అందమూ... వికారమూ | Siritual information by jagadish | Sakshi
Sakshi News home page

అందమూ... వికారమూ

Apr 29 2018 12:19 AM | Updated on Apr 29 2018 12:19 AM

Siritual information by jagadish - Sakshi

అతను ఓ చిత్రకారుడు. ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అందమైన మోము గల చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. చాలా కాలానికి అతను అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపం ఉన్న మోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఏదైనా ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు.

దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో అత్యంత వికారమైన ముఖం ఉన్న ఒక వ్యక్తి కనిపించేసరికి అప్పటిదాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

అతను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. ప్రతి మనిషిలోనూ అందమూ, వికారమూ ఉంటాయి. అయితే అతన్ని ఒకసారి అందంగానూ, మరోసారి వికారంగానూ చూపేది అతనున్న పరిస్థితులే!

– యామిజాల జగదీశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement