శిశిరానికి సెలవిచ్చా...

Funday news story of the week 14-04-2019 - Sakshi

కొత్త కథలోళ్లు

‘‘నేను వెడుతున్నాను...’’ కాఫీ తాగేసి లేచాడు మనోజ్‌.‘‘సరే... మంచిది!’’ ముభావంగా చెప్పింది సంహిత.‘‘అయామ్‌ సారీ, నా వల్ల నీవు హర్ట్‌ అయినట్టయితే...’’ ఫార్మల్‌గా చెప్పాడు.అభావంగా చూసింది. అతను వెళ్ళిపోయాడు వాకిట్లో వేసిన ముగ్గుతో పాటుగా, ఆమె హృదయాన్ని తొక్కుకుంటూ. అప్పటివరకూ కంటి చివరలో నిలిచిన కన్నీటి కణం ఇక ఆగలేనట్టు జారిపడింది ఆమె చెక్కిలి పైకి...గుండెల్లో ఘనీభవించిన దుఃఖం కరిగి వెల్లువై ఒక్కసారిగా ఎగసింది... అంతే... రెండు చేతుల్లో తల దాచుకొని వెక్కి వెక్కి రోదించసాగింది సంహిత. ‘అయిపోయింది... ఒక అధ్యాయం ముగిసింది... ఇక నాకోసం నేను బ్రతకాల్సిందే...’ తనకు తానే సమాధానం చెప్పుకుంది. స్టవ్‌ మీద టీ పెట్టి, సిమ్‌ చేసి, ముఖం కడుక్కోవటానికి ఉపక్రమించింది.

‘‘ఏయ్, నీకేమైనాపిచ్చా? అతనలా తెగేసిచెప్పి నిన్ను వదిలి వెళ్ళిపోతే చేతకాని దానిలాగా ఎందుకు ఊరుకుంటావు? ఆరు నెలలు కాపురం చేసిన తర్వాత, ఇప్పుడు నువ్వు పనికిరానిదానివయ్యావా?  నీలో ఉన్న లోపాలు ఇప్పుడు మీరు విడిపోవటానికి కారణం అయ్యాయటనా? అసలు పెళ్లి చేసుకున్నది ఎందుకట, ఇలా మధ్యలో విడిపోవటానికా? ఆ కాగితాలపై ఎందుకు సంతకాలు పెట్టావు?’’ కోపంగా అడిగింది వాసంతి.‘‘నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మగవాడితో సిగ్గు విడిచి ‘నువ్వే కావాలి, నన్ను వదిలేయకు’ అని ఎలా చెప్పమంటావు వాసూ? నేనూ మనిషినే కదా, అంత అవమానాన్ని ఎలా సహించగలనే?’’ ‘‘సంహీ... నేను వెళ్లి అడుగుతాను... పెళ్ళంటే ఏమైనా బొమ్మలాటా, కాసేపు ఆడుకుని బోర్‌ కొట్టగానే మానేయటానికి? నీ జీవితం ఏమైపోవాలి?’’‘‘ఏమీ అయిపోలేదు, అవ్వదు...’’ కూల్‌ గా చెప్పింది సంహిత. ‘‘అతను రాకముందు నా జీవితం ఉంది, ఇప్పుడూ ఉంది, ఇకపై కూడా ఉంటుంది. అంతే...’’‘‘అసలు ఏం జరిగింది చెప్పు?’’గతమనే గవాక్షపు తలుపులు తెరిచింది సంహిత.

