సమానతకు పట్టంగట్టిన స్వామీజీ

Shiva Kumar Swami Died In Karnataka - Sakshi

ఆయన కొందరికి భూమ్మీద నడిచే దేవుడు, కొందరికి 12వ శతాబ్ది సంఘసంస్కర్త బసవేశ్వరుడి రూపంలో జన్మించిన అవతారమూర్తి. వేలాది మంది పేదపిల్లలకు విద్యను అందించిన మానవతామూర్తి. మతపరమైన అనురక్తిని సమాజంలోని పేదల సంక్షేమానికి తోడ్పడేలా చేసిన నిజమైన యోగి. కర్ణాటకలోని తుమ్కూరులో సుప్రసిద్ధ శివగంగ మఠాధిపతి శివకుమారస్వామికి సమాజం కల్పించిన అపరూప విశేషణాల్లో ఇవి కొన్ని మాత్రమే. 112 సంవత్సరాల సుదీర్ఘ జీవితం తర్వాత సోమవారం శివైక్యం చెందిన సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామీజీ లింగాయతులకు ఆరాధ్య దైవం. 1907 ఏప్రిల్‌ 1న మాగడి సమీపంలోని వీరపుర గ్రామంలో జన్మించిన శివకుమార స్వామి 1927–30లలో బెంగళూరులోని సెంట్రల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 1930లోనే విరక్తాశ్రమం స్వీకరించారు. ఇంగ్లిష్, కన్నడ, సంస్కృత భాషల్లో నిష్ణాతుడైన స్వామి తన జీవిత పర్యంతంలో వివాదాలకు దూరంగా మెలిగారు. కర్ణాటకలో శక్తివంతమైన లింగాయత్‌ కమ్యూనిటీ దన్నుతో ఆయన నేతృత్వంలోని సిద్ధగంగ పీఠం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూనే కర్ణాటకలో అసాధారణమైన రాజకీయ ప్రభావానికి నెలవుగా మారింది. ఇక విద్య, ఆరోగ్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో ఆయన అందించిన సేవలు నిరుపమానమైనవి. బసవన్న నిజమైన అనుయాయిగా అన్ని మతాలకు, కులాలకు చెందిన వేలాది మంది పిల్లలకు ’త్రివిధ దాసోహ’ బాటలో  ఉచిత విద్య, ఉచిత భోజనం, ఉచిత ఆశ్రయం అనే సౌకర్యాలను దశాబ్దాలుగా అందిస్తూ వచ్చారు.

15వ శతాబ్దంలో గోసల సిద్ధేశ్వర స్వామి నెలకొల్పిన సిద్ధగంగ మఠాధిపతిగా శివకుమారస్వామి 1941లో బాధ్యతలు స్వీకరించారు. మఠం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో సంస్కృతం తప్పనిసరి పాఠ్యాంశంగా ఉంటోంది. అన్ని మతాల, కులాల పిల్లలకు వీటిలో ప్రవేశం ఉంది. కర్ణాటకలో నేడు శివగంగ మఠ శాఖలు నెలకొల్పిన 126 విద్యా సంస్థల్లో 30 వేలమంది విద్యార్థులు విద్యనార్జిస్తున్నారు. ప్రతి సంవత్సరం శివగంగ మఠ శాఖల్లో దాదాపు 9 వేలమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా, ప్రతి రోజూ 6 వేలమంది విద్యార్థులకు, యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ‘పనే ఆరాధన’ అనేది బసవ తత్వంలో ముఖ్యమైన భావన. రోజుకు 18 గంటలపాటు పనిచేస్తూ వచ్చిన శివకుమార స్వామి బసవ సంప్రదాయాన్ని తు.చ. తప్పకుండా పాటించారు. మఠంలో ఆశ్రయం కోరి వచ్చిన వారికి భోజన వసతి కల్పన కోసం విరాళాలు అందించాలని స్వామి ఇచ్చిన పిలుపునకు స్పందించిన చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆనాటినుంచి తమ తొలి పంటను మఠానికే అర్పించసాగారు. ఆధ్యాత్మిక, సామాజిక రంగాల్లో వేసిన ప్రభావానికి గుర్తింపుగా 2007లో నూరేళ్లు నిండిన సందర్భంగా  ఆయనకు కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన కర్ణాటక రత్న అవార్డును బహూకరించింది. 2015లో కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది.

మనుషులందరూ సమానులే అని స్వామీజీ చాటి చెప్పారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ విశిష్ట ప్రభావం కలిగించిన ఘటనలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించడంలో ఊగిసలాటలకు గురికాలేదు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించకూడదన్న అభిప్రాయాలను తోసిపుచ్చి, బాబ్రీ కూల్చివేతను నిష్కర్షగా ఖండించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నుంచి నేటి ప్రధాని నరేంద్రమోదీ వరకు స్వామీజీని తప్పకుండా సందర్శించి ఆశీస్సులు తీసుకోవడం పరిపాటయింది. స్వామి నేతృత్వంలో సిద్ధగంగ మఠం ఇంజనీరింగ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్, నర్సింగ్, ఫార్మసీ, టీచర్‌ ట్రెయినింగ్‌ వంటి రంగాలపై అనేక కాలేజీలను, సంస్కృత, కన్నడ పాఠశాలలను, డజన్ల కొద్దీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను, రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ–యూనివర్సిటీ క్యాంపస్‌లను నిర్వ హిస్తోంది. మత, కుల రహితంగా 9 వేల మంది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారాన్ని సమకూర్చుతోంది. బసవేశ్వరుడి తర్వాత శైవమతంపై, సమాజంపై ఇంతటి ప్రభావం వేసినవారు మరొకరు లేరని కీర్తి గడిం చిన శివకుమారస్వామి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఆధ్యాత్మిక సేవను సమాజ సేవగా మార్చిన అసాధారణ మూర్తి.
– కె. రాజశేఖరరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top