నిరుపేదలకు తిరుదర్శనం | Tirudarsanam to the poor | Sakshi
Sakshi News home page

నిరుపేదలకు తిరుదర్శనం

Apr 9 2015 11:45 PM | Updated on Sep 3 2017 12:05 AM

నిరుపేదలకు తిరుదర్శనం

నిరుపేదలకు తిరుదర్శనం

పూట గడవడమే కష్టమైన నిరుపేదలకు సుదూర దైవదర్శన యాత్రలకు వెళ్లగలిగే స్థోమత ఉంటుందా?

కొల్లూరి సత్యనారాయణ, సాక్షి, హైదరాబాద్
 
పూట గడవడమే కష్టమైన నిరుపేదలకు సుదూర దైవదర్శన యాత్రలకు వెళ్లగలిగే స్థోమత ఉంటుందా? మరి వారికే కనుక ఆ తిరుమల వెంకన్న దర్శనానికి అవకాశమొస్తే వారి ఆనందానికి అవధులు ఉంటాయా! అలాంటి అరుదైన అవకాశం కల్పిస్తున్నారు పారిశ్రామికవేత్త, శ్రీ అష్టోత్తర శత (108) చారిటబుల్ ట్రస్టు ధర్మకర్త చుక్కల వేణుకుమార్. అసలు అలాంటి ఒక సంకల్పం ఆయనలో ఎలా కలిగింది? ఆ వివరాలు, విశేషాలు ఆయన మాటల్లోనే...
 
అంజనాద్రిలో వచ్చిన ఆలోచన

 నేను పుట్టి పెరిగింది భాగ్యనగరంలో. తొలిసారి 1996లో తిరుపతికి వెళ్లినప్పుడు అక్కడి నుంచి తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. ఆ తర్వాత వరుసగా ఆరు పర్యాయాలు తిరుమలకు పాదయాత్ర చేశాను. అమ్మ తనూ వస్తాననడంతో ఎనిమిదోసారి ఆమెను కూడా నావెంట తీసుకెళ్లాను. ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాను. 11వసారి తిరుమలకు కాలినడకన వెళుతుంటే దారిలో అంజనాద్రి ఆలయం వద్ద అలసట తీర్చుకునేందుకు ఆగినప్పుడు అక్కడ నాకు ఓ పాత దినపత్రిక కనిపించింది. అందులోని ఓ వార్త నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. దివంగత రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ... మొత్తం 108 పర్యాయాలు తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లారనేది ఆ వార్త సారాంశం. అది నాలో స్ఫూర్తిని కలిగించింది. ఆ స్ఫూర్తితో నాటి నుంచి దాదాపు ప్రతి నెలా తిరుమల కొండకు పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఇప్పటికి 142 సార్లు ఆ దేవదేవుడిని కాలినడకన దర్శనం చేసుకున్నా. 108వసారి తిరుమలకు వెళ్లినపుడు పుష్పగిరి మఠం మేనేజర్ పుండరీకాక్షుడితో పరిచయమైంది. అదే సమయంలో టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతోనూ పరిచయ భాగ్యం కలిగింది.
 
మనసులో మెదిలింది


ఇన్నిసార్లు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లిన నా మదిలో ఓ ఆలోచన మెదిలింది. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమల చూడని నిరుపేద భక్తులకు అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇందులో భాగంగా హయత్‌నగర్ మండలం కొత్తగూడలోని కోటిలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఓ ప్రకటన పెట్టించాను. ఒక్కసారి కూడా తిరుమల చూడనివారికి ఉచిత దర్శనం కల్పిస్తామని అందులో ప్రకటించాము. అలా ఒక్కసారి కూడా వెంకన్నను చూడని భక్తులకు దర్శనావకాశం కల్పించే కార్యక్రమానికి బీజం పడింది. తొలి విడతగా మా వెంట 36 మంది తిరుపతి వచ్చారు. ఆ యాత్ర నిరుడు నా 39వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 13వ తేదీన నిర్వహించాం. అదే రోజు 39 మంది సమక్షంలో దైవజ్ఞశర్మ నేతృత్వంలో శ్రీ అష్టోత్తర శత(108) చారిటబుల్ ట్రస్టును ప్రారంభించాం. తొలి పర్యటనలో పాల్గొన్న వారందరికీ సకల సౌకర్యాలు కల్పించాం.  ఈ ఏడాది ఆగస్టులో రెండో విడత భక్తులను తిరుమలకు తీసుకెళ్తున్నాం.
 
భవిష్యత్ ప్రణాళిక

కాళ్లు చేతులు లేని 50 మందిని ఎంపిక చేసి, వారిని కూడా తిరుమలకు తీసుకెళ్లాలని అనుకొంటున్నాం. వీరంతా తమ వెంబడి ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారికి అయ్యే ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అలాగే అంధులకు దర్శనం మరో కార్యక్రమం. కళ్లులేని 51 మందిని తిరుమలకు తీసుకెళ్లాలని మేం సంకల్పిస్తున్నాం. వీరు కూడా తమ వెంట ఓ సహాయకుడిని తీసుకొని రావాల్సి ఉంటుంది. వారి ఖర్చులు కూడా మేమే భరిస్తాం. కళ్లులేనివారు దేవుడిని చూడలేరనదేగా మీ సందేహం... వాళ్లు దేవుణ్ణి చూడలేకపోయినా.. దేవుడు వాళ్లను చూస్తాడనేది మా నమ్మకం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement