గమ్యం మారింది

Telugu Migrant Families Journey in Wrong Train to Kerala - Sakshi

రెండు తెలుగు కుటుంబాలు ఇప్పుడు కేరళలో క్వారంటైన్‌లో ఉన్నాయి. వాళ్లు కేరళకు వెళ్లాలని వెళ్లలేదు. విధిరాత ప్రపంచాన్ని కోవిడ్‌ కోరల్లో బంధించి, కాలాన్ని స్తంభింప చేస్తే... వీళ్లను మాత్రం జైపూర్‌ నుంచి కేరళకు పంపించింది. సొంతూరికి వస్తున్నాం అనుకుంటూ జైపూర్‌లో రైలెక్కి గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నారు. రైలు దిగిన తర్వాత తెలిసింది తాము వచ్చింది తమ రాష్ట్రాలకు కాదని. హైదరాబాద్‌కు రావాల్సిన రైలుకు బదులు కేరళ రాజధాని తిరువనంతపురం రైలెక్కామని వాళ్లకు అర్థమయ్యేసరికి గుండె ఆగినంత పనైంది. ఆ ఆరుగురు ఇప్పుడు కేరళ ప్రభుత్వం సంరక్షణలో ఉన్నారు.

ఎవరిదీ తప్పు!
వలస కార్మికులను తమ స్వస్థానాలకు చేర్చడానికి ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడిపింది. కార్మికులను ఆ రైళ్లలో ఎక్కించేటప్పుడు ఉద్యోగులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. జైపూర్‌లో రైలు ఎక్కించేటప్పుడు రాజస్థాన్‌ అధికారులు ఎవ్వరూ వీళ్ల దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించలేదు. ఏది ఏ రాష్ట్రానికి వెళ్లే రైలో సరిగ్గా చెప్పే నాథుడు లేడక్కడ. హైదరాబాద్‌కెళ్లే రైలు ఏది, త్రివేండ్రం వెళ్లే రైలేది అని తెలుసుకోవడానికి ఈ ఆరుగురిలో ఎవరికీ చదువురాదు. తెలుగు తప్ప మరో భాష రాదు. రైల్వే ఉద్యోగులను తెలుగుభాషలో అడిగారు వాళ్లు. ఆ ఉద్యోగులు చూపించిన రైలెక్కేశారు.

ఇలా తెలిసింది
కేరళలో కోవిడ్‌ స్క్రీనింగ్‌ చాలా పక్కాగా జరుగుతోంది. రైలు దిగిన ప్రతి ఒక్కరినీ పరీక్షించారు. గడచిన శుక్రవారం నాడు పరీక్షల్లో వైద్య అధికారులు గుర్తించారీ సంగతిని. అరవై ఎనిమిదేళ్ల అంజయ్య– అతడి భార్య లక్ష్మి, వాళ్లకొడుకు రవి. మరో కుటుంబానికి చెందిన ముగ్గురిలో డెబ్బై ఏళ్ల భాస్కర్‌ రావు, అతడి భార్య మంకమ్మ, వాళ్ల బంధువు శెకంజీ. ఒక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్, ఒక కుటుంబానిది తెలంగాణ అని మాత్రమే చెప్పగలుగుతున్నారు కేరళ అధికారులు. జూన్‌ ఒకటవ తేదీన మొదలయ్యే రెండోదఫా శ్రామిక రైళ్లలో వారిని హైదరాబాద్‌కు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top