ద్వైదీభావాల సంచారి

sakshi literature article on pooduri rajireddy - Sakshi

ఈ ప్రపంచం మీద కుతూహలమే రాజిరెడ్డిని రచయితగా చేసిందని నేననుకుంటాను. బయట కనిపించినదానిని దృశ్యమానం చేసుకుంటూ లోపల కలిగే ఆలోచనలను మననం చేసుకుంటూ ప్రతిదీ తెలుసుకోగోరే బాటసారి అతడు. తనే ప్రశ్నలు వేసుకుని తనే సమాధానాలు చెప్పుకునే జిజ్ఞాసాపరుడు.

రచయితల అంతశ్చేతన నుంచే కథనో కవితనో పుడుతుందంటారు. రాజిరెడ్డి రచనలన్నీ బౌద్ధిక స్పృహలోంచే వచ్చినట్టుంటాయి. రచయిత ఉనికితోపాటు అతడు తర్కించుకుని నిర్ధారించుకున్న వాస్తవమే డామినేట్‌ చేస్తుంటుంది. ఒకపక్క బయటనుంచి పిలిచే సజీవ జీవిత సాంసారిక లోకం, మరొకపక్క లోపల ఆకర్షించే సన్యాసి వైరాగ్యం. ఈ రెండింటిలో దేనినీ వదులుకోలేని ద్వైదీభావాల సంచారి అతడు. తనతో తనే సంవాదం పెట్టుకుంటాడు. ఆ వాదప్రతివాదాల మధ్య నిలబడి కథ చెబుతాడు.

స్వతహాగా రాజిరెడ్డి తనదైన జీవితాన్ని అన్వేషించే భావుకుడు. కాని దృక్పథపరంగా జీవితానికీ, అందులోని వాస్తవానికీ లొంగి ఉన్నాడు. ఆదర్శాలను గ్లోరిఫై చేసుకునే భ్రమలు లేవు. కథల్లోని నాటకీయత మీద, కల్పనలోని అతిశయోక్తి మీద ఏవగింపు ఉంది. ఇది కథకుడి నైపుణ్యానికి సంబంధించిన విషయం కాదు, దృక్పథానికి చెందిన ఎంపిక. మరి అతడు అనుకున్నదానికి అతీతంగా ఉండే కల్పన ఉండదా? తను కల్పనను ఎంత బాగా రాయగలడో ‘రెక్కల పెళ్లాం’ చెబుతుంది. రెక్కలు, తురాయి వంటి ప్రతీకలను అవతల ఉంచి కథ నడిపిన తీరులో సహజసిద్ధమైన ప్రతిభ కనిపిస్తుంది.

వాస్తవంలోని విషాదం, నిజ జీవితంలోని హిపోక్రసీ అతడికి కనపడలేదా అంటే ‘మంట’ వాస్తవంలోని హిపోక్రసీని ఏవగించుకుంటుంది. అందులోని ప్రొటాగనిస్ట్‌ తన నిర్ణీత సమయపు కొలతలకు అందని సరిపడని విషయాలన్నిటినీ తిరస్కారంతో నిర్దాక్షిణ్యంగా నరుక్కుంటూ పోతాడు. కర్కశంగా ఈ ప్రపంచంతో విభేదిస్తాడు.  చివరికి ఊహలో ఊరట పొందుతాడు. అనేక వాస్తవాల సారాంశం చిట్టచివరికి ఒక కళాత్మకమైన కల్పనగా రూపొందడాన్ని ‘తమ్ముడి మరణం’లో చూడవచ్చు. నిజ జీవితంలోంచి తీసుకుని రాసినా ఈ కథ వాస్తవాన్ని దాటి కళాత్మకమైన కథగా రూపొందింది.

’చింతకింది మల్లయ్య ముచ్చట’ ఒక చిత్రకారుడు సగంలో విరమించిన ఒక గొప్ప వర్ణ చిత్రపటంలా నాకనిపిస్తుంది. కథని ఒక సంఘటనగా చూడక ఒక వ్యక్తి జీవితం మొత్తం కథలో వ్యక్తం కావాలని ఏ కథా చెప్పదు. సాహిత్యం జీవితాన్ని పూర్తిగా వ్యక్తం చేయలేదనేది ఎప్పటికీ నిర్వివాదం. తను చూసే చరాచర జగత్తులో కథకుడు దేన్ని కథ చేయాలనుకుంటున్నాడో, ఏది అతడిని కథ రాయడానికి పురిగొల్పిందో అదే అతడి దార్శనికత. మానసిక ఆధిపత్యం సాధించడం, ఎలుగుబంటితో హీరోలా పోరాడటం, వీటికి అతీతంగా చింతకింది మల్లయ్య జీవితాన్ని పట్టిచ్చే మాట, సంఘటన కథకి దొరికేది ఏదీ ఉండదా? ఒక సంఘటనని కథ చేయడానికీ అందులోని కాల్పనికమైన నాటకీయత చూడటానికీ మధ్య తేడా గుర్తించగలిగితే ఇది సమస్య అనిపించదు. ఇంకాస్త ముందుకెళ్లి అసలు డ్రామాలేని కథ ఉండదు అనికూడా అనగలను. పరిహరించుకోవాల్సింది అందులోని కృతకత్వాన్నే. నాకైతే చింతకింది మల్లయ్య చెప్పిన ముచ్చట్లలో నాటకీయతకి ఆస్కారం లేని అనేక కథలు కనిపించాయి.  

