ఎవరు గొప్ప?

funday childrens story - Sakshi

పిల్లల కథ

రైతు ఆరుగాలం కష్టపడి  పండించిన గింజల్నే మనం  తింటూ బతుకుతున్నాం.  పాపం రైతెంత శ్రమపడ్డా తనకు మిగిలేదేమీ ఉండదు.  ఎవరెంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే తప్ప డబ్బులు కావు. 

రవి, శ్రీను, తేజ మంచి మిత్రులు. ఉన్న ఊళ్లోనే ఇంటర్‌ వరకు కలిసి చదువుకున్నారు. తేజ తండ్రి బాగా స్థితిమంతుడవడం వల్ల డొనేషన్‌ కట్టి కొడుకును వైద్య కళాశాలలో చేర్పించాడు. తేజకి మెడిసన్‌లో సీటు వచ్చిందని తెలిసి రవి, శ్రీను ఎంతో సంతోషించారు. వాడికి ఉన్నంత స్థోమత తనకు లేకపోవడంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో నెగ్గి ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు సంపాదించాడు శ్రీను. దాంతో రవికి ఏం చేయాలో తోచలేదు. తన పరిస్థితి మరీ దారుణం. నాన్న సంపాదన ఇంట్లో మూడుపూటలా తినడానికే సరిపోదు. అందుకే తక్కువ ఖర్చుతో చదువుకోవచ్చని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాడు. ఉన్నత చదువుల కోసం ముగ్గురూ మూడు ప్రాంతాలకు వెళ్లిపోయినా సెలవుల్లో విధిగా సొంతూరికి వస్తారు. కచ్చితంగా కలుసుకుంటారు. ఒకరితో మరొకరు తమ అనుభావాల్ని పంచుకుంటూ మురిసిపోయేవారు.
ఆ ఏడు వేసవి సెలవులివ్వగానే ఎప్పటిలాగే స్నేహితులు ముగ్గురూ మళ్లీ తమ ఊరికి వచ్చారు. రావడంతోనే ఇట్టే అతుక్కుపోయారు. ‘‘రేయ్, ఇవాళ సాయంత్రం చల్లబడ్డాక మనం ఊరవతల ఉన్న చెరువు దగ్గర కలుద్దాం. అక్కడే ఎంచక్కా ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. ఏమంటారు??’’ అన్నాడు శ్రీను.

సరేనన్నారు రవి, తేజ.అనుకున్నట్లే ముగ్గురూ ఆ సాయంత్రం చెరువుగట్టు మీద చతికిలబడి మాటల్లోపడ్డారు.‘‘నువ్వెన్ని చెప్పు. మన ముగ్గురిలో నేనే గొప్ప. చదువయ్యాక పెద్ద డాక్టరునై రోగులకు వైద్యం చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను. లక్షలకు లక్షలు సంపాదిస్తాను’’ అన్నాడు తేజ.‘‘ఆ మాటకొస్తే నేనేం తక్కువ కాదు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరునై నీకంటే ఎక్కువగా సంపాదిస్తాను. కార్లలో, విమానాల్లో తిరుగుతాను’’ అన్నాడు శ్రీను.‘‘అలా అనుకొని మీరిద్దరూ నన్ను తక్కువ అంచనా వేయకండి. డిగ్రీ చెయ్యగానే చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటానా? ఉహుం. ఐఏఎస్‌ రాసి మీ కంటే గొప్పవాడినవుతాను’’ అన్నాడు రవి తనేమీ వాళ్లకు తీసిపోనన్నట్లు.ఇలా వారిలో వారు నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకుంటూ ఉండగా రామం మాస్టారు అటువైపుగా వస్తున్నారు. ఆయన రావడం చూసి ‘‘మనలో మనం పోట్లాడుకోవడం దేనికిరా? అదిగో అటు చూడండి. మన తెలుగు మాస్టారు ఇటే వస్తున్నారు. మనలో ఎవరు గొప్పో ఆయన్ని అడిగేస్తే తేలిపోతుంది’’ అంటూ గబగబా ముందుకెళ్లి ‘‘నమస్కారం మాస్టారు’’ అన్నాడు తేజ.

‘‘ఏంట్రా, మళ్లీ ముగ్గురూ ఇక్కడ పోగయ్యారు. కాలేజీలకు సెలవులిచ్చేశారా ఏంటి?’’ నవ్వుతూ అడిగారు రామం మాస్టారు.‘‘ఔనండి. ఇప్పుడు మాకో డౌటొచ్చింది మాస్టారు. దాన్ని మీరే తీర్చాలి. మా ముగ్గురిలో వీడేమో ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. వాడేమో బీయస్సీ చదువుతున్నాడు. నేను మెడిసిన్‌. మాలో ఎవరు గొప్పో తేల్చుకోలేక పోతున్నాం’’ అన్నాడు తేజ.‘‘బాగుందిరా మీ సందేహం. అదిగో అటు చూడండి. ఆ పొలంలో రాత్రనక, పగలనక, ఎండనక, వాననక కష్టపడి భూమిదున్ని వ్యవసాయం చేస్తున్న ఆ రైతే మనందరికంటే గొప్పవాడు’’ అన్నారు రామం మాస్టారు.‘‘అదేంటి మాస్టారు అలా అంటారు. మట్టిలో మటై్ట పొలాల్లో పని చేసుకునే రైతు నా కంటే గొప్పవాడెలా అవుతాడు? నేను డాక్టర్‌నైతే ఎందరికో వైద్యం చేసి వాళ్ల జబ్బుల్ని ఇట్టే మాయం చేస్తాను. బోలెడంత డబ్బు సంపాదిస్తాను’’ అన్నాడు తేజ. ‘‘నువ్వన్నది బాగానే ఉంది. అయితే చనిపోయిన వాణ్ని నువ్వు వైద్యం చేసి బతికించగలవా?’’ ఎదురు ప్రశ్న వేశారు మాస్టారు.‘‘చనిపోయిన వ్యకికి వైద్యమా! ’’ ఆయన అడిగిందానికి ఏం చెప్పాలో తెలియక తెల్లమొహం వేశాడు తేజ.‘‘చూడండి అబ్బాయిలూ..! ముమ్మాటికీ ఆ రైతే అందరికంటే గొప్పవాడు. అందులో సందేహమే లేదు. తను ఆరుగాలం కష్టపడి పండించిన గింజల్నే మనం తింటూ బతుకుతున్నాం. పాపం రైతెంత శ్రమపడ్డా తనకు మిగిలేదేమీ ఉండదు. ఎవరెంత డబ్బు సంపాదించినా తినేది అన్నమే తప్ప డబ్బులు కావు. అటువంటి అన్నదాతకు మీరు నేర్చుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి పెంచడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. అప్పుడు దేశంలో అందరూ హాయిగా జీవిస్తారు’’ అంటూ హితోపదేశం చేశారు మాస్టారు.మాస్టారు మాటలతో వారికి కనువిప్పు కలిగింది. ఆ రోజు నుంచి నేను గొప్పంటే నేను గొప్పని వాదులాడుకోవడం మానేశారు ముగ్గురు స్నేహితులు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top