ఎంత సంపాదించామన్నది కాదు..పొదుపు | Sakshi
Sakshi News home page

ఎంత సంపాదించామన్నది కాదు..పొదుపు

Published Wed, Mar 26 2014 1:13 AM

ఎంత సంపాదించామన్నది కాదు..పొదుపు

 ‘ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో జీవితాన్ని అనుభవిస్తాం’ అనే వాక్యం అప్పుడప్పుడు వింటూనే ఉంటారు. ఎక్కువ యువత నోటినుంచి వినపడుతుంది. అయితే సంపాదించి నాలుగు పైసలు దాచుకునే వయసు కూడా ఇదేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగం చేసే కొత్తల్లోనే పొదుపుని అలవాటు చేసుకోవాలి. పెళ్లయ్యాక...పిల్లలు పుట్టాక బాధ్యతలు నెత్తినపడ్డాక నేర్చుకోవాలంటే కష్టం. ఉద్యోగం చేసే అమ్మాయికి తల్లిగా మీరు చెప్పాల్సింది చెప్పాలి. అమ్మాయిలు కొన్ని ముఖ్యమైన విషయాలు విని ఆచరణలో పెట్టాలి.
   
 మీ పిల్లలకి పాకెట్‌మనీ ఇవ్వడంతో పాటు పొదుపు మంత్రం కూడా చెప్పాలి. ఇచ్చిన డబ్బునంతా ఖర్చుపెట్టకుండా కొంత డబ్బుని పక్కన పెట్టుకోవడం అలవాటు చేయండి. పిల్లలు అడిగినపుడు అన్ని సమయాల్లో డబ్బులుండకపోవచ్చనే ప్రాక్టికల్ విషయాల్ని చెబుతుండాలి.
   
 పొదుపు అలవాటు కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎదుర్కొనే ఆర్థిక సమస్యల గురించి ముఖ్యంగా టీనేజ్‌అమ్మాయిలకు ఉదాహరణలతో వివరించి చెప్పండి. మీ అనుభవాలను పిల్లలకు చెప్పడం వల్ల వారికి అప్పటికి అర్థమవకపోయినా భవిష్యత్తులో కచ్చితంగా గుర్తుకొచ్చి జ్ఞానం తెప్పిస్తాయి.
   
 పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలనే తల్లిదండ్రులు కలలు కంటారు కానీ, వారికి పొదుపు లక్షణాలు ఎంతవరకూ అలవడ్డాయనే విషయం గురించి పెద్దగా ఆలోచించరు. ఉద్యోగం వచ్చిన కొత్త కదా అని కొందరు తల్లిదండ్రులు మొదటి మూడు నాలుగు నెలలు జీతం గురించి పిల్లల్ని అడగరు. దీనివల్ల అప్పటికే వారికి సొంత ఖర్చులు అలవాటైపోతాయి. అవసరానికి మించి ఎక్కువగా ఖర్చుపెట్టుకోవడాన్ని తొలిరోజుల్లోనే ఖండిస్తే తర్వాత ప్రత్యేకంగా సాధన చేసే పనితప్పుతుంది.

    
పెళ్లికి ముందు తర్వాత కూడా పర్సనల్‌గా కొంత డబ్బు ఉండాలన్న ఆలోచననను బలంగా  మనసులో నాటుకునేలా అమ్మాయిలకు మార్గనిర్దేశం చేయాలి. లేదంటే ‘ఏదన్నా అవసరమొస్తే...అమ్మానాన్న ఉన్నారుగా, భర్త చూసుకుంటారు కదా!’ అనే ధీమాలో ఉంటారు. ఉద్యోగం చేసుకునే మహిళలు కూడా ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు.
    
చాలామంది అమ్మాయిలు పెళ్లయిన కొత్త కదా అని మూడునాలుగేళ్ల వరకూ పొదుపు మాటెత్తకుండా ఖర్చుపెడుతుంటారు. కానీ భవిష్యత్తులో వచ్చే బాధ్యతల వల్ల ఖర్చులే తప్ప ఆదాయానికి అవకాశం ఉండదని ఆలస్యంగా తెలుసుకుంటారు. ఇలాంటి పొరపాట్లు జరక్కుండా ఉండాలంటే పెళ్లికి ముందే మీ సంసారాన్ని ఉదాహరణగా చూపుతూ ఆర్థిక విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుండండి.
 

Advertisement
 
Advertisement
 
Advertisement