
రక్తం ఎక్కించకుండా చంపేశారని భర్త ఆరోపణ
విజయవాడ తరలిస్తుండగా మరణించిందన్న నూజివీడు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో సాధారణ ప్రసవం అయిన ప్రత్తిపాటి ఉషారాణి (28) సోమవారం ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఉషారాణి మరణించిందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించగా.. విజయవాడ తరలిస్తుండగా మృతి చెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పంచాయితీలో బాధిత కుటుంబానికి వైద్యులు రూ.లక్ష ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. నూజివీడు మండలం పోతురెడ్డిపల్లికి చెందిన ఉషారాణికి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకొచ్చారు.
వెంటనే సాధారణ కాన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఉషారాణికి రక్తం ఐదు శాతం మాత్రమే ఉందని, దీనివల్ల గుండెనొప్పి రావచ్చని చెప్పిన వైద్యులు వెంటనే రక్తం తెచ్చుకోవాలని విజయవాడలోని బ్లడ్‌బ్యాంక్ అడ్రస్ ఇచ్చారు. ఆమె భర్త బాలయ్య విజయవాడ వెళ్లి రెండు యూనిట్ల రక్తం తీసుకొచ్చి ఇచ్చారు. ఆరోజు రక్తం ఎక్కించకుండా వైద్యులు సోమవారం మధ్యాహ్నం రక్తం ఎక్కించడం ప్రారంభించారు. ఒక యూనిట్ రక్తం ఎక్కిన తరువాత ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో సీపీఆర్ చేసిన వైద్యులు ఆమెను వెంటనే విజయవాడ తీసుకెళ్లాలని సూచించారు.
108కి కాల్‌చేస్తే విజయవాడలో ఉన్నామని, వచ్చేసరికి గంటన్నర పడుతుందని సిబ్బంది తెలిపారు. బాలయ్య రెండుసార్లు ప్రైవేటు అంబులెన్స్‌ను తీసుకురాగా దాన్లో పంపేందుకు వైద్యులు నిరాకరించారు. చివరకు 108 వాహనంలో ఆమెను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఉషారాణి గంటన్నర కిందటే మృతిచెందినట్లు చెప్పారు.
తన భార్యను ఒక రోజంతా ఆస్పత్రిలోనే ఉంచుకుని రక్తం ఎక్కించకుండా చేతులారా చంపేశారంటూ బాలయ్య కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీనిపై నూజివీడు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజారాణి మాట్లాడుతూ ఉషారాణికి రక్తం ఎక్కిస్తుండగా రియాక్షన్ జరిగి పరిస్థితి విషమించిందని చెప్పారు. వైద్యులు సీపీఆర్ చేసి పరిస్థితిని కొంతమేరకు నిలకడగా ఉంచారని, విజయవాడ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందిందని పేర్కొన్నారు.
ఆస్పత్రిలోనే పంచాయితీ
ఉషారాణి కుటుంబసభ్యుల ఆందోళనల మధ్య మంగళవారం నూజివీడు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజారాణి చాంబర్‌లో పంచాయితీ పెట్టారు. టీడీపీ, ఎమ్మార్పిఎస్ నాయకులు, వైద్యులతో చర్చలు జరిపారు. వైద్యులు బాధిత కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆందోళనకు దిగిన సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహను పోలీసులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి.ప్రసాద్ ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.