టేస్టీ దోస్త్‌

Special story to upma Pesarattu - Sakshi

భిన్న అభిరుచులు ఉన్నవారే  మంచి దోస్తులు అవుతారంటారు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా  టేస్టీ దోస్తుల్ని లాగించి ఎంజాయ్‌ చేయండి.

ఉప్మా పెసరట్టు
ఉప్మా కోసం కావలసినవి: బొంబాయి రవ్వ – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూన్‌; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పులు – ఒక టేబుల్‌ స్పూన్‌; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూన్‌; జీలకర్ర – ఒక టీ స్పూన్‌; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూన్‌; మినప్పప్పు – ఒక టీ స్పూన్‌; నూనె – ఒక టేబుల్‌ స్పూన్‌

తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ∙తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి నీళ్లు మరిగించాలి ∙మంట బాగా తగ్గించి బొంబాయి రవ్వ కొద్దికొద్దిగా పోస్తూ ఆపకుండా కలపాలి ∙జీడి పప్పులు జత చేసి బాగా కలిపి ఉడికించి, దింపేయాలి.

పెసరట్టు కోసం కావలసినవి:  పెసలు – రెండు కప్పులు; బియ్యం – 2 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – తగినంత

తయారీ: ∙ముందు రోజు రాత్రి ఒక గిన్నెలో పెసలు, బియ్యం, తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నీళ్లు ఒంపేసి, పెసల మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టి, పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి గరిటెతో పెసరపిండిని దోసెలా వేసి, చుట్టూ నూనె వేసి పెసరట్టును దోరగా కాల్చాలి ∙కొద్దిగా ఉప్మాను పెసరట్టు మీద ఉంచి, మధ్యకు మడిచి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙పెసరట్టుతో జత కలిసిన ఉప్మా పెడితే, మరో ఉప్మా పెసరట్టు అని అడగకుండా ఉండలేరు ∙భిన్న రుచుల స్నేహమంటే ఇదే.

ఐస్‌ క్రీమ్‌ దోసె

దోసెకు  కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – 2 కప్పులు; మెంతులు – అర టీ స్పూన్‌; ఉప్పు – తగినంత; నూనె – తగినంత; తేనె – కొద్దిగా; నట్స్‌ – కొద్దిగా

తయారీ:ముందురోజు రాత్రి ఒక పాత్రలో బియ్యం, మినప్పప్పు, మెంతులు వేసి తగిన న్ని నీళ్లు పోసి నానబెట్టాలి ∙మరుసటి రోజు నీళ్లు ఒంపేసి, బియ్యం మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బుకోవాలి ∙ఉప్పు జత చేసి మరోమారు గ్రైండ్‌ చేయాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక దోసెలు వేయాలి ∙పైన కొద్దిగా తేనె, నట్స్‌ వేయాలి.

ఐస్‌ క్రీమ్‌: ∙మార్కెట్‌లో మనకు నచ్చిన ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌ను తెచ్చుకోవాలి ∙దోసె కాలగానే, ఐస్‌ క్రీమ్‌ను దోసె మీద వేసి సమానంగా పరిచి మధ్యకు మడిచి, చల్లటి దోసెను వేడివేడిగా అందించాలి ∙కోపమనే వేడిని చల్లబరిచే స్నేహం అంటే ఇదేనేమో.

కోవా  కజ్జికాయ
కావలసినవి :స్టఫింగ్‌ కోసంనెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌; కొబ్బరి తురుము – 2 కప్పులు; బెల్లం తరుగు – ఒక కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూన్‌పైభాగం కోసంకోవా – పావు కేజీ; పంచదార పొడి – 6 టేబుల్‌ స్పూన్లు

తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి ∙బెల్లం తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఏలకుల పొడి జత చేసి, మిశ్రమం కొద్దిగా గట్టిపడేవరకు కలుపుతుండాలి. (ఎక్కువ గట్టిపడకూడదు. అలా చేయడం వల్ల తినడానికి బావుండదు) ∙మందపాటి అడుగు ఉన్న పాత్రలో పచ్చి కోవా వేసి సన్నని మంట మీద కలుపుతుండాలి ∙కొద్దిగా వేడిగా అయిన తరవాత పంచదార పొడి జత చేసి మరోమారు కలపాలి ∙పంచదార బాగా కలిసి కోవా గట్టిపడిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ∙బాగా చల్లారిన తరవాత చేతితో బాగా కలపాలి ∙తియ్యటి కోవా తయారవుతుంది ∙ముందుగా తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙కోవాను నిమ్మకాయ పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఒక కొబ్బరి ఉండను అందులో ఉంచి, కొబ్బరి ఉండ కనిపించకుండా కోవాతో మూసేయాలి ∙కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుని నునుపుగా మెరిసేలా ఉండ చేయాలి ∙తియ్యటి కోవా, తీపి కజ్జికాయతో చేసిన స్నేహంతో రెండింతల రుచి అందుతుంది. 

