టిడిపితో పొత్తు బిజెపికి ముప్పు
తెలుగుదేశం పార్టీతో పొత్తు బిజెపికి ముప్పు తెచ్చే పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీతో పొత్తు బిజెపికి ముప్పు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర విభజన సందర్భంగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతం, రెండు కొబ్బరి చిప్పల సిద్ధాంతం రెండు ప్రాంతాలలోనూ బెడిసి కొట్టింది. దాంతో అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. తెలంగాణ ప్రజలు టిడిపి అంటేనే మండితున్నారు. ఈ ఎన్నికల తరువాత తెలంగాణలో టిడిపి పూర్తిగా కనుమరుగైపోతుందని కూడా చెబుతున్నారు. ఈ విషయం అర్ధం చేసుకున్న తెలంగాణలోని పలువురు టిడిపి నేతలు ముందుగానే జాగ్రత్తపడ్డారు. పార్టీని ఫిరాయించేశారు. తమకు నచ్చిన, ఏదో ఒక రకంగా అవకాశం ఉందని భావించిన పార్టీలలోకి మారిపోయారు.
ఈ నేపధ్యంలో బిజెపి - టిడిపి పొత్తు దాదాపు ఖరారైపోయింది. తెలంగాణ బిజెపి నేతలకు ఈ పొత్తు అసలు ఇష్టంలేకపోయినా, ఢిల్లీ పెద్దలు పొత్తుపరంగా ముందుకు వెళ్లిపోతున్నారు. మొదటి నుంచి టిడిపితో పొత్తు వద్దని చెబుతున్నా ఆ పార్టీ అధిష్టానం వినిపించుకోకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దాంతో ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడన్న ఆలోచనతో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం పెద్దలు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వత్తాసు పలకడంతో ఆయన మనఃస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉధృతస్థాయిలో ఉద్యమం చేసింది. ఉద్యమ కాలంలో అందరితోపాటు తెలంగాణ బిజెపి నేతలు కూడా టిడిపిని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో టిడిపి ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించకపోవడం వల్ల రెండు ప్రాంతాలలోనూ ఆ పార్టీ అంటే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. తెలంగాణాలో టిడిపి బతికి బట్టకట్టాలంటే బిజెపితో పొత్తు పెట్టుకోక తప్పనిపరిస్థితి ఏర్పడింది. ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవన్న విషయం ఆయనకు తెలుసు. పరిస్థితిని పూర్తిగా అర్ధం చేసుకున్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ పరిజ్ఞాన్ని అంతటినీ ఉపయోగించి బిజెపితో పొత్తుకు శతవిధాల ప్రయత్నించారు.
తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా బిజెపికి ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఈ ఎన్నికలలో కొద్దోగొప్పో తెలంగాణలో ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉందని భావించారు. ఆ పార్టీ స్థానిక నేతలు కూడా అదేవిధంగా ఆశపడ్డారు. ఈ పరిస్థితులలో బిజెపి, టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడటంతో ఆ పార్టీ నేతలు తీవ్ర మనఃస్తాపానికి లోనయ్యారు. ఆ పార్టీతో పొత్తు వల్ల బిజెపి కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. తెలంగాణలో ప్రజలు టిడిపి అంటేనే మండిపడే పరిస్థితి ఉంది. అటువంటి పార్టీతో పొత్తు వల్ల బిజెపిని కూడా ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు. టిడిపితో పొత్తుకు బిజెపి అధిష్టానం నేతలు పట్టుపట్టడంతో టిడిపి నుంచి బిజెపిలో చేరాలని అనుకున్న నేతలు కూడా ఆ పార్టీలో చేరలేదని తెలుస్తోంది. ఆ విధంగా కూడా ఇప్పటికే బిజెపి కొంత నష్టపోయిందని భావిస్తున్నారు.
పొత్తు ఖరారైనట్లు అధికారికంగా ప్రకటిస్తే తెలంగాణలోని కొందరు నేతలు బిజెపిని వీడే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటికే ఒక పక్క పొత్తులపై చర్చలు తుది దశకు వచ్చినా, మరోవైపు బీజేపీ నాయకులు అవేమి పట్టించుకోకుండా తమ నామినేషన్లు తాము వేసేందుకు సిద్ధపడ్డారు. ఈ రకంగా వారు నిరసన తెలుపుతున్నారు. పొత్తూ గిత్తూ జాన్తా నై అంటూ మండిపడుతున్నారు. ఆ పార్టీ జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి పొత్తు విషయమై చర్చలు జరుపుతుండగానే పార్టీ కార్యకర్తలు పలువురు బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ధర్నాకు దిగారు. ఏ రకంగా చూసినా బిజెపి-టిడిపి పొత్తు వల్ల బిజెపి తెలంగాణలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.


