భార్య కోసం 65 గ్రామాల్లో..

Man cycles across 65 villages to find mentally unstable wife - Sakshi

సాక్షి, రాంచీ : మతిస్థిమితం లేని భార్య తప్పిపోవడంతో ఆ భర్త తల్లడిల్లాడు. ఆమె కోసం సైకిల్‌పై ఏకంగా 65 గ్రామాలను చుట్టేశాడు. జార్ఖండ్‌కు చెందిన వ్యవసాయ కూలీ మనోహర్‌ 16 ఏళ్ల కిందట అనితను వివాహం చేసుకున్నాడు. వీరికి 14 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. జనవరి 11న అనిత తన కుమారుడితో కలిసి పశ్చిమ మెదినిపూర్‌ జిల్లాలోని కుమ్రాసోల్‌ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. ప్రయాణంలో దారితప్పడంతో అప్పటినుంచి ఆమె జాడ తెలియరాలేదు. ఆ సమయంలో ఒడిషాలో పనిచేస్తున్న మనోహర్‌ తన ఉద్యోగాన్ని వదిలి భార్యను వెతుకుతున్నాడు. కుమ్రసోల్‌ గ్రామానికి సమీప పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. పోలీసు చర్యల కోసం ఎదురుచూడకుండా మనోహర్‌ తనే సొంతంగా భార్యను గాలించేందుకు తన పాత సైకిల్‌పై ప్రయాణం చేపట్టాడు.

అనిత ఫోటోతో పాటు ఆమె తప్పిపోయిన వార్త ప్రచురితమైన వార్తాపత్రికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే వార్తాపత్రికల్లో ఆమె ఫోటోను చూసిన కొందరు అనితను గుర్తుపట్టి ఖరగ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో వారు ముసబని పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించడంతో ఆమె ఆచూకీని మనోహర్‌కు తెలియచేశారు. ఆ సమయంలో భార్య కోసం తూర్పు సింగ్భుమ్‌లో గాలిస్తున్న మనోహర్‌ సైకిల్‌పైనే నేరుగా ఖరగ్‌పూర్‌ పీఎస్‌కు వెళ్లి అనితను కలిశారు. తన భర్త సైకిల్‌పై జాతీయ రహదారిలో 120 కిమీ ప్రయాణించి కోల్‌కతా చేరుకోవడం పట్ల అనితతో పాటు పోలీసులూ ఆశ్చర్యపోయారు.

Back to Top