శరీరం లేకపోతేనేం...

Manmadhudu Special Story - Sakshi

చెట్టు నీడ

మన్మథుడు మనుషుల మనసులో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని జన్మతః కలిగినవాడు. తనకు కలిగిన వరం ఎంతమేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు ఆ మన్మథుడు స్వయంగా తన తండ్రి మీదే బాణాలను సంధించాడట. దాంతో కోపగించుకున్న తండ్రి మున్ముందు శివుని మూడోకంటికి భస్మం అయిపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణానికే ఉపయోగపడింది. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి భస్మం అయిపోయిన తరువాత శివుడు విరాగిగా మారిపోయాడు. సుదీర్ఘమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు, ఆ శివునికి కలిగే సంతానం వల్లే తనకు మృత్యువు ఉండాలన్న వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంలో కూరుకుపోయిన శివునికి సంతానం కలుగదన్నది అతని ధీమా!

శివుని మనసుని ఎలాగైనా మరలుగొల్పి, పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనసుని లగ్నం చేయాలని భావించారు దేవతలు. ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మథుడే కీలకంగా తోచాడు. పార్వతీదేవి, శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో అతని మీదకు తన పూలబాణాలను సంధించాడు. దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మథుని భస్మం చేశాడు. అయితేనేం! అప్పటికే ఆయన హృదయానికి మన్మథ శరాలు గుచ్చుకునిపోయాయి. తన కంటి ఎదురుగా ఉన్న పార్వతి మీదకి దృష్టి మరలింది. మన్మథుని భార్య రతీదేవి వేడుకోళ్లతో ఆయన మనసు కరిగింది. మన్మథుని మళ్లీ జీవింపచేశాడు. కానీ చేసిన తప్పుకి శిక్షగా ఇక మీదట మన్మథుడు ఎలాంటి శరీరమూ లేకుండా ఉండిపోతాడని శపించాడు. అప్పటి నుంచీ మన్మథునికి ‘అనంగుడు’ అన్న పేరు స్థిరపడిపోయింది.

మన్మథుడు అనంగుడే కావచ్చు. కానీ అవసరం అయినప్పుడు ప్రేమికులను కలిపేందుకు సర్వసన్నద్ధంగా బయల్దేరతాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుకే అతని వాహనం, తియ్యటి చెరుకుగడే అతని విల్లంబు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే అతని బాణాలు... వాటితో అతను మనసులను మధించి వేయగలడు. అలా మనసుని మథించేవాడు కాబట్టి మన్మథుడు అని అంటారట.– డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top