‘‘జీవితంలో నాకు చాలా కలలున్నాయి... వాటిని నెరవేర్చుకోవాలి... నాతో పాటుగా మీరు కూడా ఆ పథంలో అడుగేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు...’’ పెళ్లి చూపుల్లో మనోజ్‌ కి టీ కప్పు అందిస్తూ అన్నది సంహిత.‘‘కలలా? ఏమిటవి?’’ కాజువల్‌గా అడిగాడు, గాలికి ఎగిరే ఆమె చీర కొంగును చూస్తూ...ఆమె ఒక్కోటీ చెబుతూ ఉంటే ముఖం అదోలా పెట్టాడు. ఆ తర్వాత అనాసక్తిగా విన్నాడు. ‘‘సంహితా, ఆర్యూ సీరియస్‌?’’‘‘యస్‌... అయామ్‌...’’‘‘కలలంటే ఇవా? చక్కగా ఒక పెద్ద స్థలం కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకోవాలి...పెద్ద కారు కొనుక్కోవాలి. మనకి ఇద్దరు పిల్లలు ఉండాలి. వాళ్లకి చాలా ఖరీదైన స్కూల్‌లో చదువు చెప్పించాలి. ఖరీదైన ఫర్నిచర్, పెయింటింగ్స్‌ మన ఇంట్లో ఉండాలి. రిచ్‌ లైఫ్‌ కావాలి మనకి...అవీ కలలంటే...తెలుసా?’’‘‘అదికాదు మనోజ్, నేను చెప్పేది విన్నారు కదా, అర్థం అయిందా మీకు?’’ కంగారుగా అన్నది సంహిత.‘‘చక్కగా అర్థమైంది. నువ్వు చాలా తరచుగా రక్తదానం చేస్తావు. ఎవరైనా ఆపదలో ఉంటే వెళ్లి ఆదుకుంటావు. అనాథ పిల్లలకూ, వృద్ధులకూ సాయం చేస్తావు. ఇవే కదా... నేను వీటిని అభ్యంతర పరచను. వీటిని కలలంటే ఎలా? ఇవి నీ నిత్యకృత్యాలు. కాకపోతే నా కలలు ఇప్పుడే చెప్పాను కదా, వాటిని నెరవేర్చుకునే ప్రయత్నం ఇద్దరమూ చేద్దాము... సరేనా?’’‘అభ్యంతర పరచను’ అనగానే పొంగిపోయింది సంహిత. ‘‘మరి, ఇప్పుడు చెప్పు, నేను నీకు నచ్చానా?’’ నవ్వుతూ ఆమె చేయి పట్టుకున్నాడు, మనోజ్‌.క్రీగంట సిగ్గుతో అతన్ని చూస్తూ చేయి విడిపించుకుని లోపలి గదిలోనికి వెళ్ళిపోయింది, సంహిత. మిగిలిన విషయాలు అన్నీ పెద్దవాళ్ళే నిశ్చయించారు. మనోజ్‌ ఒక్క రూపాయి కూడా కట్నం వద్దనటంతో, ఆ వ్యక్తిత్వానికి దాసోహం అయిపొయింది సంహిత మనసు.

