వజ్రాల వ్యాపారి కుమారుడు అన్నీ వదిలేసి..

Diamond Merchants 12-year-Old Son Gives Up Worldly Pleasures To Become A Jain Monk - Sakshi

సాక్షి, సూరత్‌ : కోట్ల రూపాయల సంపద, సకల సౌకర్యాలను విడిచిపెట్టి భవ్య షా అనే 12 ఏళ్ల బాలుడు జైన సన్యాసిగా మారిపోయాడు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి కుమారుడు షా నిర్ణయంతో కుటుంబసభ్యులు గర్వపడుతున్నామని చెప్పారు. తమ కుమారుడు గురువారం జైన సన్యాసిగా మారడాన్ని వారు ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆథ్యాత్మిక బాటలో జీవితాన్ని అంకితం చేయాలన్న నిర్ణయంపై బాలుడు స్పందిస్తూ భగవంతుడు చూపిన సత్యమార్గంలో పయనించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను తల్లితండ్రులను విడిచి వెళుతున్నానని, భవిష్యత్‌లో వారు సైతం ఇదే బాటలో పయనిస్తారని చెప్పాడు.

భవ్య జైన దీక్ష స్వీకరించడం పట్ల తామెంతో సంతోషంగా ఉన్నామని డైమండ్‌ వ్యాపారి అయిన భవ్య తండ్రి దీపేష్‌ షా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కుమారుడు తమను విడిచివెళుతున్నాడన్న బాధ తమకు లేదని, నాలుగేళ్ల కిందట 12 ఏళ్ల వయసులో తమ కుమార్తె సైతం జైన సన్యాసినిగా మారిందని చెప్పుకొచ్చారు. జైన సన్యాసులు భౌతిక వాంఛలు, వస్తువులను వీడటంతో పాటు భావోద్వేగాలు, కోరికలకు మూలమైన కర్మలను కూడా విడిచిపెట్టి ప్రశాంత జీవనం గడుపుతారు.

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top