ఉందని శాస్త్రవేత్తలు చెబితే అది మన పుట్టుకకు దేవత కానీ అరిష్టం ఎప్పటికీ కాదు. చెడు అంతా మన చూపులోదే! నా నమస్కారాలు పట్టించుకోనట్లు ఆ ఫొటోలో దేవత నవ్వుతూనే ఉంది. 
- వాయుగుండ్ల శశికళ  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top