ఫాస్ట్‌పుడ్‌ తింటున్నారా.. జర జాగ్రత్త!

Study Says Fast Food May Contribute To Teen Depression - Sakshi

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్‌ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్‌ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్‌ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్‌ పుడ్‌ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది. 

ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు.  కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు.

పరిశోధన జరిగిందిలా..
పరిశీలన కోసం ఫాస్ట్‌పుడ్‌ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల, బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ గృహాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. సోడియం,పోటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసి తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జంక్‌పుడ్‌ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పోటాషియం తగ్గుతుందని పరిశోధనలో తేలిందని యూనివర్సీటీ నిపుణులు పేర్కొన్నారు. 

సోడియం శాతం పెరగడానికి కారణం ఇవే
‘ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని వల్ల కుంగుబాటుకి లోనవుతారు​’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ తెలిపారు. జంక్‌పుడ్‌లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు వుంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్‌, విటమిన్స్‌, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవని చెప్పారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమోటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పోటాషియం శాతం తగ్గుతుందని చెప్పారు. ఈ అధ్యయనం సోడియం, డిప్రెషన్‌పై మాత్రమే జరిగిందన్నారు. అయితే జంక్‌పుడ్‌తో డిప్రెషన్‌కు ఎందుకు లోనవుతారనే దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. 

డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో అధికులు వీరే
వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల  పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005-2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్‌, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది. 

ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం 
ఫాస్ట్‌పుడ్‌ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం..  ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్‌ తీసుకుంటే డిప్రెషన్‌ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఒత్తిడి తగ్గాలంటే..
► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి

నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్‌సైజ్‌లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న పెరుగుతాయి. క‌నుక వీటిని త‌గ్గించుకోవాలంటే నిత్యం త‌గినంత స‌మ‌యం పాటు నిద్ర‌పోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.

ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది.
-శెట్టె అంజి, సాక్షి వెబ్‌ డెస్క్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top