సేవకు వేళాయెరా!

Services in the presence of Kanakadurgamma ammavaru - Sakshi

కొలిచెడివారికి కొంగుబంగారంగా భాసిల్లే కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే లక్షకుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమాల్లో భక్తులు పాల్గొని ఆనందపరవశులవుతారు. అమ్మవారికి నిత్యం అలంకరించే వస్త్రాలను భక్తులు తమ చేతుల మీదుగా అందించేందుకు ఈ సేవను ప్రవేశపెట్టారు. ప్రతిరోజు తెల్లవారుజామున 2–30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచిన తర్వాత మూడు గంటలకు, సాయంత్రం 4–30 గంటలకు అమ్మవారి పట్టు చీర, పూజ సామగ్రి, పసుపుకుంకుమలను ఉభయదాతలు ఆలయ అర్చకులకు సమర్పించగా, మంగళవాద్యాల నడుమ అమ్మవారికి వస్త్రాలను అలంకరించిన తర్వాత ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కల్పిస్తారు. ప్రసాదాలతో పాటు అమ్మవారికి అలంకరించిన చీరను దాతలకు అందిస్తారు. ఈ సేవలో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ధన, వస్తు, వాహనాలతో తులతూగుతారని భక్తుల విశ్వాసం. 

అమ్మవారికి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఖడ్గమాల అర్చనను సుమారు గంట పాటు అంతరాలయంలో ఉభయదాతలు కూర్చుని జరిపించుకోవచ్చు. నిత్యం 12 మంది ఉభయదాతలకు మాత్రమే ఈ పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. తలచిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగి, విజయం సాధించడానికి ఖడ్గమాల పూజ ప్రశస్థమైనదని భక్తుల విశ్వాసం. దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు రాజగోపురం దగ్గర నిత్యం శాంతికళ్యాణం జరుగుతుంది. వివాహం కానివారు ఈ శాంతి కల్యాణం చేయించుకుంటే, ఆరు నెలల కాలంలో వివాహం అవుతుందని విశ్వసిస్తారు. చండీ సప్తశతీ  హోమం చేయడం వల్ల కామక్రోధాలు అదుపులో ఉంటాయని, శత్రుబాధలు తొలగి, విద్యా జ్ఞానాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. అమావాస్య, పౌర్ణమి పర్వదినాలతో పాటు దసరా ఉత్సవాలలో భక్తులు చండీయాగాన్ని జరిపించుకుంటారు.
 
శ్రీచక్ర నవావరణార్చన
సర్వ పరివార దేవతా సహిత రాజరాజేశ్వరీదేవికి జరిగే పూజా కార్యక్రమమే శ్రీచక్ర నవావరణార్చన. ఆలయానికి ఉత్తరదిశగా ఈ అర్చన జరుగుతుంది. పంచలోహాలతో ప్రత్యేకంగా తయారుచేసిన శ్రీచక్రాన్ని ఆలయ అర్చకులు ఉభయదాతల పేరిట అర్చిస్తారు. శత్రుబాధలు, గ్రహ దోషాలు, కుటుంబ కలహాలు తొలగిపోతాయనే నమ్మకంతో శ్రీచక్ర పూజ జరిపించుకుంటారు. 

నిత్య లక్ష కుంకుమార్చన
అమ్మవారి ఆలయానికి ఈశాన్య భాగంలో నిత్యం దుర్గమ్మకు లక్ష కుంకుమార్చన జరుగుతుంది.  సంపూర్ణ సాత్విక మంగళ ద్రవ్యమైన కుంకుమ అమ్మవారికి ప్రీతికరం. అమ్మవారి ç నామాన్ని వంద పర్యాయాలు పఠిస్తూ, ప్రతి నామానికి కుంకుమతో అర్చిస్తారు. ఈ అర్చన చేసిన భక్తులకు అమ్మవారి అనుగ్రహంతో పాటు కోరిన కోర్కెలు తీరతాయని, సకల కష్టాలు తొలగుతాయని అర్చకులు చెబుతారు. 

సరస్వతీదేవిగా...
సరస్వతీదేవి అవతారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజు విద్యార్థులకు ఉచిత దర్శనంతో పాటు కలం, అమ్మవారి కంకణం, అమ్మవారి ఫోటోను ఉచితంగా అందచేస్తారు. ప్రతినెల మూల నక్షత్రం రోజున దుర్గగుడిలో సరస్వతి హోమం నిర్వహిస్తారు. 

అంతరాలయం– ఆర్జి్జత సేవలు:
వస్త్రాలంకరణ–రూ. 25,000 (ఉదయం 3 గం.కు, సాయంత్రం 4–30 గం.కు), ఖడ్గమాలార్చన –రూ. 5,116 (తెల్లవారుజామున 4–00 గం.కు), త్రికాలార్చన –1,500 రూపాయలు (ఉదయం 6 గం.కు, సా. 5 గం.కు), స్వర్ణపుష్పార్చన – రూ. 2,500 (గురువారం సాయంత్రం 4–00)అంతరాలయం వెలుపల ఆర్జి్జత సేవలు: నవగ్రహ హోమం–రూ. 540 (ఉ. 6 గం.కు), రుద్రహోమం రూ.1,000 (ఉ. 7 గం.కు ), సర్పదోష నివారణ రూ. 250 (ఉ. 9 గం.కు), చండీహోమం రూ. 1,000 (ఉ. 7–30 గం.కు), లక్ష కుంకుమార్చన రూ. 1,000 (ఉదయం 7–30 గం.కు), శ్రీచక్రనవావరణార్చన రూ. 1,000 (ఉ. 7–30 గం.కు), శాంతి కళ్యాణం రూ. 1,000 (ఉదయం 9 గం.కు), సౌభాగ్యప్రదాయినీ వ్రతం రూ. 1,116 (ఉదయం 11 గం.కు) పంచహారతులు రూ. 500 (సాయంత్రం 6 గం.కు), పల్లకీసేవ రూ. 516 (సాయంత్రం 7 గం. కు), దేవస్థానం ఆర్జిత టికెట్ల కౌంటర్, మీ సేవా, ఛీuటజ్చఝఝ్చ.ఛిౌఝ వీటిలో.. టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఖడ్గమాలార్చన, తెల్లవారుజామున జరిగే వస్త్రాలంకరణ సేవలకు వారంరోజులు ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలి. లక్ష కుంకుమార్చన, చండీయాగం, శాంతి కళ్యాణం, స్వర్ణపుష్పార్చన పూజలకు టికెట్లు నిత్యం అందుబాటులో ఉంటాయి. 
– ఎస్‌.కె.సుభానీ, ఇంద్రకీలాద్రి, విజయవాడ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top