కిడ్నీ కౌన్సెలింగ్‌

Kidney Counseling - Sakshi

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత జాగ్రత్తలేమిటి?
నాకు 49 ఏళ్లు. ఇటీవలే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నాను. నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – రామ్‌ప్రసాద్, మహబూబాబాద్‌
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ తర్వాత శరీరం దాన్ని నిరాకరించకుండా (రిజెక్ట్‌ చేయకుండా) ఉండటానికి కొన్ని మందులు జీవితాంతం వాడుతూ ఉండాలి. కొందరు రోగులు కిడ్నీ బాగానే పనిచేస్తుంది కదా అని మందులు మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీని శరీరం రిజెక్ట్‌ చేస్తుంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ అయిన తర్వాత రోగుల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువ.

జలుబుగానీ, జ్వరం గానీ, ఇతరత్రా ఏ ఇబ్బంది తలెత్తినా తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్‌ పర్యవేక్షణలో లేకుండా ఎలాంటి ఇతర మందులూ వాడకూడదు. అప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకున్న ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. ఇన్ఫెక్షన్‌ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకూడదు. ఇంటి పరిసరాలను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బీపీ, షుగర్‌ ఉన్నట్లయితే వాటిని నియంత్రించుకుంటూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

కిడ్నీ పనిచేయడం లేదంటున్నారు... లక్షణాలేమీ కనిపించడం లేదు
నా వయసు 64 ఏళ్లు. రెండేళ్లుగా హైబీపీతో బాధపడుతున్నాను. నిరుడు రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్‌ 6 మి.గ్రా., యూరియా 120 మి.గ్రా. వచ్చింది. నా కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని చెబుతున్నారు. కానీ నాకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ కనిపించడం లేదు. బయటకు ఏ లక్షణాలూ కనిపించకుండానే లోపల్లోపల ఏమైనా సమస్యలు ఉంటాయా? నా పరిస్థితి ఏమిటి? దయచేసి వివరించండి. – బి. రాంబాబు, అనకాపల్లి
మీరు రాసిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీ రెండు కిడ్నీల పనితీరు దాదాపు 50 శాతం తగ్గినట్లు భావించవచ్చు. కొందరిలో వ్యాధి లక్షణాలూ కనిపించకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం తగ్గినప్పుడు సమస్యలు తెలుస్తాయి. అందుకే మీలాంటి వారు ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. బీపీ, షుగర్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారు, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లకు క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివాళ్లు ఏటా... ఒకసారి కిడ్నీ ఎంత శాతం పనిచేస్తోందో తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతగా కిడ్నీలను కాపాడుకునే వీలుంటుంది.

మూత్రం ఎర్రగా వస్తోంది... ఏదైనా సమస్యా?
నా వయసు 34 ఏళ్లు. గత ఐదేళ్ల నుంచి అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. ప్రతిసారీ రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – ఎల్‌. గౌతమ్, విజయవాడ
మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్‌ ఉండటం, మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్‌ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోండి. మూత్రపరీ„ý  కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్‌ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్‌ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్‌ టెస్ట్‌ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్‌ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది.

డయాలసిస్‌ వారానికి రెండుసార్లు సరిపోదా?
నా వయసు 48 ఏళ్లు. నేను ఏడాదిగా క్రానిక్‌ కిడ్నీ డిసీజ్‌ (సీకేడీ)తో బాధపడుతున్నాను. వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటున్నాను. ఒకటి లేదా రెండుసార్లు చేయించుకుంటే సరిపోదా? – లక్ష్మీనారాయణ, మెదక్‌
మీరు రాసిన వివరాల ప్రకారం చూస్తే మీ కిడ్నీ పది నుంచి పదిహేను శాతం వరకు పనిచేస్తోందని అనుకోవచ్చు. ఈ దశలో మీరు తప్పనిసరిగా వారానికి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సిందే. ఒకవేళ మీరు అలా చేయించుకోకపోతే దాని దుష్ప్రభావం ఇతర అవయవాల మీద పడే అవకాశం ఉంది. ఆ దుష్పరిణామాలతో గుండెకు కూడా సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాదు మీ జీవననాణ్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకోవాల్సిందే.

నేను బీపీకి మందులు వాడక తప్పదా?
నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించినప్పుడు ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – రామ్మోహన్, జగిత్యాల
మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్‌ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ స్కానింగ్, క్రియాటినిన్‌ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు తగ్గించాలి. స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి.

- డాక్టర్‌ విక్రాంత్‌రెడ్డి, సీనియర్‌ నెఫ్రాలజిస్ట్, కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top