 
													తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత సమయమైనా గడపాలని నిపుణులు చెబుతుంటారు. పైకి చెప్పలేరు కానీ, పిల్లలు మొదట కోరుకునేది తమ పట్ల అమ్మానాన్న శ్రద్ధ చూపాలనే. అది కరువైనప్పుడే నిరాశకు లోనై తమ ప్రతికూల వైఖరి ద్వారా కోపాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో తప్పనిసరిగా కొంత సమయాన్ని గడపాలని మనోవైజ్ఞానిక నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఎన్ని పనులున్నప్పటికీ పిల్లలకు రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించడం వల్ల వారికి దగ్గరైన భావన పిల్లలతో పాటు పెద్దలకూ కలుగుతుందని అంటున్నారు. అలా గడిపేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు.
♦ రోజులో పిల్లలతో గడపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని స్థిర పరచుకోండి. రాత్రి భోజనానికి ముందు, లేదా నిద్రకు ఉపక్రమించే ముందరి సమయాన్ని అందుకోసం కేటాయించవచ్చు. ఆ కొద్దిసేపూ పుస్తకంలోని కథలు చదివి వినిపించడం, ఇంకా ఏదైనా ఆసక్తికర సంభాషణ వారితో జరపవచ్చు.
♦ ఏదైనా సరే మీరు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఒకే గదిలో కబుర్లు చెబుతూ ఉండటం కావచ్చు లేదా బయట ఏదైనా ఫంక్షన్‌కు వారితో కలిసి హాజరు కావచ్చు. మీరు మీ పిల్లలతో గడిపే ఆ సమయంలో వారి దృష్టి కేంద్రంగా మీరు మాత్రమే ఉండాలి.
♦ మీ పిల్లలకు కూడా.. మీరు సమయం కేటాయించడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. వారి కోసం మీ సమయాన్ని వినియోగిస్తున్నామని చెప్పీ చెప్పనట్లు వాళ్లకు తెలియజేయండి.
♦ పిల్లల కోసం మీరు ఎంచుకున్న సమయంలో పిల్లలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో మిమ్మల్ని అడగమనండి. అడిగాక మీరు ఓకే అనేస్తే పిల్లలు తమ మాటకు మీరు విలువ ఇస్తున్నారని గమనిస్తారు. అంతేకాదు, తమలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను మీతో పంచుకోడానికి ఆసక్తి చూపుతారు.
♦ ముఖ్యంగా పిల్లలకు కేటాయించిన సమయంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకండి. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు మీ స్వంత పనులు, లేదా వృత్తిపరమైన విధుల గురించి అస్సలు మాట్లాడకండి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