బ్రెడ్‌ ఆమ్లెట్‌
కావలసినవి :బ్రెడ్‌ స్లయిసెస్‌ – 4; నెయ్యి – కొద్దిగా; కోడి గుడ్లు – 4; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి తరుగు – ఒక టీ స్పూన్‌; ఉప్పు – కొద్దిగా; మిరప కారం – కొద్దిగా; నూనె – తగినంత

తయారీ: ముందుగా స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక బ్రెడ్‌ స్లయిసెస్‌ను దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనలు వేసి బాగా గిలకొట్టాలి ∙ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, మిరప కారం జత చేసి బాగా గిలకొట్టాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కోడి గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేయాలి ∙పచ్చిగా ఉండగానే బ్రెడ్‌ స్లయిస్‌ దాని మీద ఉంచి, మరి కాస్త ఆమ్లెట్‌ మిశ్రమం బ్రెడ్‌ మీద వేయాలి ∙చుట్టూ నూనె వేసి కాలాక, రెండో వైపు కూడా కాల్చి ప్లేట్‌లోకి తీసుకోవాలి ∙బ్రెడ్‌తో జత కట్టడంతో ఆమ్లెట్‌ డిమాండు పెరిగింది. 

గంగ – జమున
గంగ (కలాకండ్‌) కోసం కావలసినవి: స్వీట్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌ – ఒకటిన్నర కప్పు (400 గ్రాములు); పనీర్‌ – 2 కప్పులు; ఏలకుల పొడి – అర టీ స్పూన్‌; పంచదార – టేబుల్‌ స్పూన్‌; రోజ్‌ వాటర్‌ – టేబుల్‌ స్పూన్‌; పిస్తా పప్పు – 12; జీడిపప్పు లేదా బాదం పప్పు – 12; కుంకుమపువ్వు – కొద్దిగా 

తయారీ: ∙ బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, వేడయ్యాక సన్నగా తరిగిన పిస్తా పప్పు, సన్నగా తరిగిన జీడిపప్పు లేదా బాదం పప్పు, కుంకుమ పువ్వు రేకలు వేసి కొద్దిగా వేయించి, దించాలి ∙పనీర్‌ తురుముతుంటే విరిగిపోతుంటుంది. అందుకని డీప్‌ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి తీసి, తురిమి పక్కనుంచాలి ∙మందపాటి పాత్రలో స్వీట్‌ కండెన్స్‌డ్‌ మిల్క్‌ పోసి, తరిగిన పనీర్‌ వేసి బాగా కలపాలి ∙దీంట్లో పంచదార వేసి మళ్లీ కలపాలి ∙సన్నని మంట మీద ఈ మిశ్రమం ఉన్న పాత్ర పెట్టాలి ∙కండెన్స్‌డ్‌ మిల్క్‌లో పనీర్‌ కరిగి, అడుగు అంటకుండా మిశ్రమం చిక్కబడేలా ఉడకనివ్వాలి ∙మిశ్రమం చిక్కపడుతుందనగానే, కిందకు దింపి చల్లారనివ్వాలి ∙నోట్‌: గట్టి కలాకండ్‌ను స్పూన్‌తో అదిమి, కొద్దిగా పాలు పోసి తయారు చేసుకోవచ్చు. 

జమున (జామూన్‌) కోసం కావలసినవి:
పాల పొడి – ఒక కప్పు; మైదా – పావు కప్పు; నెయ్యి – ఒక టీ స్పూన్‌; ఉప్పు – చిటికెడు; బేకింగ్‌ సోడా – చిటికెడు; పెరుగు – ఒక టేబుల్‌ స్పూన్‌; పిస్తా పప్పులు – కొద్దిగా (అలంకరించడానికి)

తయారీ: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా పిండి, బేకింగ్‌ సోడా వేసి కలపాలి ∙నెయ్యి జత చేయాలి ∙కొద్దికొద్దిగా పెరుగు జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా కలపాలి ∙మిశ్రమం మృదువుగా వచ్చేలా జాగ్రత్త పడాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి సన్నని మంట మీద కాగనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న జామూన్‌లను నూనెలో వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి.

పంచదార పాకం కోసం: నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి – ఒక టీ స్పూన్‌; కుంకుమ పువ్వు – చిటికెడు; రోజ్‌ వాటర్‌ – ఒక టీ స్పూను

పాకం తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచాలి ∙పంచదార కరిగేవరకు కలపాలి (తీగ పాకం కూడా రాకూడదు) ∙రోజ్‌ వాటర్‌ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙తయారుచేసిన జామూన్‌లను పాకంలో వేసి గంటసేపు పక్కన ఉంచాలి ∙వెడల్పాటి కప్పులో స్పూన్‌తో ఒకవైపు జామూన్, మరోవైపు కలాకండ్‌ వేసి సర్వ్‌ చేయాలి. తెల్లగా ఉంటుంది కాబట్టి కలాకండ్‌ని గంగ అని బ్రౌన్‌ కలర్‌లో ఉంటుంది కాబట్టి జామూన్‌ని జమున అని అంటారు. ఈ రెండూ ఒకేసారి తినడంలో ఉండే తియ్యదనం, రుచి మధురంగా ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top