భయాన్ని భయపెట్టాలి! | Sakshi
Sakshi News home page

భయాన్ని భయపెట్టాలి!

Published Thu, Nov 16 2017 12:39 AM

There are many fears in life - Sakshi

జీవితంలో ఎన్నో భయాలు తలెత్తుతాయి. వూహించుకున్నవి కొన్ని. వాస్తవమైనవి కొన్ని. భయాలు లేని మానవుడు ఉండడు కాని, ‘అసలెందుకు భయపడాలి’ అని ధైర్యంగా ప్రశ్నించే సందర్భం వస్తుంది. అప్పుడైనా దాన్ని ఉపయోగించుకోవాలి. భయం రహస్యమేమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే, మనిషిని వెనక్కి లాగేదల్లా భయమే! దాన్ని జయించడమే జీవితం... జీవన పోరాటం. కోరికలతో సతమతమయ్యేవాడు భయపడాలి. కోట్లకు పడగలెత్తాలనుకున్నవాళ్లు భయపడాలి. మంచివాళ్లకు చెడు చేయడానికి ఉవ్విళ్లూరే వాళ్లు భయపడాలి. స్వార్థపరులు భయపడాలి. అయితే, ‘లోకానికి మంచి చేద్దాం’ అనుకున్నవారిని చూసి భయమే భయపడుతుంది.

సత్యం ఉన్నచోట భయమన్నదే ఉండదు. భయం గల చోట లొసుగులుంటాయి. అబద్ధాలుంటాయి. మనిషి ఎందుకు భయపడాలి? భగవన్నామ స్మరణ చేయలేకపోతున్నందుకే అతడు భయపడాలంటుంది భాగవతం! ‘ఎవరు పుణ్యాత్ములో, నిర్భయులో... వారే నా నామస్మరణ చేస్తా’రంటాడు పరమాత్మ. భయాన్ని దునుమాడే వజ్రాయుధమే దైవస్మరణ. అందువల్ల భయాన్ని భయపెట్టాలంటే ధైర్యంగా ఉండాలి. చేసేది మంచిపని అయినప్పుడు, భయం ఎప్పుడూ ఆమడ దూరంలో ఉంటుంది. చివరకు ఆచూకీ లేకుండా పోతుంది. భగవన్నామ స్మరణ, ఆత్మవిశ్వాసం, పరోపకారం, పరాక్రమం... ఇత్యాది మంచి గుణాలే అసలైన ఆయుధాలు. ఆ ఆయుధాలను చేత ధరించండి. భయాన్ని బయటికి పంపెయ్యండి.

Advertisement
Advertisement