‘‘చక్కగా ఇద్దరం మంచి ఉద్యోగాల్లో ఉన్నాం...ఐదు లక్షల  రూపాయల చిట్‌ మొదలు పెడదాం...’’ పెళ్ళయిన వారం రోజులకు చెప్పాడు మనోజ్‌.‘‘ఉహు కుదరదండీ... నాకు కమిట్‌ మెంట్స్‌ ఉన్నాయి...’’ ‘‘కమిట్‌ మెంట్స్‌? అవేమిటి?’’‘‘నేను ‘సత్య’ అనే పాపను అడాప్ట్‌ చేసుకున్నాను. హోమ్లోఉంటుంది. ఆ పాపకి నెలకి చదువుకు  అయ్యే ఖర్చు నేనే భరిస్తున్నాను...’’ చెప్పింది.‘‘సరి సర్లే, ఇప్పటివరకూ భరించావుగా ... ఇక మానేయ్‌...’’ తేలికగా చెప్పాడు మనోజ్‌.‘‘అలా ఎలా వీలవుతుంది?’’‘‘అవుతుందోయ్‌... రేపు మనకే పిల్లలు పుడతారు... అలాంటప్పుడు పరాయి పిల్లలు, వాళ్ళ ఖర్చులు  మనకెందుకు చెప్పు?’’ ఆమెను మాట్లాడనీయకుండా చేతుల్లో బంధించాడు. మరో రోజు ఇద్దరూ ప్రగాఢ ప్రణయావేశంలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్‌ కాల్‌  రాగానే బయలుదేరుతూ ఉంటే వద్దన్నాడు. ‘‘లేదండి, యాక్సిడెంట్‌... చాలా ప్రమాదంలో ఉన్నాడు పేషెంట్‌... నేను వెళ్లి బ్లడ్‌ ఇవ్వాలి... ప్లీజ్‌...’’ చెబుతూనే త్వరగా రెడీ అయి, తన బైక్‌ మీద వెళ్ళిపోయింది సంహిత. ఇంకో రోజు అతను వద్దని అంటున్నా, ఒక అంధురాలైన విద్యార్థినికి పరీక్ష వ్రాయటానికని స్క్రయిబ్గా వెళ్ళింది... ఈ రెండు సంఘటనలూ ఇద్దరి మధ్యా వాగ్యుద్ధాన్ని ప్రారంభింప జేసి, మనసులమధ్య దూరాన్ని ఎక్కువచేసాయి.అతనిదంతా డబ్బు జాగ్రత్త, విపరీతమైన పొదుపు. ఆమె పాత డ్రెస్సులు, చీరలు ఎవరికీ ఉచితంగా ఇవ్వనీయడు. ‘సెకెండ్‌ హాండ్‌ లో అమ్మేస్తే బోలెడు డబ్బు కదా!’ అంటాడు. పుస్తకాలు, పత్రికలూ కొనుక్కోనీయడు. లైబ్రరీలో సభ్యత్వం తీసుకోవచ్చు కదా అంటాడు... అలసిపోయి ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత సంహిత మొత్తం ఇంటి పనీ, వంట పనీ తానే చేయాలి. ఇటు చెంచా తీసి అటు పెట్టడు. ఏదైనా తనకి ఇష్టమైన మూవీ గురించి కాని, పుస్తకం గురించి కానీ చర్చించుదామంటే అతనికి ఆసక్తి ఉండదు. ‘ఊ..ఊ..’ అంటూ అటు తిరిగి పడుకుంటాడు. నిరాశగా నిట్టూర్పులు విడవటం తప్ప ఏమీ మిగల్లేదు సంహితకు. 

గొడవలు పడటం ఇష్టం లేని సంహిత, అతను అడిగిన డబ్బు ఇచ్చేసి, మిగిలిన దాంతో కష్టపడి సర్దుకుంటోంది. ఈలోగా సంహిత తండ్రికి ఆరోగ్యం పాడై, ఏవో టెస్టులు చేయించుకోవలసి వచ్చి, సంహిత దగ్గరకు వస్తే తానే ఆయన్ని లాబ్‌ కి తీసుకుపోయి పరీక్షలు జరిపించింది. వాటికీ, డాక్టర్‌ ఫీజుకీ, మందులకీ ఇంచుమించు ఐదారువేల దాకా  ఖర్చయింది. తనకు  చెప్పకుండా ఆ డబ్బు ఖర్చు చేసినందుకు చాలా రాద్ధాంతం చేసాడు మనోజ్‌. అతను డబ్బు మనిషి అనీ, ‘డబ్బు’ ను తప్ప మనుషులను ప్రేమించడనీ అర్థమైంది సంహితకు... ‘పిల్లలు పుడితే అతనే మారతాడమ్మా...’ అనునయంగా చెప్పింది తల్లి. అదే ఆశతో కాలం గడుపుతోంది సంహిత... ఎంతకాలం ఎదురు చూసినా తాను తల్లీ కావటం లేదు, మనోజ్‌ కూడా మారలేదు. పైగా సంహిత తనకు అనుకూలంగా మారలేదని అతనికి అంతులేని  కోపం.

‘‘ఇలా ఎంతకాలం? మనకి పిల్లలు పుట్టే సూచనలేవీ  కనపడటం లేదు... సంహితా, నీతో నేను ఆనందంగా ఉండలేను... మనం విడిపోదాం’’ ఒకరోజు చెప్పాడు మనోజ్‌.‘‘మనో... ఏమిటంటున్నారు? చాలా తప్పు. మనం విడిపోవటానికా పెళ్లి చేసుకున్నది?’’ ‘‘కాదు కానీ, నీ తెంపరితనం నేను భరించలేకపోతున్నాను. నువ్వు నాకు అనుకూలంగా ఉండవు... నీకు ఖర్చులెక్కువ. నాకన్నా అనాథలూ, దిక్కు లేని వాళ్ళూ ప్రాణం...ఏదో పెళ్ళికి ముందు సరదా పడ్డావు, నన్నడిగితే నువ్వు పెళ్లి తర్వాత మారతావని అనుకుని మాటిచ్చాను... కాని నువ్వు మారలేదు, మారవు కూడా... అందుకే నాకు నీమీద ఇష్టం పోయింది...యస్‌... ఐ హేట్‌  యూ...’’‘‘ఇష్టం అనేది ఒకసారి కలిగాక పోతుందా మనోజ్‌? మీరు ఏకపక్షంగా ఆలోచిస్తున్నారు... నా వైపు నుంచి మీరు సానుకూలంగా ఆలోంచించవచ్చు కదా.. మీ పాటికి మీరు నా మీద ఇష్టాన్నే చంపేసుకున్నారు. కానీ మీరంటే నాకు మాత్రం  చాలా ప్రేమ!’’ ఆవేదనగా చెప్పింది సంహిత.‘‘హు...ప్రేమ! నీ ఆశయాల మీదా, నీ ఆదర్శాల మీదా మాత్రమే  నీకు ప్రేమ... అందుకే వాటిని వదులుకోలేవు నీవు నాకోసం.. అలాంటప్పుడు నేనే నిన్ను వాటికి వదిలేసి వెళ్ళిపోవటం న్యాయం... మ్యూచువల్‌ కన్సెంట్‌  మీద విడాకులు తీసుకుందాం...’’ స్థిరంగా చెప్పాడు మనోజ్‌. 

‘‘అది వాసూ నా పెళ్లి కథ...నువ్వు చాలా కాలంగా ఇక్కడ లేకపోవటం వలన, నీ కాంటాక్ట్‌ నంబర్‌ నా దగ్గర లేకపోవటం వలన నా విషయాలు ఏవీ నీకు ఇప్పటివరకూ  తెలియవు.  అతనికి నా వ్యాపకాలు మైనస్‌ చేసుకుని, నా డబ్బును ప్లస్‌ చేసిన తర్వాత అతనికే మిగిలిన  నేను కావాలి... అతని కన్నా ముందుగా నా జీవితంలోకి వచ్చిన వాటిని, వారిని నేను వదులుకోలేను కదా...’’ ముగించింది, సంహిత. 
ఆమె మొబైల్‌ మ్రోగింది... అవతలి వాళ్ళు చెబుతున్నది వింటున్నంత సేపూ సంహిత  ముఖంలో ఆందోళన... ఫోన్‌ కాల్‌  ముగించి చెప్పింది... ‘‘పాప సత్యకి ఆరోగ్యం బాగాలేదు... అర్జెంట్‌ గా నేను ఆర్ఫనేజ్‌ కి వెళ్ళాలి... ఇక సత్యను అక్కడ ఉంచలేను, ఇంటికి తీసుకు వచ్చేస్తాను...’’ దృఢంగా అన్నది లేస్తూ.‘‘వీళ్ళకోసం నీ కాపురం వదులుకున్నావా?’’‘‘కాపురం కోసం ‘వీళ్ళని’ వదులుకోలేను... అలా చేస్తే నన్ను నేను చంపుకున్నట్టే... నాకు జీవించాలని  ఉంది వాసూ... లెటజ్‌ గో...’’ సంహిత ముఖంలో కొత్తవెలుగు గోచరించింది వాసంతికి.
నండూరి సుందరీ నాగమణి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top