రాజిరెడ్డి వచనానికి వర్ణనలతోపాటు తర్కం అదనపు అలంకారం. అయితే ఏ తర్కమైతే రాజిరెడ్డి వచనాన్ని, దృక్పథాన్ని పరిపుష్టం చేస్తున్నదో ఆ తర్కమే ఒక్కోసారి అతడి కథనానికి అవరోధం కూడా అవుతున్నది. అదే అతడిని భౌతికవాది అనుకునేట్లుగా చేస్తున్నది. అడుగడుగునా అతడి ‘నేను’ అతడికి అడ్డ్డం పడుతుంటాడు. ఈ పుస్తకంలో కొన్ని కథల ముగింపు కథాంశాన్ని పట్టిస్తుంది. ఎక్కువ కథల్లో అప్పటిదాకా చెప్పిన భావధారకి వ్యతిరేకంగా రచయిత యూటర్న్‌ తీసుకుంటాడు. అదికాకుంటే ద్వైదీభావంలో ఉన్న మనిషి ప్రాక్టికల్‌గా ఆలోచించి జీవితంలోని వాస్తవానికి లొంగిపోవడం జరుగుతుంది.

రాజిరెడ్డి కథల్లో కల్పన తక్కువ. కలలు అసలే ఉండవు. వర్ణనలు ఉంటాయిగాని మితిమీరిన అలంకరణలు ఉండవు. రాజిరెడ్డికి ఏది అందంగా కనిపించింది అని ఈ పుస్తకాన్ని మళ్ళీ తిరగేస్తే ‘కాశెపుల’్లలో అతడికి బాల్యంలో  బతుకమ్మ పండుగనాటి గునుగుపువ్వు దొరికింది. ‘చినుకు రాలినది’లో షేరింగ్‌ ఆటోలో పసిపాప కళ్లలో దివ్యమైన వెలుగు కనిపించింది. కథ చివర కొడుకు నవ్వు ముఖాన్ని చూడటానికి వెళ్లే అతడి ఉత్సాహాన్ని ఆటోవాడి దగ్గరనించి తిరిగిరాని రూపాయి కొంతయినా తగ్గించడం కథ పూర్వరంగాన్ని కరప్ట్‌ చేసినట్లు అనిపించింది.

ఒక కథ పుట్టడానికి ముందు ఏ నిబంధనలూ ఉండవు. ఏ సూత్రాలు అడ్డు పడవు. అది పూర్తయ్యాక అన్ని కొలతలూ సమానంగా ఉన్నాయా, కథనం కథాంశానికి అనుగుణంగా ఉందా? వస్తువుని ఎలా ఇమిడ్చాడు అనే చర్చ ఎప్పుడూ ఉంటుంది కాని పుస్తకంలో రచయిత అనుభవాలు భవిష్యత్తులోని వర్తమానానికి ఏ మేరకు వర్తిస్తాయి అన్నది కూడా పుస్తకానికి అదనపు విలువ అనుకుంటాను. అలా చూస్తే ఇందులోని కాశెపుల్ల, తమ్ముడి మరణం, రెక్కల పెళ్లాం, మంట లాంటి కథలు కాలానికి నిలబడతాయనే నా నమ్మకం.

ఒక సంకలనం తెచ్చాక కథకుడు రూపాంతరం చెందుతాడంటారు. ఈ మలుపు తరవాత ఇకముందు రాజిరెడ్డి ఎలాంటి కథలు రాయబోతున్నాడన్నది ఆసక్తికరమే. నేనైతే అతడు తన బాహ్యప్రపంచపు నలుగులాట కాస్తంత విడిచిపెట్టి ఇంకాస్త కాల్పనికతలోకి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. రాజిరెడ్డి తన బయటినుంచి లోపలికి వెళ్లే దారికంటే తన లోపలినుంచి బయటకు వచ్చేదారి నాకు మరింత కళాత్మకంగా కనిపిస్తుంది.

చింతకింది మల్లయ్య ముచ్చట – ఇతర కథలు
రచన: పూడూరి రాజిరెడ్డి పేజీలు: 156; వెల: 144  ప్రచురణ: ఛాయ రిసౌర్సెస్‌ సెంటర్, హైదరాబాద్‌.
ఫోన్‌: 9848023384

బి.అజయ్‌ప్రసాద్‌
9247733602

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top